YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 12 September 2012

ప్రజలను మరచిన ప్రభుత్వం

* కృష్ణా జిల్లా పామర్రు సభలో వైఎస్ విజయమ్మ ధ్వజం 
* వైఎస్సార్ కాంగ్రెస్‌ది ప్రజలపక్షం.. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తుంది
* భావితరాల కోసం, వైఎస్ సువర్ణ యుగం కోసం అందరం ఉద్యమిద్దాం
* పార్టీలో చేరిన కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, కె. నాగేశ్వరరావు, వాకా వాసుదేవరావు 

విజయవాడ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది ప్రజలపక్షమని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ మనసున్న పార్టీ అని, ప్రజా సమస్యల పరిష్కారానికి, ఈ ప్రభుత్వ మొద్దు నిద్ర వదలగొట్టడానికి నిరంతర పోరాటాలు చేస్తుందన్నారు. కృష్ణా జిల్లా పామర్రులో బుధవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన, పెడనకు చెందిన వ్యాపారవేత్త వాకా వాసుదేవరావుతో పాటు వేలాదిమంది కార్యకర్తలు ఇదే వేదికపై వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. 

వీరికి విజయమ్మ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చేందు కు ప్రజలు అండగా నిలబడాలని కోరారు. జగన్‌ను జైలులో పెట్టి 107 రోజులయిందని, ఆయన జైలులో ఉన్నా నిరంతరం ప్రజల బాగోగుల గురించే మాట్లాడుతున్నారని విజయమ్మ తెలిపారు. ‘‘ఎన్ని బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా జగన్ మీ కోసం వచ్చాడు. మీరు ఆదరించారు. మీ నుంచి జగన్‌ను ఎవరూ విడదీయలేరు. భావి తరాల కోసం, వైఎస్ సువర్ణయుగం కోసం అందరం ఉద్యమిద్దాం’’ అని పిలుపునిచ్చారు. రేపు జైలుకు వెళ్లి మీ ప్రేమ, అప్యాయతలను జగన్‌కు అందిస్తానని సభకు హాజరైన జనవాహినిని ఉద్దేశించి అన్నారు.

నాటి సువర్ణ యుగం వస్తేనే కష్టాలు తీరతాయి: వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలోని సువర్ణయుగం మళ్లీ వస్తేగానీ రాష్ట్ర ప్రజల కష్టాలు తీరవని చెప్పారు. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే పరిస్థితి నెలకొంది. ఏ రంగంగాని, ప్రాంతంలోగాని, జిల్లాలోగాని ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ప్రజలు రెండుసార్లు ఎన్నుకున్న వైఎస్ అనుమానాస్పద రీతిలో మన నుంచి దూరమై మూడేళ్లు దాటిపోయింది. ఈ కాలంలో ఏ రంగంలోనూ అభివృద్ధి కనపడటంలేదు. వైఎస్ ఐదేళ్ల మూడు నెలల కాలం రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయన హయాంలో ప్రజలపై ఏ ఒక్క భారం పడకుండా ప్రజారంజకంగా పాలన చేశారు. 

భారతదేశ చరిత్రలో ఐదేళ్లపాటు ఒక్క రూపాయి పన్ను కూడా పెంచని ఏకైక ప్రభుత్వం వైఎస్ రాజశేఖరరెడ్డిదే. ఇది దేశంలోనే రికార్డు’’ అని విజయమ్మ చెప్పారు. ఓటు ఎవరికి వేశారన్నది చూడకుండా, అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని వైఎస్ తపించారని, ఆ దిశగానే అన్ని సంక్షేమ కార్యక్రమాలూ అమలుచేశారని తెలిపారు. ‘‘వైఎస్ రెక్కల కష్టం మీద అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో ఖజానా పెంచుకున్నా ప్రజల బాగోగులు చూడడంలేదు. ధరలు పెరిగిపోయాయి. ఆర్టీసీ చార్జీలు పెంచారు. కరెంటు బిల్లుల మోత మోగుతోంది. మరోవైపు పల్లెటూళ్లలో గంటసేపు కూడా విద్యుత్ ఉండని పరిస్థితి నెలకొంది. రైతులతోపాటు పరిశ్రమలు కూడా హాలిడే ప్రకటించే దుస్థితి వచ్చింది. లక్షలాదిమంది కార్మికులు వీధిన పడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో రైతు నాగలిని, నేతన్న మగ్గాన్ని మర్చిపోవాల్సి వచ్చింది’’ అని అన్నారు.

ప్రతిపక్షం తన పాత్రను మరిచిపోయింది
కేంద్రం పెట్రోలు, గ్యాస్ ధరలను పెంచుతూ పోతుంటే స్పందించాల్సిన ప్రతిపక్షం దాని పాత్ర మరిచిపోయిందని విమర్శించారు. ‘‘ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ ఏర్పాటు చేయమనడానికి, ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబుకు మనసు రావడంలేదు. ప్రతిపక్షం రాజ్యాంగం ఇచ్చిన హక్కును మర్చిపోయింది. చంద్రబాబుకు వేరే మీడియా ఉండకూడదు.. కాంగ్రెస్ పార్టీకి వేరే కాంగ్రెస్ ఉండకూడదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. నేను విద్యార్థుల కోసం దీక్ష చేస్తున్న సమయంలో విలీనాన్ని ఖండించలేదంటూ గోబెల్స్ ప్రచారానికి పూనుకున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్‌కు, మరికొన్ని చోట్ల టీడీపీకు డిపాజిట్లు పోయాయంటేనే వారు ఎంతలా కలిసి పనిచేస్తున్నారో అర్థమవుతుంది’’ అని విమర్శించారు. వైఎస్‌ను కాంగ్రెస్ వారు ఎప్పుడు సొంతం(ఓన్) చేసుకుంటారో, ఎప్పుడు దూరం పెడతారో అర్థం కాకుండా ఉందన్నారు. ‘‘ఆయన చనిపోయిన మూడేళ్ల తర్వాత పాదయాత్ర పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేసి ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. 

