YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 10 September 2012

కాంగ్రెస్ పార్టీయే దేశంలో అతి సంపన్నమైన రాజకీయ పార్టీ.

సంపన్న పార్టీల్లో బీజేపీకి రెండో స్థానం
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ టాప్
23 ప్రధాన పార్టీల ఆదాయంపై ఎలక్షన్ వాచ్ నివేదిక
ఏడేళ్ల ఆదాయంపన్ను రిటర్న్‌లు, విరాళాలపై పార్టీల లెక్కలే ప్రాతిపదిక
విరాళాలే అసలు వనరులైనా, దాతల వివరాలు పూర్తిగా వెల్లడించని పార్టీలు

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: కేంద్రంలో యూపీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీయే దేశంలో అతి సంపన్నమైన రాజకీయ పార్టీ.. ఆదాయం విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ... రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అగ్రభాగాన నిలిచింది. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్), ఎన్నికల నిఘా వ్యవహారాల ’నేషనల్ ఎలక్షన్ వాచ్’ (ఎన్‌ఈడ బ్ల్యూ) సంస్థలు సేకరించిన సమాచారం ద్వారా ఈ విషయం వెల్లడైంది. పార్టీలకు విరాళాల ద్వారానే ఎక్కువగా సొమ్ము సమకూరినప్పటికీ, తమ ఆదాయానికి మూలాలేమిటన్న వివరాలను చాలా తక్కువ పార్టీలు మాత్ర మే వెల్లడించాయని ఎలక్షన్ వాచ్ పేర్కొంది. 23 ప్రధాన పార్టీలకు సంబంధించిన ఆదాయంపై ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది. 2004లో రూ. 222కోట్లున్న కాంగ్రెస్ ఆదాయం, 2011లో రూ. 307 కోట్లకు చేరుకుందని తెలిపింది. 

2004-05 నుంచి 2010-11 వరకు ఏడేళ్లలో కాంగ్రెస్ ఆదాయం రూ.2008 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఆదాయం రూ.53 కోట్లుగా ఉంది. టీడీపీ 2009-10 (ఎన్నికల ఏడాది) లో 11.92కోట్లు, 2010-11లో 61.5 కోట్లు ఆర్జించింది. 2009-10 నుంచి 2010-11 వరకు రెండేళ్లలో టీడీపీకి 18.07 కోట్లు రాగా, ఇందులో స్వచ్ఛంద చందా 11.37 కోట్లు, సభ్యత్వం ద్వారా 43.03 కోట్లు, డిపాజిట్లపై వడ్డీ రూ.57.11 కోట్లు వచ్చాయి. మొత్తం ఆదాయంలో విరాళాలు 62.94 శాతంగా ఉంది. గత రెండేళ్లలో టీడీపీకి రూ. 20 వేల కన్నా ఎక్కువగా అందిన విరాళాల మొత్తం 66.86 కోట్లు. 

టీడీపీకి ‘సూ’ కంపెనీ విరాళం రూ.1.25కోట్లు
టీడీపీకి 2009-10లో సదరన్ ఇంజనీరింగ్ వర్క్స్ (ఎస్‌ఈడబ్ల్యు-సూ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ. 1.25కోట్లు, నిప్పాన్ ఇన్వెస్టిమెంట్, ఫైనాన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ నుంచి రూ.కోటి, శ్రీనివాసరాజు చలపతి నుంచి రూ. కోటి, టెక్కేరే ఇండియా ప్రైవేటు లిమిటెడ్ నుంచి రూ. కోటి చొప్పున విరాళాలుగా అందాయి. 2008-09లో భారతి ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి రూ. కోటి, 2009-10లో డ్రీం లాండ్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ నుంచి రూ. 30 లక్షలు, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ నుంచి రూ. 25 లక్షలు, సోలారిస్ హోల్డింగ్ లిమిటెడ్ నుంచి రూ.25 లక్షలు, 2008-09లో రోబోసిలికాన్ ప్రైవేటు లిమిటెడ్ నుంచి రూ.25లక్షలు, 2009-10లో తాళ్లూరి జయశేఖర్ నుంచి 20లక్షలు, అరబిందోఫార్మా నుంచి రూ. 20 లక్షలు, 2007-08లో మన్నెం వెంకటరమణ నుంచి రూ. 10 లక్షలు, 2008-09లో ముక్కామల అప్పారావు నుంచి రూ. 10లక్షలు, 2009-10లో మొహ్మద్ సలీం నుంచి రూ. 10 లక్షలు, 2010-11లో బి.సి. జనార్దనరెడ్డి నుంచి రూ. 10లక్షలు విరాళాలు అందాయి. 

