YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 13 September 2012

చిన్నప్పటినుంచే ధనికుణ్ణి

- నా తండ్రి అప్పట్లోనే 3 ఎకరాలు దానం చేశారు
- మాకు 70 ఎకరాల ఆస్తి ఉండేది
- స్యూ నుంచి విరాళం తీసుకున్నది వాస్తవమే
- బినామీ ఆస్తులు, సింగపూర్‌లో హోటల్ మాత్రం అబద్ధం
- లోకేష్ టీడీపీలో కార్యకర్తలా పనిచేస్తారు
- నష్టాల నుంచి లాభాల్లోకి హెరిటేజ్
- మా అబ్బాయి రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి? 
- బ్రహ్మణికి త్వరలో హెరిటేజ్‌లో బాధ్యతలు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తాను చిన్నప్పటినుంచే ధనికుణ్ణని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పుకున్నారు. 1970వ దశకంలోనే తన తండ్రి గ్రామ అవసరాల నిమిత్తం మూడు ఎకరాల భూమిని దానం చేశారని, హిందూ అవిభక్త కుటుంబం కింద 70 ఎకరాలకు పైగా ఆస్తి తమకుందనీ అన్నారు. నిర్మాణ రంగ సంస్థ స్యూ కంపెనీ నుంచి తమ పార్టీ ఎన్నికల విరాళం తీసుకున్నమాట వాస్తవమేనని తెలిపారు. మా అబ్బాయి రాజకీయాల్లోకి వస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. పార్టీలో ఆయన కార్యకర్తలా పనిచేస్తారని చెప్పారు. అలా పనిచేసే హక్కు ఎవరికైనా ఉందని, మీరు కూడా కార్యకర్తలా పనిచేయవచ్చని విలేకరులకు సూచించారు. లోకేష్ కార్యకర్తగా పనిచేస్తానని చెబితే మీరే ఏదేదో రాసుకుంటున్నారన్నారు. 

గురువారం తన ఆస్తులు ప్రకటించిన సందర్భంగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచే ధనికుడినని చెప్పారు. ప్రజలను మభ్య పరిచేందుకు తాను రెండెకరాల భూమితో రెండు వేల కోట్లు సంపాదించినట్లుగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు బినామీ పేర్లతో ఆస్తులున్నాయనడంలో, సింగపూర్‌లో హోటళ్లు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు.

2009 సాధారణ ఎన్నికలకు ముందే స్యూ సంస్థ తమకు విరాళం ఇచ్చిందని తెలిపారు. తర్వాత వారు అన్యాయంగా కాంట్రాక్టు దక్కించుకోవటంతో తాము ప్రతిఘటించామని చెప్పారు. టీడీపీని నడిపేందుకు డబ్బుల్లేవంటూ ఖర్చులకు ఎవరైనా ఇవ్వచ్చని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఒబామా 4 వేల కోట్ల విరాళాలు సేకరించినట్లు చెప్పారు. దేశంలోని రాజకీయవేత్తలందరూ తనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాజకీయాల్లో విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో పారదర్శకత, వ్యక్తిత్వం కోసం తనతో పాటు కుటుంబసభ్యుల ఆస్తులు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. తాను ప్రారంభించిన తర్వాతే ప్రధానమంత్రితో పాటు మంత్రులందరూ ఆస్తులు వెల్లడిస్తున్నారన్నారు. 

గతంలో కంటే తనకు, తన కుటుంబసభ్యులకు ఆస్తులు తగ్గటానికి కారణం కుటుంబసభ్యుల మధ్య ఒకరికొకరు అప్పులిచ్చుకోవటం, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమేనన్నారు. హెరిటేజ్ క ంపెనీ గత ఎనిమిదేళ్లుగా నష్టాల్లో ఉందని, తర్వాత కంపెనీ విస్తరణ వల్ల లాభాల్లోకి వచ్చిందని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన అన్నాహజారే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించటం ద్వారా తప్పు చేశారన్నారు. రాందేవ్ బాబా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతారనుకుంటే బీజేపీతో కలిశారని, ఇది సరికాదని వ్యాఖ్యానించారు. దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి మీరు నాయకత్వం వహిస్తారా అని ప్రశ్నించగా.. ఆ ప్రశ్న అడిగిన విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘మీ పత్రిక గురించి ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో ఏం వచ్చింది?’ అని ప్రశ్నిస్తూ.. ‘ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడిగితే ఎలా? ఆత్మస్తుతి కోసం ప్రశ్నలు అడగటం సరికాదు. మీరు గురివింద గింజ మాదిరిగా వ్యవహరిస్తున్నారు’ అని రుసరుసలాడారు. తెలంగాణ అంశంపై కేంద్రానికి లేఖ రాసే విషయమై సంప్రదింపులు జరుపుతున్నానన్నారు. హరికృష్ణ అనారోగ్యంపై ప్రశ్నించగా ప్రస్తుతం తాను వీటి గురించి మాట్లాడనని, మరోసారి స్పందిస్తానని చెప్పారు. ఆ తరువాత చంద్రబాబు ఇంగ్ల్లిష్ చానళ్లతో మాట్లాడుతూ తన కోడలు బ్రహ్మణి త్వరలో హెరిటేజ్ సంస్థలో బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!