YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 9 September 2012

చంద్రబాబు..మన్మోహన్ ఓ ఐదు నిమిషాలు

*నేతలను బయటికి పంపి 5 నిమిషాల పాటు మంతనాలు
*బీసీ డిక్లరేషన్ పేరిట ఢిల్లీ యాత్రలో రహస్య ఎజెండా?
*ఏం మాట్లాడారన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
*భారీ భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా రహస్య సయోధ్య!
*తెలంగాణ, జగన్ అంశాలపై చర్చించారంటూ ఊహాగానాలు
*టీడీపీలోనూ చర్చనీయాంశంగా మారిన బాబు ఢిల్లీ యాత్ర
*ఏకాంత చర్చలు నిజమేనని ధ్రువీకరిస్తున్న టీడీపీ నేతలు
*బయటికొస్తూ బాబు ఎంతో సంతోషంగా కన్పించారని వెల్లడి
*కొన్నేళ్లుగా రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్‌తో టీడీపీ చెట్టపట్టాలు
*అదిప్పుడు జాతీయ స్థాయికి విస్తరించిందంటున్న విశ్లేషకులు


న్యూఢిల్లీ, న్యూస్‌లైన్:‘ఆ ఐదు నిమిషాల్లో ఏం జరిగి ఉంటుంది?’ - ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్, టీడీపీ నేతల్లో అంతులేని చర్చకు తావిస్తున్న ప్రశ్న ఇది! ఏ ఇద్దరు నాయకులు కలిసినా దీని చుట్టే జోరుగా చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌తో చెట్టపట్టాలుగా సాగుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. తాజాగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో జరిపిన ఏకాంత చర్చలు అటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయంగా మారాయి. బీసీ డిక్లరేషన్‌కు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకంటూ ఇటీవల బాబు ఢిల్లీలో రెండు రోజుల పాటు పర్యటించడం తెలిసిందే. అందులో భాగంగా సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12.30కు టీడీపీ సీనియర్ నేతల బృందంతో కలిసి ప్రధాని వద్దకు వెళ్లి డిక్లరేషన్‌పై వినతిపత్రం సమర్పించారు. 

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 20 నిమిషాల అనంతరం 12.50కి టీడీపీ నేతలందరికీ బాబు సైగ చేసి బయటకు పంపారు. తర్వాత ప్రధానితో ఏకాంతంగా ఐదు నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఆ సమయంలో ఆయన వెంట వెళ్లిన నేతలు కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నారు. ప్రధానితో బాబు ఏం మాట్లాడి ఉంటారో తమకైతే తెలియదని చెప్పిన సదరు నేతలు.. ‘లోపల ఏం జరిగిందో తెలియదు గానీ, బయటకు వచ్చేటప్పుడు మాత్రం బాబులో సంతోషం తొంగిచూసింది. అది ఆయన ముఖ కవళికల్లో కొట్టొచ్చినట్టుగా కన్పించింది’ అంటూ ముక్తాయించడం విశేషం! తెలంగాణ అంశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల వ్యవహారంతో పాటు రాష్ట్రంలో భావి రాజకీయ అవసరాలు, మధ్యంతర ఎన్నికలు, కోల్‌గేట్ దుమారం, రాష్ట్రంలో నాయకత్వ మార్పు తదితరాలపై ప్రధానితో బాబు చర్చించి ఉంటారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. వీటికన్నా ప్రస్తావనకు వచ్చే వేరే అంశాలేవీ తనకైతే కన్పించడం లేదని ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు నడపడంలో సుదీర్ఘ అనుభవమున్న టీడీపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. 

ఏదో రహస్య ఎజెండా ప్రకారమే ప్రధానితో బాబు ఏకాంతంగా సమావేశమై ఉంటారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. ప్రధానిని కలిసి రాగానే బాబు విలేకరులతో మాట్లాడుతూ.. ‘ప్రధాని రాజీనామా చేసినా ఒరిగేదేముంది? ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు’ అంటూ మాట్లాడటాన్ని కూడా ఈ సందర్భంగా పలువురు ఉదహరిస్తున్నారు. ఓవైపు బొగ్గు గనుల కుంభకోణం దేశమంతటినీ కుదిపేస్తూ, మన్మోహన్ రాజీనామాకు పెద్దపెట్టున డిమాండ్లు విన్పిస్తున్న తరుణంలో బాబు ఇలా మాట్లాడటం యాదృచ్ఛికం ఎంతమాత్రమూ అయ్యుండదనే అభిప్రాయాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి. పైగా మధ్యంతర ఎన్నికలు రానే రావని కూడా ఆ సందర్భంగా బాబు కరాఖండిగా చెప్పడం స్వపక్ష నేతలకు కూడా విస్మయం కలిగించింది.

లోగుట్టేమిటో..!?

ఇటీవలి ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం, టీడీపీ దారుణంగా దెబ్బ తినడం, వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీయే అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తాజా సర్వేలన్నీ ఘోషిస్తున్న నేపథ్యంలో ప్రధానితో బాబు ఏకాంత చర్చలను ఆషామాషీగా కొట్టిపారేయలేమనే అభిప్రాయం విన్పిస్తోంది. ముఖ్యంగా తన భవిష్యత్తు అంధకారంలో పడుతోందన్న ఆందోళనతోనే ఈ ఏకాంత భేటీకి బాబు తెర తీసి ఉంటారని టీడీపీ నేతలే అంచనా వేస్తున్నారు. ‘మీకు మేమున్నాం. మీరూ మేమూ కలిస్తే వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవచ్చు..’ అనే తన ఆలోచన ధోరణిని బాబు ప్రధాని ముందుంచి ఉంటారని టీడీపీ సీనియర్ నేత ఒకరు ‘న్యూస్‌లైన్’తో అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఒక వైఖరి ప్రకటించే సమయం ఆసన్నమైంది. 

