YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 9 December 2012

చీకటి ఒప్పందం మేరకే ...

కుమ్మక్కు, వెన్నుపోటు రాజకీయాలకు టీడీపీ అధినేత చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా మారారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. నారాయణపురంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో చేసుకున్న చీకటి ఒప్పందం మేరకే ఎఫ్‌డీఐకు వ్యతిరేకంగా రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో ముగ్గురు టీడీపీ ఎంపీలు పాల్గొనలేదని ఆరోపించారు. వారిని పార్టీనుంచి సస్పెండ్ చేయకపోవడం వారి మధ్య ఒప్పందాన్ని రుజువు చేస్తోందన్నారు. భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు సీట్లసర్దుబాటు చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు మాత్రం వత్తాసుపలకడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని గ్రహించిన చంద్రబాబు కాంగ్రెస్‌తో దోస్తీ చేసేందుకు మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రామారావు పార్టీని స్థాపిస్తే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నారని ఎద్దేవాచేశారు. పీఆర్పీ మాదిరిగా టీడీపీని కూడా కాంగ్రెస్‌లో కలిపేస్తే కనీసం కేంద్రమంత్రి పదవి అయినా చంద్రబాబుకు దక్కుతుందని సలహా ఇచ్చారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అసమర్ధంగా ఉందనీ, ఒక్క క్షణంకూడా అధికారంలో కొనసాగే అర్హతకూడా కోల్పోయిందని చెబుతున్న బాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడంలేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగనమోహన్‌రెడ్డిని రాజకీయంగా అణగదొక్కేందుకు కాంగ్రెస్‌తో చేసుకున్న కుమ్మక్కు రాజకీయాలను జనమంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు.


‘కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసినందుకే ఆగమేఘాల మీద వారిని సస్పెండ్ చేశారు. ఎఫ్‌డీఐల మీద జరిగిన ఓటింగ్‌కు మీ ఎంపీలు డుమ్మా కొట్టారు. వారి మీద ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు చెప్పాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని వైఎస్‌ఆర్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలు నగర విభాగం నూతన కమిటీ ప్రకటన సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్ జరిగేటప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని, వారి పార్టీ ఎంపీలు రాజ్యసభలో వ్యవహరించిన తీరే దీన్ని స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు కపట నాటకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు.



చంద్రబాబు సమాధానం చెప్పాలి 

శోభా నాగిరెడ్డి డిమాండ్

ఆళ్లగడ్డ(కర్నూలు), న్యూస్‌లైన్: రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సమయంలో తెలుగుదేశం విప్ ఎందుకు జారీ చేయలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై కీలక ఓటింగ్ సమయంలో ముగ్గురు టీడీపీ ఎంపీలు బాబుకు చెప్పకుండా గైర్హాజరయ్యారంటే ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమేనని, కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌లో భాగంగానే విప్ జారీ చేయలేదని విమర్శించారు. తనను సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవడం, సొంత కంపెనీ హెరిటేజ్‌లో లాభాలు పొందడం, జగన్‌ను జైలులోనే ఉంచడం అనే మూడు ఒప్పందాలకు లోబడే చంద్రబాబు ముగ్గురు ఎంపీలను ఓటింగ్‌కు దూరంగా ఉంచారన్నారు. 

ఓటింగ్‌కు గైర్హాజరుపై ముగ్గురు ఎంపీలు చెబుతున్న కారణాలు స్కూలుకు డుమ్మా కొట్టిన పిల్లల మాటల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో పార్టీ నాయకుడు దేవేందర్‌గౌడ్, విప్ గుండు సుధారాణి, బాబుకు అన్నీ తానే అని చెప్పుకునే ఉప నాయకుడు సుజనాచౌదరి ఓటింగ్‌లో పాల్గొనలేదంటే.. ఎఫ్‌డీఐలపై టీడీపీ ద్వంద్వ వైఖరి, కాంగ్రెస్‌తో ముందస్తు ఒప్పందం బహిర్గతమయ్యాయని అన్నారు. బాబుకు తెలిసే ముగ్గురు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరు అయినట్లయితే.. చంద్రబాబు తన పాదయాత్ర కు ఫుల్‌స్టాప్ పెట్టి కాంగ్రెస్ పొత్తుతో 2014 ఎన్నికల్లో పోటీ చేయాలని శోభానాగిరెడ్డి సూచించారు. ఒకవేళ తనకు తెలియకుండానే జరిగితే ముగ్గురు ఎంపీల్నీ సస్పెండ్ చేసి బాబు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. 

ఎంపీలను ఓటింగ్‌కు గైర్హాజరవమని చెప్పి మళ్లీ సొంత ఎంఎల్‌ఏలతోనే వారిని తిట్టిస్తున్నారని ఆమె విమర్శించారు. తమ అధినేతకు చెప్పి ఓటింగ్‌కు గైర్హాజరైనట్టు దేవేందర్‌గౌడ్ చెప్పడంతోనే చంద్రబాబు ద్వంద్వనీతి బయట పడిందన్నారు. అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు ఆమోదం తెలిపే విషయంలోనూ టీడీపీ డ్రామా కొనసాగిందని విమర్శించారు. ఓటింగ్ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు నామమాత్రంగా ఉండడాన్నిబట్టే బాబుకు సబ్‌ప్లాన్‌పై ఉన్న చిత్తశుద్ధి బయటపడిందన్నారు. సబ్‌డివిజన్ పేరుతో ఆ పార్టీ అసెంబ్లీలో డ్రామా ఆడిందన్నారు. రాష్ట్రప్రభుత్వంపై అవిశ్వాసం విషయంలోనూ ఇదే డ్రామా సాగిందన్నారు. బీఏసీ మీటింగ్‌లో డిసెంబర్ 10 నుంచి 21 వరకు అసెంబ్లీ సమావేశాలుంటాయని స్పీకర్ ప్రకటించి తర్వాత కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండవని వాయిదా వేయడం శోచనీయమన్నారు. అసెంబ్లీ సమావేశాల్ని ముందు చెప్పినట్టుగా కొనసాగించాలని ప్రధాన ప్రతిపక్షం ఎందుకు డిమాండ్ చేయట్లేదని ప్రశ్నించారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!