ఎం.రమణమూర్తి, సాక్షి ప్రతినిధి:మోహన్‌కు ఫార్మాలో తిరుగులేని అనుభవముంది. హైదరాబాద్‌లోని ఓ బహుళజాతి కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో పని చేసేవారు. సొంతంగా ఎదగాలనుకుని స్నేహితులతో కలిసి హైదరాబాద్ ప్రగతినగర్ ఎలీప్ పారిశ్రామికవాడలో ఏడాది కింద ఫార్మా ఆర్ అండ్ డీ సెంటర్ తెరిచారు. అదేం దురదృష్టమో.. ఆది నుంచీ కరెంటు కష్టాలే. అప్పట్లో వారానికి రెండ్రోజులు పవర్ హాలిడే. ఇప్పుడు మూడు రోజులు. పెపైచ్చు రోజూ సాయంత్రం నాలుగ్గంటలు కోత. పైగా టైమూ పాడూ లేని అదనపు కోతలు. సడెన్‌గా కరెంటు పోతూ వస్తూ విలువైన యంత్రాలు పాడయ్యాయి. ట్యాంకర్ నీటి దెబ్బకు ఇంకొన్ని యంత్రాలు దెబ్బతిన్నాయి. ‘‘కాస్త దూరంలో ఉన్న పెద్ద ఫార్మా కంపెనీ ముందు నిత్యం పాతిక మంజీరా వాటర్ ట్యాంకులు బారులు తీరి ఉంటాయి. మాకు ఒక్క మాత్రం ఒక్క ట్యాంకర్ కావాలని అడిగినా లేదు పొమ్మంటారు. ఇదేం రాజ్యం?’’ అని పట్టరాని కోపంతో ప్రశ్నిస్తున్నారు మోహన్. విధిలేక తన రీసెర్చ్ సెంటర్‌ను నాగపూర్‌కు తరలించడానికి సిద్ధమయ్యారు. అక్కడ వారంలో శనివారం ఒక్క రోజే పవర్ హాలిడే. మిగతా రోజుల్లో నిమిషం కూడా కరెంటు పోదు. పోయిందంటే పైవారికి ఆ సబ్‌స్టేషన్ అధికారి వివరణ ఇచ్చి తీరాలి. అదీ.. పరిశ్రమలకు మహారాష్ట్రఇస్తున్న విలువ!
ఇలాంటి మోహన్‌లు ఎందరో ఇప్పుడు పొరుగు రాష్ట్రాల వంక చూస్తున్నారు. నాగ్‌పూర్ మనకు సమీపంలోనే ఉంటుంది కనక అక్కడి భుట్టిబొరి వంటి పారిశ్రామికవాడలకు తరలివెళ్లడానికి చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మధ్యతరహా పరిశ్రమలైతే పన్ను రాయితీలు బాగా ఇచ్చే హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాంచల్, పంజాబ్‌ల వంక చూస్తున్నాయి. భారీ పరిశ్రమలు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో తమ శాఖల్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఉత్పత్తినీ తరలిస్తున్నాయి. అంటే.. ఇక్కడఉత్పత్తిని తగ్గించి అక్కడ పెంచుతున్నాయన్నమాట! మన దగ్గర మరి కొద్దిరోజులు కోతలు ఇలాగే సాగితే తమ కార్పొరేట్ కార్యాలయాల్ని సైతం పొరుగు రాష్ట్రాలకు తరలించి.. ఖాళీ, ఖాయిలా యూనిట్లను మాత్రమే ఇక్కడ ఉంచుతాయన్నది కాదనలేని నిజం.
ఆర్డర్ల భయంతో కొనసాగుతున్న ఫార్మా..
