YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 12 December 2012

పల్లెల్లో పాలన ఏదీ ?

* గ్రామాలకు సర్పంచులు ఎక్కడ?
* ఏళ్లు గడుస్తున్నా పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు
* పల్లె జనం కష్టాలు, కన్నీళ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు
* వైఎస్ గిరిజన తాండాలను, మారుమూల పల్లెలను గ్రామ పంచాయతీలుగా మార్చాలనుకున్నారు
* కానీ ఈ పాలకులు ఉన్న పంచాయతీలనే నిర్వీర్యం చేస్తున్నారు
* ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు డ్రామాలాడుతున్నారు 

మరో ప్రజా ప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘గిరిజన తాండాలను, చిన్నచిన్న పల్లెలను గ్రామ పంచాయతీలుగా చేయాలని వైఎస్సార్ ఆలోచించారు. కానీ ఈ పాలకులు ఉన్న గ్రామ పంచాయతీలనే నిర్వీర్యం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. పంచాయతీలకు ఎన్నికల్లేవు. గ్రామాలకు సర్పంచులు లేరు. అధికారులేమో పల్లెలకు రారు. పల్లెల్లో ప్రజల కష్టాలను, కన్నీళ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యారు..’’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు పెడితే అన్ని స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని సర్కారుకు భయం పట్టుకుందని అన్నారు. 

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పాలకులతో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం 55వ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గంలో సాగింది. సిరిగిరిపురంలో రచ్చబండ కార్యక్రమంలో పెంటమ్మ అనే వృద్ధురాలు పల్లె పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పల్లె పడావు పడింది. ఓ పెసిడెంటు (సర్పంచు) లేడు.. ఎంపీటీసు (ఎంపీటీసీ) లేడు. ఊరు దిక్కు లేకుండా పోయింది. మడి తడుపుకుందామన్నా కరెంటు లేదు. చాపంత భూమికి కూడా నీళ్లు పారుతలే.. పెసిడెంటు దిగిపోయిన దినాంనుంచి సారోళ్లు (అధికారులు) ఊళ్లకు రాట్లేదు’’ అని ఆమె అనడంతో షర్మిల ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.

ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి..
‘‘15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మన ముఖ్యమంత్రి చెప్తున్నారు. అందులో కనీసం 10 శాతం మందికి కూడా ఇప్పటివరకు ఉద్యోగాలు కల్పించలేదు. ఆరు వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. అయ్యా.. ఆరు వేల లక్షల కోట్లు ఏమో గాని కరెంటు సరఫరా లేక ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కొన్ని పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. మరికొన్ని పరిశ్రమలు నడిచే పరిస్థితి లేకపోవడంతో కంపెనీల్లో పనిచేసే లక్షలాదిమంది యువకులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. వాళ్ల కుటుంబాల భవిష్యత్తు రోడ్డున పడుతోంది. ఇవేవీ మీకు పట్టదా..?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం ఏర్పడింది. పక్క రాష్ట్రాల్లో కూడా విద్యుత్తు సంక్షోభం ఉన్నప్పటికీ వాళ్లు ముందస్తు ప్రణాళికతో విద్యుత్తు కొనుగోలు చేసి సమస్యను అధిగమించారు. మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి తన సీటును పదిలపరుచుకునే పనిలో పడి ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. 

ఈ ప్రభుత్వం ఉండి కూడా ప్రజలకు ప్రయోజనం లేదు. వైఎస్సార్ 7 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానన్నారు... ఇచ్చి చూపించారు. ఆయన బతికే ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరేవారు. కానీ ఈ పాలకులు ఉచిత విద్యుత్తును ఏ క్షణంలోనైనా ఎత్తివేసినా ఆశ్చర్యం లేదు. కరెంటు రెండు మూడు గంటలైనా ఉండడం లేదని రైతులు, ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మన ముఖ్యమంత్రి.. కరెంటు లేకపోతే ఏం? కిటికీలు, తలుపులు తీసి పడుకోండి అని అంటున్నారు. ఆయన మాత్రం ఏసీలో ఉంటూ.. ప్రజలకు ఇలా ఉచిత సలహాలు పడేస్తారు’’ అని విమర్శించారు.