వారు ఏ అవసరం కోసం పొగుడుతున్నారో తెలియడంలేదు. వైఎస్ కుటుంబాన్ని మాత్రం వారు పట్టించుకోవడం లేదు. వైఎస్ చనిపోతే అసెంబ్లీలో సంతాప సభ పెట్టడానికి మూడు నెలలు పట్టింది. అదీ మొక్కుబడిగా ముగించారు. చరిత్రలో ఏనాడూ లేని విధంగా ఒక సీఎం చనిపోతే ఏడు వందల మందికిపైగా మరణించారు. ఏ నాయకుడైనా వారిని పరామర్శించారా? రాజకీయ వారసులం వారేనని, లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన వారు ఆ విషయమే మరిచిపోయారు. కోర్టు ప్రభుత్వాన్ని విచారించమంటే వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ప్రభుత్వం వైఎస్ పథకాలను నీరుగారుస్తున్నా పట్టించుకోలేదు. కేబినెట్ సమష్టిగా తీసుకున్న నిర్ణయాలనూ మంత్రులు వైఎస్‌కు ఆపాదిస్తున్నా నోరు మెదపడంలేదు’’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్సార్ సీపీలో చేరినందుకు గర్వంగా ఉంది
రాష్ట్రంలోని ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పామర్రులో జరిగిన సభలో వైఎస్సార్ సీపీలో చేరిన నేతలు చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘దమ్ము, ధైర్యం ఉన్న జగన్ నాయకత్వంలో పనిచేయటానికి ఎంతో ఆనంద పడుతున్నాను. ఈరోజు ఒక నాయకుడి గురించి మాట్లాడాలి. ఆయనే చంద్రబాబు. కొడుకు జైల్లో ఉన్నాడని తల్లిలాంటి విజయమ్మను కలవటానికి వెళితే.. నేను బయటకు వచ్చేలోగా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నేను డబ్బుకు అమ్ముడుపోయానని ప్రచారం చేశారు. నేడు చంద్రబాబును ప్రజలు విశ్వసించటంలేదు. 18 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే ఆయన ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. అందుకే బీసీ డిక్లరేషన్ అని ప్రకటించారు. పాదయాత్ర చేస్తానంటున్నారు. చంద్రబాబు ఎంత కొంగ జపం చేసినా జనం నమ్మే స్థితిలో లేరు’ అని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలపై ప్రజలు విరక్తి చెంది ఉన్నారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు అన్నారు. 

చంద్రబాబు ఆయన కుటుంబ రాజకీయాలకోసం ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఉప్పులేటి కల్పన విమర్శించారు. జగన్ నాయకత్వంలో పనిచేయటానికి తాను గర్వపడుతున్నానని పెడన నియోజకవర్గానికి చెందిన వ్యాపారవేత్త వాకా వాసుదేవరావు చెప్పారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, , గట్టు రామచంద్రరావు, తలశిల రఘురామ్, ఎంవీఎస్ నాగిరెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, కొల్లి నిర్మలాకుమారి, పి.జనార్దనరెడ్డి కుమార్తె విజయారెడ్డి, విజయచందర్, లేళ్ల అప్పిరెడ్డి, వంగవీటి రాధాకృష్ణ, దుట్టా రామచంద్రరావు, మేకా ప్రతాప్ అప్పారావు, తాతినేని పద్మావతి, పి.గౌతంరెడ్డి, తాడి శకుంతల పాల్గొన్నారు. 

జనసంద్రమైన పామర్రు
పామర్రు, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతమైన పామర్రు జనసంద్రమైంది. బుధవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభకు ప్రజలు అశేషంగా తరలివచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్న ఈ సభలో జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు ఆ పార్టీలో చేరడం రెండు ప్రధాన పార్టీల్లో గుబులురేపింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా వెలుగొందుతున్న గుడివాడ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు విజయమ్మ సమక్షంలో పార్టీ కండువాలను కప్పుకుని జగన్‌కు మద్దతు పలికారు.

రైతులు, వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బుధవారం సాయంత్రం విజయమ్మ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి పామర్రుకు వచ్చారు. మధ్యలో ఆకునూరు, మంటాడలో దివంగత వైఎస్, వంగవీటి రంగా విగ్రహాలకు పూలమాలలు వేశారు. సభ ముగిసిన తరువాత పామర్రులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఇటీవల కృష్ణా నదిలో మునిగి మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆ తరువాత ఉప్పులేటి కల్పన ఇంట్లో కొంతసేపు విశ్రాంతి తీసుకుని రైలులో హైదరాబాద్ బయలుదేరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!