ఇక టీఆర్‌ఎస్ విషయానికి వస్తే... గత ఏడేళ్లలో రూ.10.37 కోట్లు సమకూరాయి. 2004-05లో రూ.16.16 లక్షలు, 2005-06లో రూ.41.78లక్షలు, 2006-07లో 39.96లక్షలు, 2007-08లో 87.81లక్షలు, 2008-09లో 1.83 కోట్లు, 2009-10లో 29.69 కోట్లు, 2010-11లో 3.74 కోట్లు పొందింది. గత రెండేళ్లలో మొత్తం 6.71 కోట్లు అందాయి. దీనిలో సభ్యత్వ రుసుము, విరాళాల రూపంలో వచ్చింది రూ.6.7కోట్లు. మొత్తం ఆదాయంలో విరాళాలు 99.98 శాతం ఉంది. టీఆర్‌ఎస్ సహా తృణమూల్ కాంగ్రెస్, బీపీఎఫ్, జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఏఐఎఫ్‌బీ, ఐఎన్‌ఎల్‌డీలు విరాళాల రసీదులను కేంద్ర ఎన్నికల సంఘానికి అందచేయలేదు. 2004-11 మధ్య కాలానికి, ఆయా పార్టీలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఆదాయంపన్ను వివరాలు, విరాళాల జాబితా తదితర సమాచారం ఆధారంగా ఎలక్షన్ వాచ్ ఈ నివేదిక వెల్లడించింది. 23 ప్రధాన పార్టీల ఆదాయంపై ఈ నివేదిక రూపొందించారు.

ఏడేళ్ల కాలంలో కాంగ్రెస్..
ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం... 2004-05 ఆర్థిక సంవత్సరం నుంచి 2010-11 ఆర్థిక సంవత్సరం వరకూ ఏడేళ్ల కాలంలో కాంగ్రెస్ రూ.2,008 కోట్లు సముపార్జించి ఆదాయంలో అగ్రస్థానంలో ఉంది. బీజేపీ 994 కోట్లతో రెండోస్థానంలో ఉంది. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రూ. 484కోట్లు, సీపీఎం 417కోట్లు, సమాజవాదీ పార్టీ (ఎస్పీ) 279కోట్లు సంపాదించాయి. విరాళాల మొత్తం రూ. 20వేలకు మించినపుడు దాతల వివరాలను పార్టీలు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందని, అయితే, విరాళాలు ఎక్కడినుంచి వచ్చాయన్న వివరాలను కొన్ని పార్టీలు మాత్రమే ప్రకటిస్తున్నాయని ఎలక్షన్ వాచ్ సంస్థ జాతీయ సమన్వయకర్త అనిల్ బరీవాల్ చెప్పారు. డొనేషన్లు, స్వచ్ఛంద విరాళాల ద్వారానే పార్టీలకు ఎక్కువగా ఆదాయం వస్తున్నప్పటికీ, విరాళాలిచ్చిన దాతల వివరాలు చాలా తక్కువ శాతం మాత్రమే ఉంటున్నాయన్నారు.

2009-10, 2010-11 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి బీజేపీకి విరాళాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 22.76శాతానికి విరాళాల దాతల వివరాలు ప్రకటించారు. ఇదే వ్యవధికి కాంగ్రెస్ పార్టీ 11.89శాతం ఆదాయానికి మాత్రమే విరాళాల దాతల వివరాలు వెల్లడించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 4.64శాతానికి, సీపీఎం 1.29శాతానికి మాత్రమే వివరాలు వెల్లడించాయి. కాగా, తమకు రూ. 20వేలకు మించిన మొత్తంలో విరాళాలే అందలేదంటూ బీఎస్పీ ప్రకటించింది. 

పార్టీల క్రమబద్ధీకరణ బిల్లు రావాలి: త్రిలోచన్ శాస్త్రి
పార్టీల క్రమబద్ధీకరణపై చర్చ జరిపి బిల్లును ఆమోదించాలని ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ వ్యవస్థాపక సభ్యుడు త్రిలోచన్ శాస్త్రి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘అక్రమ మైనింగ్ అంటూ ఓవైపు ఆందోళన చేస్తూనే మరోవైపు వారి నుంచి భారీగా విరాళాలు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేయడం సరికాదు. మైనింగ్‌కు అనుమతులిచ్చే పార్టీలపై చర్యలు తీసుకోవాలి. విరాళాల సేకరణ వంద శాతం పారదర్శకంగా ఉండాలి. నిధులు ఎక్కడి నుంచి, ఎలా వస్తున్నాయో లెక్కలు చూపాలి. నిబంధనలకు విరుద్దంగా విరాళాలు తీసుకునే పార్టీలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అన్నారు.

విరాళాల సేకరణలో తప్పేమిటి?: కాంగ్రెస్, బీజేపీ
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల విరాళాల నివేదికపై కాంగ్రెస్, బీజేపీ స్పందించాయి. పార్టీ కార్యకర్తలనుంచి, ఇతర వనరులనుంచి విరాళాలు సేకరించడాన్ని రెండు పార్టీలు సమర్థించుకున్నాయి. పార్టీల ఆదాయ సముపార్జనపై ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యుల నివేదికలను పూర్తిగా చదివిన తర్వాతనే తమ పార్టీ ఈ అంశంపై స్పందించగలదని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. అయితే, విరాళాలు సేకరించడం చట్టవిరుదం, అనైతికం మాత్రం కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకుడు షానవాజ్ హుసేన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పారదర్శకమైన వ్యవస్థ ద్వారా పార్టీ కార్యకర్తలనుంచి తమ పార్టీ నిధులు సేకరిస్తుందని హుసేన్ చెప్పారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!