YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 15 September 2012

మరోసారి మొట్టికాయలు!


సీబీఐ అసలు పేరు కేంద్ర దర్యాప్తుసంస్థ. కానీ, జనం దాన్ని కాంగ్రెస్ దర్యాప్తు సంస్థగా గుర్తించి చాలాకాలమే అయింది. తన రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ అస్త్రం ప్రయోగించడం కాంగ్రెస్‌కు అలవాటయిపోయిందన్నది అన్ని వైపులనుంచీ వినవస్తున్న విమర్శ. ఇంతవరకూ విభిన్న రాజకీయ పక్షాలకు చెందినవారు మాత్రమే ఈ ఆరోపణలు చేస్తూ వచ్చారు. శుక్రవారం నాడు -సెప్టెంబర్ 21న- సాక్షాత్తూ సుప్రీం కోర్టే సీబీఐ దర్యాప్తు తీరుతెన్నులను తప్పుపట్టడం గమనార్హం. ఈ సంవత్సరం మే27 సాయంత్రం ఏడుంపావుకు సీబీఐ కడప ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏ కేసులోనయినా, రిమాండ్‌లో ఉంచిన వ్యక్తిని 90 రోజులకు మించి కస్టడీలో కొనసాగించకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ, సీబీఐ తెగబడి ఆ నిబంధనలను ఉల్లంఘించింది.

ఈ (అ) క్రమం కొనసాగించే నిమిత్తం సీబీఐ ఇప్పటివరకూ మూడు చార్జిషీట్లను రూపొందించింది. మరిన్ని చార్జిషీట్లు తయారీలో ఉన్నట్లు కూడా సుప్రీం కోర్టులో ప్రకటించింది కూడా. జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోరిన ప్రతిసారీ ‘దర్యాప్తు కీలక దశలో ఉంది’ అనిచెప్పడం సీబీఐకి పరిపాటిగా మారింది. శుక్రవారం నాడు కూడా అదే పాచిపాట పాడింది సీబీఐ.మూడురోజుల పాటు సీబీఐ ప్రశ్నలకు ఓపికగా జవాబిచ్చి సహకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని -మర్నాడు కోర్టుకేసుకు హాజరు కావలసి ఉండగా- ఎందుకు అరెస్ట్ చెయ్యవలసి వచ్చిందని సుప్రీం కోర్టు సీబీఐని నిలదీసింది. ‘మొత్తం కేసుకు సంబంధించి గతంలో మూడు చార్జిషీట్లు దాఖలు చేశారు. సాక్షుల్ని ప్రభావితులను చేస్తారన్న అభియోగం కూడా పిటిషనర్‌పై మోపలేదు. మూడు రోజులపాటు మీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. ఇంత జరిగిన తర్వాత, మర్నాడు కోర్టులో హాజరు కావలసిన పిటిషనర్‌ను ఎందుకు అరెస్ట్ చెయ్యవలసివచ్చింది?’ అన్నది సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్నాస్త్రం. దీనికి సాక్ష్యాధారాలతో సహా సమాధానం చెప్పడంలో సీబీఐ విఫలమయింది.

జగన్మోహన్ రెడ్డి సంస్థల్లోకి నిధులు అక్రమంగా వచ్చాయన్న ఆరోపణను -అదేదో నిరూపిత సత్యంలా- తొంభయ్ పదకొండో సారి వల్లించబోవడాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం అడ్డుకుంది. ‘అవన్నీ మీ వాదనలూ, ఆరోపణలూ మాత్రమే’నని స్పష్టం చేసింది. అలాగే, జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని హైకోర్టులో ఆరోపించిన సీబీఐ, క్రమంగా ఆ మొత్తాన్ని తగ్గిస్తూ వచ్చి 20 కోట్లకు వచ్చిన విషయాన్ని కడప ఎంపీ తరఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, సీబీఐ న్యాయవాది ధోరణిలో ఎలాంటి మార్పూ రాలేదు. మళ్లీ అవే ఆరోపణలను నిత్య సత్యాలన్నట్లుగా వల్లించడానికి ధర్మాసనం అభ్యంతరం చెప్పింది. ‘ఇవి మీరు ఊహిస్తున్న సంఖ్యలా? వాస్తవంగా లెక్కతేల్చిన సంఖ్య ఎంతో చెప్పండి. మీరు ఇప్పటి వరకూ దాఖలు చేసిన మూడు చార్జిషీట్లలోనూ పేర్కొన్న సంఖ్యలను తేల్చిచె’ప్పమని ధర్మాసనం నిలదీసింది. అప్పటికప్పుడు కూడికలూ తీసివేతలూ గుణకారాలూ భాగహారాలూ చేసి సదరు సంఖ్య 1,595 కోట్ల రూపాయలని సీబీఐ న్యాయవాది చెప్పారు.

ఇంతవరకూ ఈ మొత్తం గురించిన ప్రస్తావన ఎక్కడా కనిపించకపోవడం విశేషం. జగన్మోహన్ రెడ్డిపై కత్తిగట్టిన యెల్లో మీడియా సీబీఐకి ఎప్పటికప్పుడు ‘స్క్రిప్టు’ సమకూరుస్తూ ఉంటుందనీ, అందులోని అంశాలనే చిలకల్లా పలకడం సీబీఐ అధికారులకూ, న్యావాదులకూ అలవాటని ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి. శుక్రవారం నాటి పరిస్థితి గమనిస్తే ఆ విమర్శలు నిజమేననిపిస్తుంది. న్యాయస్థానాలు సీబీఐ నెత్తిన మొట్టికాయలు వెయ్యడం ఇదే మొదలు కాదు. మంచి మనిషికో మాట- మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. బాధ్యతగల ఒక వ్యక్తిని, సర్వోన్నత న్యాయస్థానం నిండు పేరోలగంలో పట్టుకుని నిలదీస్తే, మరోసారి ఒళ్లు దగ్గిరపెట్టుకుని ప్రవర్తిస్తాడని ఆశిస్తాం. కానీ ఎన్ని సార్లు ఎంత అవమానకరమయిన పరిస్థితిని ఎదుర్కున్నా సీబీఐ ప్రవర్తనలో మాత్రం మార్పు కనిపించడంలేదు. దీనికి కారణమేమిటి? సీబీఐ రిమోట్ కంట్రోల్ అధిష్టానమ్మ చేతిలో ఉండడమే ఇందుకు అసలు కారణమన్నది జనవాణి. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి అన్నట్లుగా వైఎస్ జగన్ నిర్దోషిగా నిరూపితులయి త్వరలోనే బయటకు వస్తారని కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఏ సీబీఐ ఎన్ని కట్టుకతలు చెప్పినా నమ్మేస్థితిలో జనం లేరు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!