రెండుసార్లు రాష్ట్ర ప్రజలు తిరస్కరించినా, మళ్లీ ఎలాగైనా సీఎం పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి అకస్మాత్తుగా పాదయాత్ర గుర్తుకువచ్చింది. వరుసగా రెండుసార్లు ఓటమిపాలై, రాష్ట్రంలో దిక్కూమొక్కూ లేని కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖరరెడ్డి భూజానికెత్తుకొని 2003లో మండువేసవిలో పాదయాత్ర చేసి, పార్టీకి పునరుజ్జీవం పోశారు. వైఎస్ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించింది. అప్పట్నుంచి మళ్లీ అధికార పీఠం ఎక్కడమెలాగంటూ చంద్రబాబు అంతర్మథనం సాగిస్తూనే ఉన్నారు. అయితే, తొమ్మిదేళ్ల అధికారంలో బాబు అనుసరించిన విధానాలు, పెట్టిన తిప్పలను ప్రజలు మరచిపోలేదు.
ఆయన్ని నమ్మడం మానేశారు. అయినా పీఠంపై మమకారం పోని చంద్రబాబు.. కొత్త ఎత్తుగడ కోసం ఆలోచిస్తుండగా.. అకస్మాత్తుగా వైఎస్ పాదయాత్ర గుర్తుకొచ్చింది. అదే తరహాలో తానూ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దీనిపై కొద్ది రోజులుగా హడావుడి కూడా మొదలుపెట్టారు. వచ్చేది చలికాలమని, ఇప్పుడైతే పెద్దగా కష్టమనిపించదని, వైఎస్‌లా ఎండాకాలంలో యాత్ర చేయడం మీకు చాలా కష్టమని నేతలు సలహా ఇచ్చారట. దీంతో అక్టోబర్ 2న పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అంతేకాదు.. వైఎస్ కార్యక్రమాన్ని కాపీ కొట్టినప్పటికీ తానే ముందుండాలని బాబు కోరికట. దీన్ని గ్రహించిన ఓ నాయకుడు.. వైఎస్‌కంటే ఎక్కువ దూరం నడిస్తేనే క్రెడిట్ దక్కుతుందని ఉచిత సలహా ఇచ్చారు. దాంతో రూటు మ్యాపు ఎలా ఉండాలన్న అంశంపై రోజూ తర్జనభర్జనలు సాగిస్తున్నారు.
రోజువారీ చర్చల్లో పాల్గొంటున్న ఒక నాయకుడికో సందేహం వచ్చింది. ఆయన ఉండబట్టలేక పక్కనున్న నేతతో.. రాజకీయాల్లో ఒక అస్త్రం ఒకేసారి పనిచేస్తుందట కదా! మరి మన నాయకుడు చేసే పాదయాత్ర ఆ రేంజ్‌లో సక్సెస్ అవుతుందా..! అన్నారట. అదేంటి.. అలా అడుగుతున్నావని మరో నేత అనగా.. ‘‘గతంలో అద్వానీ రథయాత్ర చేసిన తర్వాత ఆయనకు పెద్ద పేరొచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీ లాభపడింది కూడా. అదే అద్వానీ ఆ తర్వాత మరో అయిదు యాత్రలు చేసినా అంతగా ప్రచారం రాలేదు. మరి మనమిప్పుడు పాదయాత్ర చేస్తే...!’’ అంటూ ఫేస్ అమాయకంగా పెట్టాడట. దాంతో అవాక్కయిన నాయకుడు లేనిపోని సందేహాలతో విసిగించకు.. అంటూ అతన్ని బయటకు పంపేశారట.
No comments:
Post a Comment