ఒకప్పుడు బల్క్ డ్రగ్ రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో ఇప్పుడు కూడా ఉత్పాదక రంగంలో ఎక్కువగా నడుస్తున్నవి ఫార్మా సంస్థలే. అది కూడా ఆర్డర్లు తీసుకున్నారు కనక, వాటిని సకాలంలో డెలివరీ చేయకుంటే పరిహారాలు తప్పవు కనక.. తీవ్ర కష్టనష్టాలకోర్చి డీజిల్ జనరేటర్లతో కిందా మీదా పడి నెట్టుకొస్తున్నాయి. కొత్త ఆర్డర్లపై అవి కూడా ఏమంత ఉత్సాహం చూపించటం లేదు. ఆర్డర్లిచ్చే సంస్థలు కూడా ఇక్కడి పరిస్థితుల్ని చూసి మన రాష్ట్ర పరిశ్రమల్ని లెక్కలోకి తీసుకోవడం మానేశాయి. నిజానికి డీజిల్ ద్వారా పరి శ్రమను నడిపించడం ఏమాత్రమూ వాంఛనీయం కాదు. కరెంటుతో పోలిస్తే కనీసం 5 రెట్లు ఎక్కువ ఖర్చ య్యే డీజిల్ జోలికి ఎవరూ వెళ్లరు. వెళ్లారంటే.. దాన్ని మూసివేతకు ముందు దశగా భావించక తప్పదు!
ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఎలీప్‌లోనే.. ఓ బహుళ జాతి కంపెనీ కోసం ప్లాస్టిక్ డబ్బా మూతలు తయారుచేసే పరిశ్రమ ఉంది. పదిహేనేళ్లుగా చక్కగా నడిచిన కంపెనీ.. తాజాగా కరెంటు కోతలతో కటకటలాడిపోతోంది. ఆర్డరు రద్దయితే కంపెనీ మనుగడే కష్టం కనక నెలకు రూ.15 వేల అద్దెపై డీజిల్ జనరేటర్ తెచ్చారు. కానీ దాంతో నాలుగు యంత్రాల్లో రెండే నడుస్తాయి. దీనికి గంటకు 20 లీటర్ల డీజిల్ ఖర్చవుతోంది. అంటే గంటకు రూ.800. రోజుకు 20 గంటలు నడిచినా రూ.16,000 ఖర్చవుతోంది. పెపైచ్చు అద్దె మరో రూ.500. ‘‘కరెంటుతో నాలుగు యూనిట్లూ నడిచినా రోజుకు గరిష్టంగా రూ.3,000 అయ్యేది. కానీ డీజిల్‌తో రెండు యంత్రాలకే రూ.16,500 అవుతోంది. ఇలా నడపటం అసాధ్యం కనక మానేశాం’’ అని కంపెనీ ఉద్యోగి రంగారావు చెప్పారు. ఉత్పత్తి లేక, సకాలంలో డెలివరీ ఇవ్వకపోవటంతో.. మూడు నెలల తరవాత ఆర్డర్ నిలిపేస్తామని, ఈ లోపు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సదరు బహుళజాతి కంపెనీ నోటీసిచ్చింది. మరిప్పుడు ఆ కంపెనీ ఏం చేయాలి?
మరో పారిశ్రామికవాడలో సిమెంట్ కంపెనీలకు సంచులు సరఫరా చేసే కంపెనీదీ ఇలాంటి కథే. ‘‘ఒకో సంచిపై 15 పైసల వరకూ మార్జిన్ ఉంటుంది. కరెంటు బదులు డీజిల్ వాడటం వల్ల సంచీపై 30 పైసలు అదనంగా ఖర్చవుతోంది. ఉత్పత్తి నిలిపేద్దామంటే ఆ సిమెంట్ కంపెనీ మాకు ఆర్డరివ్వదేమోనని భయమేస్తోంది. దీనికి తోడు 400 మంది పనివారున్నారు. వారికి కాస్త శిక్షణ కూడా ఇచ్చాం. సంస్థను మూస్తే వారు వేరే పనులకు వెళ్లిపోతారు. మళ్లీ వస్తారన్న గ్యారంటీ ఉండదు. దిక్కు తోచటం లేదు’’ అంటూ కష్టాలన్నీ ఏకరువు పెట్టారు యజమాని.
