YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 18 November 2012

జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు :కోమటిరెడ్డి

రాష్ట్రంలో ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (భువనగిరి) చెప్పారు. దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా జగన్ వల్లే సాధ్యమని వారంతా నమ్ముతున్నారన్నారు. జగన్‌ను అరెస్టు చేయడంతో, మహా నేత కొడుకును అన్యాయంగా జైల్లో పెట్టారే అని ప్రజలు బాధపడుతున్నారు. ఈ విషయంలో మాకూ ఎంతో బాధగా ఉంది’’ అని ఆయన చెప్పారు. సమయం వస్తే జగన్ నాయకత్వానికి మద్దతిచ్చి వైఎస్ రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు సమావేశాల సందర్భంగా చివరిసారిగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసి, తెలంగాణపై తక్షణమే నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తామన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని, లేదంటే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదివారం రాత్రి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ సాధన, అధిష్టానం తీరు, రాష్ట్రంలో పాలన తీరుతెన్నులు, వైఎస్ సంక్షేమ పథకాలు, జగన్ నాయకత్వానికి మద్దతు తదితరాలపై తన మనోగతాన్ని ఇలా వివరించారు...

కాంగ్రెస్ పరిస్థితి భయానకం: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భయంకరంగా ఉంది. తెలంగాణ ఇవ్వకపోతే బ్రహ్మ దేవుడు కూడా కాంగ్రెస్‌ను కాపాడలేడు. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ప్రకటించి, ఆ తర్వాత యూ టర్న్ తీసుకోవడంతో ఎంతోమంది యువకులు చనిపోయారు. కాంగ్రెస్‌కు పునర్వైభవం రావాలన్నా, రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్నా తెలంగాణపై తక్షణం నిర్ణయం తీసుకోవాల్సిందే.

ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది: రాష్ర్ట ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ హయాంతో పోలిస్తే సంక్షేమ పథకాల పరంగా, పాలనాపరంగా చాలా తేడా కన్పిస్తోంది. అధికారులపై నియంత్రణ లేదు. పాలన విచ్చలవిడిగా కొనసాగుతోంది. సరైన నాయకత్వం లేదు. మంత్రులు ఎవరికి వారే అన్నట్టుగా మారారు.

ఈ దుస్థితికి కారణం అధిష్టానమే: మహా నేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణం తరువాత అధిష్టానం రాష్ట్రానికి సరైన నాయకత్వాన్ని అందించలేకపోయింది. ఇక్కడున్న పరిస్థితి తెలిసినప్పటికీ ఏమీ చేయలేక వదిలేసిందా, కావాలనే జాప్యం చేస్తోందా అనేది అర్థం కావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఈ దుస్థితికి అధిష్టానమే కారణం తప్ప ఇంకెవరో కాదు.

ఇదే ఫైనల్..: త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణపై తాడోపేడో తేల్చుకుంటాం. ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలని కోరుతూ తెలంగాణ ఎంపీలమంతా చివరిసారిగా అధిష్టానం పెద్దలందరినీ కలవాలని నిర్ణయించాం. అపాయింట్‌మెంట్ దొరికితే సోనియాను కలిసి చెబుతాం. తెలంగాణ విషయంలో ప్రజలు ఇంకా ఆగేటట్టు లేరు. ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం వారు ఎదురు చూస్తున్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని ఇంకేమాత్రం ఆలస్యం చేసినా, ప్యాకేజీలకే పరిమితమైనా మేమంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన ఇప్పటికైతే లేనప్పటికీ, జేఏసీతో కలిసి అందరం ఒకే తాటిపైకి వచ్చి పోటీ చేయాలని అనుకుంటున్నాం. అదెంతవరకు సాధ్యమో చూడాలి.

వైఎస్ అంటే తెలంగాణలో విపరీతమైన అభిమానం: తెలంగాణలో, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో తెలంగాణవాదంతోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే విపరీతమైన అభిమానముంది. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి గడపనూ తాకాయి. వృద్ధులు, వికలాంగులు, రోగులకు వైఎస్‌పై చెప్పలేనంత ప్రేమ ఉంది. వారిప్పటికీ వైఎస్‌కు విశ్వాసపాత్రులుగా ఉన్నారు. తెలంగాణ ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని ప్రజలు భావిస్తున్నారు. అందుకే తెలంగాణ నాయకులు కూడా.. తెలంగాణ వచ్చే లోపు రాష్ట్రం బాగుపడాలన్నా, వైఎస్ పథకాలు అమలు కావాలన్నా జగన్ వల్లే సాధ్యమని నమ్మి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు.

జగన్ కోసం జనం ఎదురుతెన్నులు: వైఎస్ నాయకత్వాన్ని చూశాక... ఆ తరవాత వచ్చిన ఏ ముఖ్యమంత్రికీ అంతటి పట్టు లేదని తెలిసిపోయింది. కిరణ్ స్థానంలో ఎవరిని తెచ్చినా మార్పుంటుందని నేననుకోను. అందుకే రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు జగన్ వైపు చూస్తున్నారు. అంతటా దీనిపైనే చర్చ నడుస్తోంది. రాష్ర్టం బాగుపడాలంటే బలమైన నాయకత్వం కావాలి. జగన్ మంచి నాయకత్వం వహిస్తారని నేనూ నమ్ముతున్నా. తెలంగాణలో వైఎస్‌పై అభిమానంతో పాటు తెలంగాణ సెంటిమెంట్ కూడా ఉంది. ఎన్నికల్లో జనం పూర్తిగా జగన్‌వైపే మొగ్గుచూపుతారో, లేక చెరి సగం సీట్లు ఇస్తారో చూడాలి. ఈ విషయంపై ఇప్పటికిప్పుడు చెప్పలేం.

వైఎస్ రుణం తీర్చుకుంటాం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మా కుటుంబానికి గాడ్‌ఫాదర్. మాకు అభిమాన నాయకుడు. ఆయన చనిపోయాక కొందరు స్వార్థ పరులు మమ్మల్ని పార్టీ నుంచి బయటికి పంపడానికి కుట్ర చేస్తున్నారు. సమయం వస్తే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రజలు అనుకుంటే వారి ఆకాంక్షల మేరకు వ్యవహరిస్తాం. తద్వారా వైఎస్ రుణం తీర్చుకున్నట్టవుతుంది. జగన్ మంచి నాయకత్వానికి మద్దతిచ్చినట్టు కూడా అవుతుంది. మేం జగన్ వెంట ఉన్నప్పటికీ ఆయనను ఒప్పించి తెలంగాణ సాధించుకుంటామే తప్ప రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఏమిటో తెలుసు కాబట్టి రాష్ట్రం కోసం పోరాడుతున్నాం. సమయం వచ్చినప్పుడు వైఎస్ కుటుంబం రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాం.
ముందస్తు తప్పదేమో: మజ్లిస్ మద్దతు ఉపసంహరణ, ఆ పార్టీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు మైనారిటీలు దూరమైనట్టు కన్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకపోతే ఆ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రజాప్రతినిధులంతా మళ్లీ రాజీనామా చేయడం ఖాయం. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుందనే నమ్మకం మాకు లేదు.

source:sakshitv

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!