డ్రామాలు ఎందుకు.. అవిశ్వాసం పెట్టు బాబు!
చంద్రబాబు ఆయన హయాంలో నాలుగు వేల మందిని పొట్టనబెట్టుకొని ఏ గ్రామాలనైతే శ్మశానాలుగా మార్చారో మళ్లీ అవే గ్రామాల్లో పాదయాత్ర పేరుతో తిరుగుతున్నారని షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘గ్రామాల్లో తిరుగుతూ వైఎస్ చేసిన వాగ్దానాలనే తాను కూడా చేస్తానంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. వైఎస్సార్‌గారు రైతుల కోసం 12 వేల రుణ మాఫీ చేస్తే.. ఇప్పుడు నేను కూడా ఇస్తాను అని చెప్తున్నారు. వైఎస్సార్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు చేస్తే.. ఇప్పుడు నేను చేస్తానని చెప్తున్నారు. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ చేసి చూపిస్తే.. ఆయన ఇప్పుడు నేను కూడా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. 

అయ్యా..! చంద్రబాబునాయుడు గారు ఇప్పుడు మీరు చేస్తున్న వాగ్దానాలన్నీ వైఎస్సార్ ఏనాడో చేసి చూపించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు నక్క జిత్తుల మాటలతో ప్రజలను నమ్మించడానికి మీరు ఎన్ని వాతలు పెట్టుకున్నా.. నక్క నక్కే..పులి పులే..’’ అని అన్నారు. చంద్రబాబు నాయుడుకు వాగ్దానాల్లో నిజాయతీ ఉండద ని, ఆయనకు నిజంగా ప్రజలపై ప్రేమే ఉంటే.. పాదయాత్రల పేరుతో కాలయాన చేయక ఈ ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని నిలదీశారు. ఓవైపు అసమర్థ ప్రభుత్వం అంటూనే మరోవైపు అదే ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. 

జాబులు ఎవరికి ఇస్తున్నాడమ్మా?
‘‘జొన్నరొట్టెలు తినుకుంటా పిలగాండ్లను సదివించినాం. ఒక్కని కన్నా గౌరిమెంటు ఉద్దానం (ప్రభుత్వ ఉద్యోగం) లేదు. టీవీల జూత్తే కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరు లచ్చల మంది పిలగాండ్లకు ఉద్దానాలు ఇత్తున్నా అని చెప్పుతుండు. ఆయన ఎవరికి ఇత్తున్నాడమ్మా..? మా పిల్లలను సూడు.. మా బతుకులు సూడు! సిన్నతనాన పిల్లగాండ్లను మాతోటి పనికి తీసుకొనిపోయినా... వాడు ఈపాటికి సేతికొచ్చేటోడు. ఇటు జాబ్ లేదు.. అటు ఎండకు పని జేయలేడు. పిల్లలు ఎలా బతకాలమ్మా?’’ అని సిరిగిరిపురం గ్రామానికి చెందిన తిరుపమ్మ అనే మహిళ షర్మిలతో ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం మన్సాన్‌పల్లి నుంచి ప్రారంభమైన షర్మిల పాతయాత్ర మహేశ్వరం, సిరిగిరిపురం, హర్షగూడ, మంఖాల్ మీదుగా తక్కుగూడ కు చేరింది. అన్ని గ్రామాల్లో షర్మిల రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి 7 గంటలకు తక్కుగూడ శివారులో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకున్నారు. 

బుధవారం మొత్తం 18.90 కి.మీ మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 791.70 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. షర్మిల వెంట పాదయాత్రలో నడిచిన నేతల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, నేతలు రాజ్‌ఠాకూర్, జనక్ ప్రసాద్, జంగా కృష్ణమూర్తి, లక్ష్మీ పార్వతి, బెక్కరి జనార్దన్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, దేప సురేఖ, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, శివకుమార్, ఆదం విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!