YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 13 September 2012

డీజిల్ ధర పెంపు, గ్యాస్‌పై ఆంక్షలతో రాష్ట్ర ప్రజలపై రూ. 9,200 కోట్ల భారం

కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరను పెంచటం.. సమాజంలోని అన్ని రంగాలపై పెను ప్రభావం చూపనుంది. సామాన్యుడి బతుకు మరింత దుర్భరం కానుంది. రైతు నడ్డి ఇంకా విరగనుంది. పరిశ్రమలు మరింతగా కుంగిపోనున్నాయి. పప్పూ ఉప్పుల ధరలన్నీ భగ్గున మండనున్నాయి. పాలు, కూరగాయల ధరలూ చుక్కలను దాటనున్నాయి. బస్సు ప్రయాణం మరింత భారం కానుంది. వెరసి సగటు కుటుంబంపై నెలకు రూ. 750 వరకూ అదనపు భారం పడనుంది. ఇక వంట గ్యాస్ సిలిండర్ల వినియోగంపై ఆంక్షలను కూడా లెక్కవేస్తే.. దాదాపు కోటి కుటుంబాలపై నెలకు రూ. 2,250 వరకూ భారం పడుతుంది. మరోవైపు.. ఈ మొత్తం వ్యవహారంలో ‘నిమిత్తమాత్ర’మైన రాష్ట్ర సర్కారు ఖజానా మాత్రం గలగలా నిండనుంది! డీజిల్ ధర పెంపు వల్ల ప్రజలపై రూ. 9,200 కోట్ల భారం పడుతోంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం రూ. 1,200 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది!
- న్యూస్‌లైన్, హైదరాబాద్ 


డీజిల్ ధరల పెరుగుదలతో.. ఇప్పటికే కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలు 10 నుంచి 16 శాతం వరకూ పెరగనున్నాయి. కాయగూరల ధరల 5 నుంచి 12 శాతం పెరుగుతాయి. రవాణా చార్జీలతో పాటు ప్రయాణికుల చార్జీలు కూడా 10 నుంచి 15 శాతం పెరుగుతాయి. కరెంట్ కోతలతో అల్లాడుతున్న పారిశ్రామిక వర్గంతో పాటు డీజిల్ ఇంజన్లు వినియోగిస్తున్న రైతులు మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే అప్పుల వేటలో ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ)కి డీజిల్ ధరల పెరుగుదల పెను భారం కానున్నది. వీలైనంత వెంటనే ప్రయాణికుల చార్జీలు పెంచేందుకు ఆర్‌టీసీ కసరత్తు మొదలుపెట్టింది.

పెరిగిన డీజిల్ ధర వల్ల రూ. 340 కోట్ల అదనపు భారం పడుతుందని సంస్థ అంచనా వేసింది. డీజిల్ ధర పెంపుదల ఫలితంగానే ఒక్కో కుటుంబంపై నెలకు రూ. 400 నుంచి రూ. 750 దాకా భారం పడే అవకాశం ఉంది. సంవత్సరానికి ఆరు కంటే ఎక్కువ సిలిండర్లు వాడే కుటుంబాలపై భారం రూ. 750 నుంచి రూ. 2,250 వరకూ ఉంటుంది. రాష్ట్రంలో కోటీ 60 లక్షల కుటుంబాలు గ్యాస్‌ను వినియోగిస్తుండగా, వారిలో 39 లక్షల మంది దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారు. మిగిలిన 1.21 కోట్ల కుటుంబాల్లో 86 లక్షల కుటుంబాలు ఏటా 8 నుంచి 12 సిలిండర్లు వాడుతున్నాయి. వెరసి డీజిల్ ధర పెరుగుదల, గ్యాస్ సిలిండర్ల వాడకంపై ఆంక్షల వల్ల రాష్ట్ర ప్రజలపై ఏటా రూ. 9,200 కోట్ల మేర భారం పడుతుందని ఆర్థిక, వాణిజ్య రంగాల నిపుణులు అంచనా వేశారు. 

అన్నదాతలపై ఏటా రూ. 1,100 కోట్ల అదనపు భారం
వర్షాభావం, కరెంటు కోతలతో అష్టకష్టాలు పడుతున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఇప్పటికే ఎరువుల ధరలు అమాంతంగా పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఇప్పుడు డీజిల్ ధరలు పెరగటంతో అన్నదాతలు బెంబేలెత్తిపోతున్నారు. సాగు అంటేనే భయపడుతున్నారు. వర్షాభావ ప్రాంతాల రైతులకు సబ్సిడీపై డీజిల్ సరఫరా చేస్తామని రెండు నెలల కిందట ప్రకటించిన కేంద్రం ఈ హామీని అటకెక్కించింది. 