నిజానికి పవర్ హాలిడేలతో పాటు చెప్పా పెట్టని కోతలు కొన్ని పరిశ్రమలను కోలుకోకుండా చేస్తున్నాయి. స్టోన్ క్రషింగ్ యూనిట్లనే తీసుకుంటే.. నడుస్తున్న యంత్రం కోతల వల్ల హఠాత్తుగా ఆగిపోతే సరైన ఉత్పత్తి రాదు. పెపైచ్చు యంత్రం పట్టేసి ‘జా’లు విరిగిపోతాయి. వాటిని మార్చడానికి రెండు మూడు గంటలు పడుతుంది. ఈ లోగా మరోసారి కరెంటు పోతేనో..?
పరిశ్రమంటే ఏంటో వీళ్లకు తెలుసా?
ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం చూస్తుంటే అసలు పరిశ్రమంటే ఏమిటో వీళ్లకు తెలుసా అనే అనుమానం కలగకమానదు. ఒక పరిశ్రమంటే నాలుగు యంత్రాలో, దాని యజమానో కాదు. దాన్లో పనిచేసే సిబ్బంది.. వారి కుటుంబాలు.. దానిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ ఇతర పరిశ్రమలు... ఇదంతా ఒక చక్రం. ఈ చక్రంలో ఏ ఒక్క లింకు తెగినా మొత్తం వ్యవస్థే అతలాకుతలమవుతుంది. వేల కుటుంబాలు వీధిన పడతాయి. ప్రస్తుతానికి మార్కెట్లో వినియోగ వస్తువులమ్మే రిటైల్ షాపులు, షోరూమ్‌లు ధగధగలాడుతూ కనిపిస్తూ ఉండొచ్చు గాక. కానీ ఉత్పాదక పరిశ్రమ దెబ్బ తింటే ఖర్చుచేసే శక్తి పోయి, అవి కూడా బేరాల్లేక మూతపడే పరిస్థితి రావచ్చు. మొత్తం వ్యవస్థే కుప్పకూలవచ్చు కూడా!
నీరూ భరించలేని భారమే..
దాదాపు పరిశ్రమలన్నీ బోర్లపైనే ఆధారపడుతూ ఉండటంతో కరెంటు లేకపోవటం వల్ల వర్షాకాలంలో కూడా అవి ట్యాంకర్లనే నమ్ముకోవాల్సి వస్తోంది. బోర్లలో నీరు లేనప్పుడు ఎటూ ట్యాంకర్లే గతి. కానీ బోర్లలో నీరున్నా కరెంటు లేక ట్యాంకర్లనే ఆశ్రయించాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో ఏటా ఈ కాలంలో వాటర్ బోర్డు నుంచి పరిశ్రమలకు రోజుకు 1,600 ట్యాంకర్లు వెళ్లేవి. కానీ అదిప్పుడు 3,000 ట్యాంకర్లకు పెరిగినట్టు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. మామూలుగా సెప్టెంబర్లో హైదరాబాద్‌లో పరిశ్రమల కోసం రోజుకు 1,000 దాకా వినియోగమయ్యే ప్రైవేటు ట్యాంకర్ల సంఖ్య కూడా ఇప్పుడు రెట్టింపైందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఇలా రోజుకు 2,500 ట్యాంకర్లనుకున్నా.. కనిష్టంగా ట్యాంకరుకు రూ.525 (అధికారిక ధర) వేసుకున్నా నెలకు పరిశ్రమలు అదనంగా చెల్లిస్తున్నది దాదాపు రూ.4 కోట్లు. ఎప్పుడూ చెల్లించే కరెంటు బిల్లుకు ఇది అదనం. అటు కరెంటు లేక, ఇటు ఉత్పత్తి సాగని ఈ సమయంలో నీటి కోసమే నెలకు రూ.4 కోట్లు చెల్లించాల్సి వస్తోందంటే ఇక పరిశ్రమలు మనుగడ సాగిస్తాయా?
జీతాలివ్వాలా, వద్దా?
