YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 13 September 2012

చంద్రబాబు ఆస్తుల ప్రకటనపై మండిపడ్డ జూపూడి

- సంతకం లేకుండా చేసిన ఆ ప్రకటన తప్పుల తడక
- ఆస్తులపై అన్నా టీంతో విచారణకు సిద్ధమా?
- బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు ఎందుకు దాచారు?
- లోకేష్ ఏం వ్యాపారం చేస్తున్నారు?
- ఆయన చదువే బినామీ డబ్బుతో కదా! 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రతిపక్ష నాయకుడు ఎన్. చంద్రబాబు నాయుడు ఎవరిని మోసం చేయడానికి తన ఆస్తులను ప్రకటించారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ అబద్ధాలకూ, అపనమ్మకానికీ కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు తన ఆస్తుల పేరుతో సంతకం లేకుండా చేసిన ప్రకటన అంతా అబద్ధాల పుట్ట, తప్పులతడకేనన్నారు.

బినామీ పేర్లతో ఉన్న ఆస్తులన్నింటినీ బాబు దాచిపెట్టి తన ఆస్తులు చాలా తక్కువ అని చూపే యత్నం చేశారని విమర్శించారు. అసలు తన ఆస్తులపై అన్నా హజారేతోనూ, అరవింద్ కేజ్రీవాల్‌తోనూ విచారణ జరిపించుకోవడానికి చంద్రబాబు సిద్ధమేనా? అని జూపూడి సవాలు విసిరారు. గత ఏడాది సెప్టెంబర్ 2న వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున బాబు ఇదే విధంగా తప్పులతో కూడిన తన ఆస్తుల వివరాలను ప్రకటించారని, ఇపుడు కూడా అదే విధంగా ఎవరూ అడక్కుండానే ప్రకటించారని ఎద్దేవా చేశారు.

ఆస్తులు ఎలా తగ్గాయి?
‘‘గత ఏడాది బాబు తన ఆస్తులను 39 లక్షల రూపాయలన్నారు. ఇపుడేమో అవి రూ. 31.97 లక్షలన్నారు. రూ.7 లక్షలు ఎలా తగ్గాయి? ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తులు అప్పట్లో రూ. 39 కోట్లని ప్రకటించారు. ఇపుడు 24.52 కోట్లు అంటున్నారు. లోకేష్ బాబు ఆస్తులు అప్పుడు 2.82 కోట్లు అన్నారు. ఇప్పుడు 2.62 కోట్ల రూపాయలని చెబుతున్నారు. ఒక్క ఏడాదిలోనే ఈ ఆస్తులు ఎలా తగ్గాయి?’’ అని జూపూడి ప్రశ్నించారు.

‘‘ఆస్తులు తగ్గుతున్నాయంటే మేం విశ్వసిస్తాం... ఎందుకంటే చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల్లో ప్రజాభిమానం అనే ఆస్తి క్రమంగా తగ్గుతోందనేది రుజువవుతోంది. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నపుడు 45 శాతం ఓట్లు ఉండేవి. ఇపుడు బాబు హయాంలో 18 శాతానికి తగ్గి పోయాయి. ప్రజాభిమానంలాగే ఆస్తులూ తగ్గుతున్నాయంటే మేం అంగీకరిస్తాం’’ అని జూపూడి ఎద్దేవా చేశారు.

రూ. 2 వేల కోట్లని తెహల్కా చెప్పింది: ‘‘బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాబు ఆస్తులు 2000 కోట్ల రూపాయలని తెహల్కా డాట్‌కామ్ ప్రకటించింది. అయితే ఆ సమయంలో బాబు ప్రకటించిన వివరాలు వేరుగా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ముందు ప్రకటించిన ఆస్తులకు, గత ఏడాది, ప్రస్తుత ఏడాది ప్రకటించిన ఆస్తులకు తేడాలున్నాయి.. వాటిపై బాబు ఏమంటారు?’’ అని జూపూడి మండిపడ్డారు. గతంలో బాబు ప్రకటించిన ఆస్తుల వివరాలు తెలిపే ప్రతులను ఆయన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ‘‘లోకేష్ చేస్తున్న వ్యాపారం ఏమిటి? ఒక నిరుద్యోగి పేరుతో ఆస్తులెలా వచ్చాయి? ఆయన చదివిందే బినామీ డబ్బుతోనన్న ఆరోపణలున్నాయి. ఆయనకు ఎవరు పెట్టుబడి పెట్టారు? అనే వివరాలు ఎందుకు బయట పెట్టరు?’’ అని ప్రశ్నించారు. బాబు ప్రకటించిన ఆస్తులను ఆయన ఇంటివాళ్లే నమ్మడం లేదని, చివరకు టీడీపీ నాయకులు, పార్టీ కార్యాలయంలో పనిచేసే ప్యూన్లు కూడా నమ్మడం లేదన్నారు. 

బాబుకు నెల్లూరు జిల్లా బాలాయపల్లెలో ఉన్న 362 ఎకరాల మాటేమిటి? వాటిని ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించారు. ప్రజాపోరు పేరుతో బాబు తలపెట్టిన పాదయాత్రకు ముందు బాబు అబద్ధాల యాత్ర చేపట్టారని జూపూడి వ్యాఖ్యానించారు. వైఎస్‌లాగా పాద యాత్ర చేస్తానని చల్లని వాతావరణంలో వెళుతున్న బాబును రాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. పార్టీని వదలి అందరూ వెళ్లిపోతుంటే దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు పాదయాత్రకు వెళ్లి పార్టీని బతికించుకోవాలనుకుంటున్నారని ఆయన అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!