YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 18 November 2012

నలభై ఏళ్ల కల సాకారానికి నడుం బిగించిన వైఎస్

2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో మొదలు పెట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 86 ప్రాజెక్టుల్లో హంద్రీ-నీవా కూడా ఒకటి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన ఈ ప్రాజెక్టును వైఎస్ ఎంతో ధైర్యంతో మొదలుపెట్టారు. వాస్తవానికి గత 40 ఏళ్లుగా రాయలసీమ ప్రజలు ఈ ప్రాజెక్టు కోసం కలలు కంటున్నారు. అనేక ఆందోళనలు నిర్వహించారు. ఉద్యమాలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఈ ప్రాజెక్టును చేపట్టే సాహసం చేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే.. 40 టీఎంసీల కృష్ణా వరద నీటి సహాయంతో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించటానికి అవకాశం ఉంది. 

అలాగే 33 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయి. రెండు దశల్లో నిర్మించే ఈ ప్రాజెక్టులో 12 ప్రధాన లిప్టులు, డిస్ట్రిబ్యూటరీలపై మరో 52 లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ ఉన్నంతకాలం పనులు చాలా వేగంగా జరిగాయి. టెండర్ల ప్రక్రియను పూర్తి చేయటంతో పాటు, భూసేకరణ, ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించటం వంటి కార్యక్రమాలను, నిర్మాణ పనులను చేపట్టారు. కానీ ఆయన మరణంతో పనుల్లో వేగం తగ్గిపోయింది. ముఖ్యంగా రెండేళ్ల విలువైన కాలం వృథా అయింది. దీని ప్రభావం ప్రాజెక్టు నిర్మాణ పనులపై తీవ్రంగా పడింది. వైఎస్ హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. పనులు సకాలంలో జరిగి ఉన్నట్లయితే.. ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 25 ప్రాజెక్టులను పూర్తి చేసి సుమారు 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించటానికి అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించింది. ఇప్పుడు హడావుడిగా హంద్రీ-నీవాను సాంకేతికంగా ప్రారంభించింది. గత నాలుగైదు నెలల్లో కొమరం భీం, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కిన్నెరసాని ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అయితే నీటిని మాత్రం విడుదల చేయలేకపోతున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!