హైదరాబాద్, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లాలో విశిష్ట రాజకీయ వారసత్వ నేపథ్యం కలిగిన ఇద్దరు యువ ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పలమనేరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్ రెడ్డి, ఎ.వి.ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో తాము చేరతామని, ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలకు హాజరు కావాలని ఈ ఎమ్మెల్యేలు విజయమ్మను ఆహ్వానించగా అందుకు ఆమె సమ్మతించారు.
ఈ ఎమ్మెల్యేల కుటుంబాలు రెండూ దశాబ్దాలుగా చిత్తూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమరనాథ్ రెడ్డి తండ్రి దివంగత రామకృష్ణారెడ్డి పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా, చిత్తూరు నుంచి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. అమరనాథ్ రెడ్డి స్వయంగా గతంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రవీణ్ తల్లి లక్ష్మీదేవమ్మ ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రి దివంగత ఉమాశంకర్‌రెడ్డి ఎమ్మెల్సీగా, జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉండేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలను ప్రశ్నించడంతో ఈ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఇటీవలే సస్పెండ్ చేశారు. విజయమ్మను కలిసిన తరువాత వారుమీడియాతో మాట్లాడారు.
జగన్‌ది సమర్థ నాయకత్వం: అమరనాథ్ రెడ్డి
రాష్ట్రంలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే సమర్థ నాయకత్వాన్ని అందజేయగలరని విశ్వసిస్తున్నానని, అందుకే తాను వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నానని అమరనాథ్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాజకీయాలు నడుపుతున్నాయని, పార్టీ విధానాలను ప్రశ్నించినందుకే సస్పెండ్ చేశారని, రాష్ట్ర ప్రజలు కూడా టీడీపీని సస్పెండ్ చేశారని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని టీడీపీ చేసిన డిమాండ్‌ను ప్రస్తావించగా ‘టీడీపీని అవిశ్వాస తీర్మానం పెట్టమనండి.. దానికి అనుకూలంగా ఓటేసి ఆ తరువాత కావాలంటే రాజీనామా చేస్తా.. ఇపుడే రాజీనామా చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసే ఒక ఓటు తగ్గి పోతుంది’ అని అన్నారు.
డబ్బులకు తాము అమ్ముడుబోయామని టీడీపీ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ...‘నా తండ్రి, ఈయన (ప్రవీణ్) తల్లి ఎమ్మెల్యేలుగా ఉన్నపుడు వైశ్రాయ్‌లో ఉన్నారు. చంద్రబాబుకు మద్దతుగా వైశ్రాయ్ శిబిరానికి వెళ్లాం. అపుడు బాబు నా తండ్రికి ఎంత డబ్బిచ్చారో నాకు తెలియదు. ఇపుడు ఆ విషయం చెప్పడానికి ఆయన లేరు. కనుక బాబే ఆ విషయం చెప్పాలి. మా నాన్న ఆ డబ్బు నాకైతే ఇవ్వలేదు. ఇప్పటికైనా దయచేసి చెప్పమనండి... ఆ డబ్బు ఎక్కడుందో పోయి తెచ్చుకుంటాను, అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను’ అని రెండు చేతులతో దోసిలి పట్టి ఆయన వ్యంగ్యంగా అడిగారు.
అవిశ్వాసం ఎందుకు పెట్టరు: ప్రవీణ్
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, అధికారంలో ఒక్క రోజు కూడా కొనసాగే అర్హత లేదని చంద్రబాబు ఓ వైపు విమర్శిస్తూనే మరో వైపు అవిశ్వాసం ఎందుకు పెట్టరని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందనే విమర్శలను ఆయన తోసి పుచ్చారు. ప్రజా సమస్యల కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టాలని కోరుతోందన్నారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడాన్ని తన తల్లి వ్యతిరేకించారనడం కేవలం మీడియా సృష్టి అని, అందరి ఆమోదంతో ప్రజాభీష్టం మేరకే పార్టీలో చేరుతున్నానని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎమ్మెల్యేలు విజయమ్మతో సమావేశమైనపుడు ముఖ్య నేతలు వై.వి.సుబ్బారెడ్డి, జూపూడి ప్రభాకర్‌రావు ఉన్నారు.
No comments:
Post a Comment