వారంలో మూడు రోజులు కంపెనీ నడవకున్నా, రోజుకు 4 గంటలు కరెంటు లేకున్నా కొన్ని సంస్థలు తమ కార్మికులకు పూర్తిగా జీతాలివ్వాల్సి వస్తోంది. దినసరి కార్మికులకు సెలవుల్లో జీతమివ్వలేమంటూ కొన్ని చేతులెత్తేస్తున్నా.. నిపుణులైన కార్మికుల విషయంలో మాత్రం అది సాధ్యపడటం లేదు. పూర్తి జీతం కళ్లజూడాలన్న కార్మికుల కోరిక కూడా మరీ అసాధారణమేమీ కాదు. ఇంటి జమా ఖర్చులకు నెల జీతమే కనాకష్టంగా సరిపోతుంటే.. ఇప్పుడు ఏకంగా నెలలో 12 రోజుల చొప్పున కోత పడుతుంటే వారెలా బతుకుతారు? పోనీ ఆ 12 రోజులూ వేరే చోట పని చేద్దామన్నా ఎవరైనా ఇస్తారా? మరి వారేం చేయాలి? ఇవి రెండూ సున్నితమైన సమస్యలే. దీనికి పరిష్కారమల్లా ఒక్కటే.. పరిశ్రమ పూర్తిస్థాయిలో నడవాలి. పవర్ హాలి డేలు పోవాలి. మరి మన రాష్ట్రంలో అది సాధ్యమా?
కార్మికుల లభ్యతా సమస్యే..
ఒకప్పుడు హైదరాబాద్‌లో ఏ పరిశ్రమలో చూసినా బీహార్, నేపాల్, ఒడిషాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస వచ్చిన వారే ఎక్కువగా కనిపించేవారు. కానీ నాలుగైదేళ్లుగా బీహార్‌లో పారిశ్రామిక వృద్ధి, దాంతోపాటే ఉపాధి అవకాశాలు పెరిగి బీహారీలు ఇటు రావడం మానేశారు. నేపాలీలు కూడా బీహారే వారికి దగ్గరవడంతో ఇక్కడి నుంచి తరలిపోయారు. ఉత్తరాంధ్ర వాసులకేమో రిటైల్ విప్లవం కొత్త అవకాశాల్ని తెచ్చింది. పరిశ్రమల్లో పదేసి గంటలు పని చేస్తే వచ్చే జీతం కన్నా వెయ్యో, రెండువేలో ఎక్కువే వస్తుండటం, పైగా ఏసీలో పని చేసే వైట్ కాలర్ జాబ్ కావడంతో వాటి వైపే మొగ్గుతున్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నదల్లా ఒడిశా వారే. వారికి కూడా ఇన్‌ఫ్రా రంగం అవకాశాలు కల్పిస్తుండటంతో మన పరిశ్రమలకు కార్మిక లభ్యత బాగా కష్టమవుతోంది.
బ్యాంకు రుణాలపై వేలం పోటు...
ఈ కష్టాలన్నీ చాలవన్నట్టు బ్యాంకుల రూపంలో మరింత పెద్ద కష్టం పారిశ్రామికవేత్తల్ని వెంటాడుతోందిప్పుడు. రుణాల రికవరీకి గతంలో కాస్త వేచి చూసిన బ్యాంకులు.. ఇప్పుడు మాత్రం గరిష్టంగా మూడు నాలుగు నెలల కన్నా ఊరుకోవడం లేదు. రెండు వాయిదాలు కట్టకుంటే నోటీసులు.. మూడో నెలకల్లా స్వాధీన ప్రకటన.. నాలుగో నెలకల్లా వేలం.. ఇలా వ్యవహరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ విలువలు రోజురోజుకూ దారుణంగా మారుతుండటంతో తొందరపడటం తప్ప తమకు మరో దారి లేదనేది బ్యాంకుల వాదన. కానీ ఇన్ని కష్టాలు ముసురుకుంటున్న సమయంలో పారిశ్రామికవేత్తలు ప్రతి నెలా టంచనుగా వాయిదాలు కట్టగలగడమూ పెను సమస్యే. కానీ దానితో నిమిత్తం లేకుండా.. రెండు మూడు వాయిదాలు కట్టనందుకే అటు పరువునూ, ఇటు కారుకౌకగా ఆస్తులనూ వారు పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఇన్ని కష్టాలకోర్చి ఈ రాష్ట్రంలో పరిశ్రమలను నడపడం అవసరమా అని వారిప్పుడు ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు.
No comments:
Post a Comment