ఇప్పుడు డీజిల్ ధరల పెంపు రూపంలో రాష్ట్ర రైతులపై అదనంగా రూ. 1,100 కోట్ల భారం వేసింది. కూలీల కొరతతో సాగు పనులన్నీ ట్రాక్టర్లతోనే జరుగుతున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో 80 శాతం మంది రైతులు సాగు పనుల కోసం ట్రాక్టర్లనే వినియోగిస్తున్నారు. పెద్ద రైతులు సొంత ట్రాక్టర్లతో పనులు చేసుకుంటుండగా చిన్న, సన్నకారు రైతులు సైతం అదనులో అద్దెపై దుక్కులు చేస్తున్నారు. వరి నాట్లు, వరి కోతలకూ ఇలాగే చేస్తున్నారు. 

రాష్ట్రంలో ఇప్పటికే 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోస్తాలో నెలాఖరు వరకు నాట్లు వేసే పరిస్థితి ఉన్నందున ఖరీఫ్‌లో 60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 50 లక్షల ఎకరాల్లో వరి కోతలు యంత్రాల సహాయంతోనే జరిగే అవకాశం ఉంది. గత రబీలో ఎకరా వరి కోతకు ప్రాంతాన్ని బట్టి రూ. 1,500 - 1,700 ఉంది. వరి కోత కోసం భూమి రకాన్ని బట్టి గరిష్టంగా 12 లీటర్లు వినియోగమవుతుంది. ఎగబాకిన డీజిల్, ఇతర ఆయిల్స్ ధరలతో నిర్వహణ ఖర్చులు పెరిగి వరి కోత అద్దె రూ. 2,000 కు కూడా పెరగవచ్చని వరి కోత యంత్రం యజమానులు చెప్తున్నారు.

పెరిగే అద్దె ధరల ప్రకారం చూస్తే ఖరీఫ్ వరి కోతలకే రాష్ట్ర రైతులపై ఏకంగా రూ. 150 కోట్ల అదనపు భారం పడనుంది. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం తగ్గినందున వచ్చే రబీలోనూ 1.30 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. కోటి ఎకరాలకు ట్రాక్టర్లనే వినియోగించే అవకాశం ఉంది. ఈ విస్తీర్ణంలో ట్రాక్టర్లతో కనీసం రెండు సార్లు దుక్కి దున్నాల్సి ఉంటుంది. ప్రస్తుతం మెట్ట భూములను రెండుసార్లు(ఇరువాయి) దున్నేందుకు కనీసం ఎకరాకు రూ. 1,000 బాడుగ ఉంది. పెరిగిన డీజిల్ ఖర్చుల కారణంగా ఇప్పుడు ఇది రూ. 1,200 కానుంది. నాట్లు వేసే పొలం దున్నేందుకు డీజిల్ వినియోగం ఎక్కువ అవుతుంది. దీంతో ఎకరా పొలం దున్నేందుకు రూ. 1,600 అద్దె ఉంది. ఇప్పుడు ఇది రూ. 1,800 అయ్యే అకాశం ఉందని అంచనా. ఇలా పెరిగిన దుక్కుల అద్దె ఖర్చుల రూపంలో ఒక్క రబీ సీజనులోనే రైతులపై రూ. 400 కోట్ల అదనపు భారం పడనుంది. 

అనుబంధ రంగాలపైనా అదే భారం...
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి. కలుపు నివారణ కోసం నెలకు ఒకసారి అయినా తోటలను దున్నించాల్సి ఉంటుంది. దుక్కుల ఖర్చు రూపంలో ఇప్పుడు ఉద్యాన పంటల రైతులపై ఏటా అదనంగా రూ. 480 కోట్ల భారం పడే పరిస్థితి ఉంది. వర్షాభావం, విపరీతమైన కరెంట్ కోతలతో నీటి వనరులు ఉన్న రైతులు పంటలను కాపాడుకునేందుకు డీజిల్ ఇంజన్లపై ఆధారపడుతున్నారు. 

