YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 14 December 2012

మరో ప్రజాప్రస్థానానికి జనహోరు.. మహిళల ఘనస్వాగతం

* నాన్న రంగారెడ్డిని సొంత జిల్లాగా భావించేవారు: షర్మిల
* మరో ప్రజాప్రస్థానానికి జనహోరు.. మహిళల ఘనస్వాగతం
* జిల్లాలో ఉత్సాహంగా సాగిన నాలుగోరోజు పాదయాత్ర
* వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం 

రంగారెడ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: జనహృదయ నేత డాక్టర్ వైఎస్సార్ కుమార్తె షర్మిలకు జిల్లాలో మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆమె చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో నాలుగోరోజు ఉత్సాహంగా సాగింది. ‘మా నాన్న జిల్లాను సొంత జిల్లాగా భావించేవారని షర్మిల పలుమార్లు ప్రస్తావించినపుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. యాత్ర పొడవునా జై జగన్.. జోహార్ వైఎస్సార్ నినాదాలతో శివారు గ్రామాలు మార్మోగాయి.

వివిధ రాజకీయ పార్టీల నాయకులు, శ్రేణులు పెద్దసంఖ్యలో పార్టీ తీర్థ పుచ్చుకునేందుకు మహా పాదయాత్ర మార్గం సుగమం చేసింది. శుక్రవారం నగర శివారులోని నాదర్‌గుల్ నుంచి మొదలైన యాత్ర.. బడంగ్‌పేట్,అల్మాస్ గూడా మీదుగా ఇంజాపూర్ వరకు సాగింది. పాదయాత్ర అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. కరెంట్ బిల్లుల మోత, వ్యవసాయానికి అరకొర విద్యుత్ సరఫరా, పింఛన్లలో కోత తదితర సమస్యలను ప్రజలు షర్మిల ముందు ఏకరువు పెట్టారు.

శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నాదర్‌గుల్ గ్రామంలో మొదలైన మరో ప్రజాప్రస్థానానికి మహిళలు, యువకులు, విద్యార్థులు, వద్ధులు ఇలా అన్నివర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో పోటెత్తారు. వైఎస్సార్ ఆశయ సాధనకోసం చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. నాదర్‌గుల్, వీకర్ సెక్షన్‌కాలనీ, ఎంవీఎస్సార్ కాలేజి, బడంగ్‌పేట్, అల్మాస్‌గూడ, ప్రశాంతిహిల్స్, బీడీరెడ్డి గార్డెన్స్ మీదుగా బీఎన్‌రెడ్డినగర్ బహిరంగ సభ వేదిక వద్దకు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగింది. అక్కడ బహిరంగ సభ అనంతరం ఇంజాపూర్ గ్రామం వరకు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగింది. 

పింఛన్లు అందడం లేదవ్మూ..
కాగా నాదర్‌గుల్ గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు అందడం లేదని పలువురు మహిళలు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయానికి నాలుగు గంటలకు మించి కరెంట్ సరఫరా జరగడం లేదని తమ గోడు వినిపించారు. వైఎస్సార్ మరణం తర్వాత సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని షర్మిల ధ్వజమెత్తినపుడు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. చప్పట్లు కొడుతూ..జై వైఎస్సార్, జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. బడంగ్‌పేట్ గ్రామంలోనూ స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. షర్మిలను చూసేందుకు వ్యవసాయ కూలీలు, నిర్మాణరంగ కార్మికులు పనులు వదిలిపెట్టుకొని యాత్రవద్దకు పరుగులు తీసి.. ఆమెతోపాటు కదంతొక్కారు. టెక్నియా పాఠశాల విద్యార్థులు తరగతుల నుంచి బయటకి వచ్చి ఆత్మీయ అతిథి పాదయాత్రను ఆసక్తిగా తిలకించారు. స్థానిక యువకులు షర్మిల యాత్రపై పూలవర్షం కురిపించారు. అల్మాస్‌గూడ వద్ద పెద్దసంఖ్యలో గుమిగూడిన గ్రామస్తులు రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం పలికారు. 

స్థానిక సాన్వి మేనేజ్‌మెంజ్ కళాశాల విద్యార్థినులు తరగతులు బహిష్కరించి షర్మిల యాత్రకు సంఘీభావం తెలిపారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు అందడంలేదని బిందు, తన్వీర్ అనే ఎంబీఏ విద్యార్థినులు తమ సమస్యలను షర్మిలకు తెలిపారు. వై.ఎస్ మరణం తరవాత ప్రస్తుత సర్కారు పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తోందని, జగనన్న ముఖ్యమంత్రి కాగానే విద్యార్థుల కష్టాలు తీరతాయని ఆమె భరోసా ఇచ్చి ముందుకు సాగారు. 

సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బీడీరెడ్డి గార్డెన్స్ ఎదుట నిర్వహించిన రచ్చబండలో నిత్యావసరాల ధరలు పెరిగాయని పలువురు మహిళలు తమ కష్టాలను షర్మిలకు చెప్పారు. వంటగ్యాస్, కరెంట్ ఛార్జీలు, నీటిబిల్లులు పెరిగాయని, బలహీనవర్గాల కాలనీలకు రహదారులు, మంచినీటి వసతి లేదని వాపోయారు. వారి కష్టాలను సావధానంగా విన్న ఆమె అనంతరం మాట్లాడుతూ.. నగదు బదిలీ, ఆరు సిలిండర్లకే సబ్సిడీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. 

పోటెత్తిన యువజనం..
షర్మిల యాత్రలో మహిళలతోపాటు, 18-35 ఏళ్ల మధ్య వయస్సున్న విద్యార్థులు, యువకులు, పోటెత్తారు. పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా తటస్థంగా ఉన్నవారు సైతం షర్మిల యాత్రను తిలకించేందుకు ఆసక్తిచూపడం విశేషం. గహిణులు,కూలీలు దారిపొడవునా ఆమె యాత్రకు సాదర స్వాగతం పలకడం కనిపించింది.

శ్రేణుల్లో కొత్త ఉత్సాహం...
మహేశ్వరం,ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు,శ్రేణుల్లో షర్మిల యాత్ర కొత్త ఉత్సాహం నింపింది. వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా బీఎన్‌రెడ్డి నగర్ బహిరంగ సభకు తరలిరావడం చర్చనీయాంశమైంది. షర్మిల ప్రసంగిస్తున్న సమయంలో నాడు చంద్రబాబు, నేడు కిరణ్ సర్కారు దొందూ దొందేనన్న విమర్శలు చేసినపుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. ఆమె ప్రసంగాన్ని అమూలాగ్రం వినేందుకు జనం గంటపాటు ఓపికగా రహదారులపైనే కదలకుండా నిలబడి ఉండడం విశేషం.

వేలాదిగా హాజరైన విద్యార్థులు..
షర్మిల యాత్ర మొదలైన నాదర్‌గుల్ నుంచి ఇంజాపూర్ వరకు మరో ప్రజాప్రస్థానంలో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. 

దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో తాము ఉన్నత విద్య చదువగలిగామని,ప్రస్తుత సర్కారు ఈ పథకానికి తూట్లుపొడుస్తుందని ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైతే తమకు మళ్లీ మంచిరోజులు వస్తాయని వారు ఆశాబావం వ్యక్తంచేశారు.

వృద్ధుల్లోనూ ఆసక్తి...
రాజన్న బిడ్డను చూసేందుకు వయస్సును లెక్కచేయకుండా వృద్దులు పెద్ద సంఖ్యలో పాదయాత్రకు అడుగడుగునా సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ హయాంలో పింఛన్లు సమయానికి అందాయని గుర్తుచేసుకున్నారు. పలువురు వికలాంగులు సైతం షర్మిల యాత్ర మార్గంలో ఆమెను కలిసేందుకు పోటీలు పడడం కనిపించింది.

నలువైపులా జన ప్రభంజనమే..
సాయంత్రం బీఎన్‌రెడ్డి నగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్,తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనంతో వనస్థలిపుర ం రహదారులు కిక్కిరిశాయి. సభాప్రాంగణానికి దారితీసే అన్ని రహదారులూ జనంతో నిండాయి. ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం కనిపించింది. 

ఆకట్టుకున్న ఆటా.. పాట..
బీఎన్‌రెడ్డినగర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన వేదికపై వంగపండు ఉష నేతృత్వంలోని కళాబృందాలు ప్రదర్శించిన ఆటా.. పాట సభకు విచ్చేసిన వారిలో ఉత్సాహం నింపాయి. వైఎస్సార్ హయాంలో జరిగిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను పాటల రూపంలో వినిపించడంతో ప్రజల్లో ఉత్సాహం నిండింది. షర్మిలతోపాటు పాదయాత్రలో పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, బి.జనార్ధన్‌రెడ్డి, జెన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, పల్లపు రాము, అమృతాసాగర్, కొండా రాఘవరెడ్డి, బొక్క జంగారెడ్డి, వంగా మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!