మా పార్టీలోనూ దానిపై తీవ్రంగా మథనం సాగుతోంది. కాబట్టి దానిపై కూడా మా అధినేత కూడా తన మనసులో మాట మన్మోహన్ చెవిన వేసి ఉండొచ్చు..’ అంటూ ఆయన విశ్లేషించారు. ‘‘జగన్ కేసులను తనదైన శైలిలో ‘ప్రస్తావించడం’, తన ‘మద్దతు’ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పడంతో పాటు ‘సొంత’ పనులు కూడా చక్కబెట్టుకుని ఉండొచ్చు’’ అని టీడీపీకి చెందిన మరో నాయకుడు వ్యాఖ్యానించారు. ఏఐసీసీలోని ఓ సీనియర్ నేత వద్ద ఈ విషయాలను ప్రస్తావించగా ‘నిజమే అయుండొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలుండవు కదా..’ అని వ్యాఖ్యానించడం విశేషం!
గాలి మారుతోంది..

బాబు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ వైఖరిలో తాజాగా ఒక విధమైన మార్పు కన్పిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నలుగురు కాంగ్రెస్ ఎంపీలు ఇటీవల చంద్రబాబును కలిశారని, జగన్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ కలవాలని అభిప్రాయపడ్డారని పేర్కొంటూ ఓ టీడీపీ అనుకూల పత్రికలో ఇటీవల కథనం రావడం తెలిసిందే. భావి రాజకీయ సమీకరణాలకు ఇవి సంకేతాలుగా కనిపిస్తున్నాయని ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్-టీడీపీల బంధం బలపడితే వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవచ్చన్న ధోరణి రెండు పార్టీల్లోనూ కనపడుతుండటం ఇందుకు సంకేతమైతే, ప్రధానితో బాబు ఏకాంత చర్చలు వాటిని బలపరుస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఏకాంత చర్చలు, కథనాల వెనక ఏదో ఎజెండా కచ్చితంగా దాగుందంటున్నారు. కాంగ్రెస్-టీడీపీ సాన్నిహిత్యంపై ‘ఫీలర్లు’ వదిలి.. ప్రజలు, ఇరు పార్టీల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలన్న ఎత్తుగడ కూడా ఉండి ఉండొచ్చని కూడా చెబుతున్నారు.

రహస్య స్నేహితుడు!

నిజానికి వైఎస్ తదనంతరం పలు సందర్భాల్లో కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకోవడం, కాంగ్రెస్‌ను బాబు పలువిధాలుగా ఆదుకుంటూ వస్తుండటం బహిరంగ రహస్యమే. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనానికి ముందు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బాబు ససేమిరా అనడం తెలిసిందే. ఆ సందర్భంలోనే ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో ఫోన్లో మాట్లాడారని, రాష్ట్ర సర్కారుకు ఢోకా ఉండదని, ముఖ్యంగా తన వల్ల ఎలాంటి సమస్యా ఉండదని భరోసా ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించబోదని బాబు హామీ ఇచ్చారని, ఆయన నుంచి ఈ రకమైన మద్దతు చూసి విస్మయానికి లోనైన పటేల్, ‘అవసరమైనప్పుడు మీ మద్దతు తప్పక తీసుకుంటాం’ అని చెప్పారని ఢిల్లీ వర్గాల్లో విన్పించింది. 

అందుకు తగ్గట్టే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ బలం పెరిగాక మాత్రమే బాబు అవిశ్వాసం పెట్టి మమ అన్పించారు. అంతేగాక.. ‘ఇకపై అవిశ్వాసం పెట్టబోం’ అంటూ కరాఖండిగా ప్రకటన కూడా చేశారు! 2011 ఆగస్టులో రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా బాబు ఒక రాత్రి ఎస్పీజీ, పోలీసు భద్రత లేకుండా ఒక ఎంపీ, తన వ్యక్తిగత భద్రతాధికారితో కలిసి ప్రైవేటు వాహనంలో వెళ్లి మరీ కేంద్రంలోని ఓ కీలక మంత్రితో మంతనాలు జరిపారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఎమ్మార్ కుంభకోణం నుంచి సాంత్వన చేకూర్చాల్సిందిగా ఆయన్ను బాబు కోరారని కూడా చెప్పుకున్నారు. బాబు గానీ, టీడీపీ గానీ వాటిని ఖండించలేదు కూడా. ‘బాబు వచ్చి నన్ను కలిశారు’ అంటూ కొంతకాలానికే అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం సాక్షాత్తూ లోక్‌సభలోనే ప్రకటించారు! ఇలా వైఎస్ మరణానంతరం రెండున్నరేళ్లుగా అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న బాబు.. తాజాగా ప్రధాని భేటీలో కూడా ఏదో ‘కీలకాంశం’పైనే చర్చించి ఉంటారని భావిస్తున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!