వరి పంట పొట్ట దశకు చేరుకోవడంతో డీజిల్ వినియోగం పెరగడంతో పాటు ధరలు ఎగబాకడంతో రాష్ట్ర రైతులపై అదనంగా కనీసం రూ. 20 కోట్ల భారం పడనుంది. అలాగే పాడి రైతులను కరెంటు కోతలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పాడిపశువులకు నీళ్లు పెట్టేంత సేపు కూడా కరెంటు ఉండటంలేదు. జనరేటర్లతోనే నీళ్లు పెట్టడం, దాణా కలపడం, పాలు పితకడం జరుగుతోంది. పౌల్ట్రీ పరిశ్రమదీ ఇదే పరిస్థితి. డీజిల్ ధర పెంపుతో ఈ రెండు రంగాల రైతులపై కనీసం రూ. 50 కోట్ల అదనపు భారం పడుతుందని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులే చెప్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ గల్లా గలగల..
డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రాష్ట్ర ప్రజలపై రమారమి రూ. 9,200 కోట్ల రూపాయల భారం పడుతుండగా.. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ. 1,198 కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతుంది. నిత్యావసర వస్తువులతో పాటు ఇతర ధరల పెరుగుదల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపేణా ఏటా రూ. 600 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుంది. 

ఇది కాకుండా డీజిల్ ధర పెరుగుదల వల్ల మరో రూ. 598 కోట్ల ఆదాయం వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేశారు. తాజా ధర పెంపుతో ప్రతి లీటరు డీజిల్‌పై వ్యాట్ రూపేణా వాణిజ్య పన్నుల శాఖకు 91 పైసల అదనపు రాబడి రానుంది. లీటరుపై మొత్తం వ్యాట్ రాబడి అక్షరాలా రూ. 9.10. అనగా లీటరు డీజిల్‌ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ. 50కి విక్రయిస్తే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను రూపేణా వసూలు చేసేది అక్షరాలా రూ. 9.10. రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 54 కోట్ల లీటర్ల డీజిల్ అమ్ముడవుతోంది. దీని ద్వారా వ్యాట్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నెలసరి రాబడి రూ. 490.40 కోట్లు. వార్షికంగా చూస్తే రూ. 5,888 కోట్ల పైమాటే. తాజా ధర పెంపు వల్ల ఏటా వచ్చే అదనపు వ్యాట్ రాబడి రూ. 589.68 కోట్లు కావడం గమనార్హం. 

పరిశ్రమలపై పెనుభారం..
పరిశ్రమల వద్ద ప్రస్తుతం 1,000 మెగావాట్ల సామర్థ్యం (రోజుకు 24 మిలియన్ యూనిట్లు) కలిగిన డీజిల్ ఇంజన్ సెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, పరిశ్రమలు రోజు మొత్తం డీజిల్ ఇంజన్ సెట్లను వినియోగించవు. రోజులో 10 నుంచి 12 గంటల మేర వినియోగిస్తాయి. అంటే రోజుకు 12 మిలియన్ యూనిట్ల (120 లక్షల యూనిట్లు) విద్యుత్‌ను డీజిల్ ఇంజన్ సెట్ల ద్వారా ఉత్పత్తి చేసుకుని పరిశ్రమలు వినియోగిస్తాయన్నమాట. ఒక లీటరు డీజిల్ ద్వారా 3 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. 


ఒక్కో యూనిట్‌కు 3 లీటర్ల డీజిల్ చొప్పున.. 120 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 40 లక్షల లీటర్ల డీజిల్‌ను పరిశ్రమలు వినియోగిస్తాయన్నమాట. లీటరుకు ఐదు రూపాయల చొప్పున అదనపు భారం లెక్కిస్తే.. పరిశ్రమలపై తాజా ధరల పెంపు వల్ల రోజుకు రెండు కోట్ల రూపాయల చొప్పున అదనపు భారం పడుతుంది. 

అంటే నెలకు రూ. 60 కోట్లు.. ఏడాదికి రూ. 720 కోట్ల భారం ఒక్క పరిశ్రమలపైనా అదనంగా పడనుంది. డీజిల్ ధరల తాజా పెంపు దినపత్రికలపై కూడా భారీగానే పడింది. ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యుత్ కోతల వల్ల ఒక దినపత్రిక సగటున నెలకు 63 లక్షల లీటర్ల డీజిల్‌ను అదనంగా వినియోగించాల్సి వస్తోందని అంచనా. అంటే తాజా పెంపుదల వల్ల లీటరుకు 5 రూపాయల చొప్పున లెక్కిస్తే.. ఒక్క దినపత్రికపైనే నెలకు 3.15 కోట్ల అదనపు భారం పడిందన్నమాట. 

నిత్యావసరాలు ఇక నింగికే..
డీజిల్ ధరల పెరుగుదల రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక, వాణిజ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ భారంతో బియ్యం, ఉప్పు, పప్పు మొదలు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. వీటి ధరల పెరుగుదల కనిష్టంగా 10 శాతం, గరిష్టంగా 16 శాతం ఉంటుందని వాణిజ్య, వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ధరల పెరుగుదల ప్రభావం రెండు మూడు రోజుల్లోనే కనిపిస్తుందని ఆ వర్గాలు చెప్పాయి. కాయగూరల ధరలు 5 నుంచి 12 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పేదలకు భారంగా మారిన పాల ధర ఏడు శాతం పెరుగొచ్చని అంచనా. 

యూపీఏ నుంచి తప్పుకోగలిగితే సంతోషించేదాన్ని
ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న యూపీఏ ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడే తప్పుకోగలిగి ఉంటే సంతోషించేదాన్ని. డీజి ల్ ధరల పెంపుపై నిరాశ చెందాను. నేను మద్దతు ఉపసంహరించుకుంటే, యూపీఏకు మద్దతు ఇచ్చేందుకు ఇతరులు ముందుకొస్తారు. యూపీఏ సమన్వయ కమిటీ అనేది ఒకటి ఏర్పాటయ్యాక కూడా మమ్మల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ధరల పెంపు ను వ్యతిరేకిస్తూ శనివారం కోల్‌కతాలో జరిగే ర్యాలీలో నేను పాల్గొంటాను. - మమతాబెనర్జీ,పశ్చిమ బెంగాల్ సీఎం 

పెట్రోలు మాఫియాతో కేంద్రం కుమ్మక్కు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం, వంటగ్యాస్ సిలిండర్లకు కోత పెట్టడం చూస్తుంటే, పెట్రోల్ మాఫియాతో యూపీఏ సర్కారు కుమ్మక్కైనట్లు కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే తగిన వర్షాలు లేవు. డీజిల్ ధరల పెంపు వల్ల రైతులు మరిన్ని ఇక్కట్లు పడతారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తాం. 
-ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, బీజేపీ ఉపాధ్యక్షుడు, నరేంద్ర మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి, యశ్వంత్ సిన్హా, బీజేపీ నేత

డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి 
పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. సబ్సిడీపై అందజేస్తున్న వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను పరిమితం చేయడం సరికాదు. ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకోవాలి. డీజిల్ ధరల పెంపు ద్వారా ప్రజలపై కేంద్రం మోయలేని భారం మోపింది. అధికారంలోకొస్తే.. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం 25 విడతలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. డీజిల్ ధరలను తగ్గించనిపక్షంలో ఆందోళన చేస్తాం.
- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం
ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం.దీనివల్ల ఇప్పటికే నింగినంటిన నిత్యావసరాల ధరలు మరింతగా పెరుగుతాయి. సామాన్యుడి కష్టాలు మరింతగా పెరుగుతాయి.
- డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి
ప్రజలంతా వ్యతిరేకించాలి
దీనివల్ల మధ్యతరగతి ప్రజల కష్టాలు మరింతగా పెరుగుతాయి. ప్రజలంతా దీనిని వ్యతిరేకించాలి.
- బిమన్ బోస్, లెఫ్ట్‌ఫ్రంట్ చైర్మన్

ఈ నిర్ణయం ఇబ్బందికరమైనదే..
ఈ నిర్ణయం ఇబ్బందికరమైనదే. దీనికి మేం అనుకూలం కాదు. ఈ అంశంపై యూపీఏ భాగస్వామ్య పార్టీలన్నింటినీ విశ్వాసంలోకి తీసుకుని ఉండాల్సింది. యూపీఏ సమన్వయ కమిటీలో చర్చించి ఉండాల్సింది. దీనివల్ల రైతులపై, సామాన్యులపై భారం పడే మాట వాస్తవమే. యూపీఏ ప్రభుత్వం సామాన్యుడికి ప్రయోజనం కలిగించే అనేక నిర్ణయాలు తీసుకుంది. అయితే, కొన్ని ఇబ్బందికరమైన నిర్ణయాలూ తీసుకుంది.
- దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!