YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 11 December 2012

నాన్న బతికుంటే ‘ప్రాణహిత’ పూర్తయ్యేది

తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు తపించారు
బాబు కష్టసాధ్యమన్నారు.. 
వైఎస్ చిత్తశుద్ధితో పనులు మొదలుపెట్టారు
పనులు ఆగిపోవడానికి సర్కారు నిర్లక్ష్యమే కారణం
కడపకంటే రంగారెడ్డి జిల్లా అంటేనే నాన్నకు ప్రియం
ఆ అభిమానంతో ఏ కార్యక్రమమైనా 
ఇక్కడి నుంచే ప్రారంభించేవారు..

రంగారెడ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘చేవెళ్ల-ప్రాణ హిత’ ప్రాజక్టు పనులు ఆగిపోవడానికి ప్రస్తుత సర్కారే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘మరో ప్రజాప్రస్థానం’ యాత్ర లో భాగంగా మంగళవారం జిల్లాలోకి ప్రవేశించిన షర్మిల మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లి చౌరస్తాలో జరిగిన సభలో మాట్లాడారు.‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఆసాధ్యమని, చేయడం కష్టమని చంద్రబాబు అంటే... ఎంత కష్టమైనా ఈ ప్రాజెక్టు నిర్మించాల్సిందే నని, ఈ ప్రాజెక్టుతోనే తెలంగాణ లోని 16 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వైఎస్ రాజశేఖరరెడ్డి తపించారు. అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అయినప్పటికీ, చిత్తశుద్దితో పనులు కూడా మొదలుపెట్టారు, జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేశారు. వైఎస్ చనిపోవడంతో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. దీన్ని పట్టించుకున్నవారే లేకుండా పోయారు. నాన్న బతికున్నట్లయితే చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు పూర్తయ్యేది. రంగారెడ్డి జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సేద్యపు నీరందేది. కానీ, ఇప్పటీ సర్కారు దీన్ని పూర్తిగా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది’ అని ఆమె అన్నారు.


నాన్నకు ప్రియమైన జిల్లా
నాన్నకు ఈ జిల్లా అంటే ఎనలేని అభిమానం. సొంత జిల్లా కడప అయినప్పటికీ, రంగారెడ్డి జిల్లాను తన సొంత జిల్లాగా భావించారు. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. నాన్న ఆశీర్వాదం తీసుకోవాలని నేను ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలుపెడితే.. నాన్న మాత్రం తన సొంత జిల్లాగా భావించిన ఈ జిల్లా నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ఎంతో ప్రియమైన జిల్లా కాబట్టే ప్రతి పథకాన్ని ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, పావలావడ్డీ, ఫీజు రీయింబ ర్స్‌మెంట్ పథకాలను ఈ జిల్లా నుంచే ప్రవేశపెట్టారన్నారు. 

సర్కారు బతికున్నట్టా... చచ్చినట్టా !
మహేశ్వరం మండలంలో మంచినీటి సమస్య తీవ్రంగా మారింది. ‘మెట్రో’ నీటిని సరఫరా చేయాలని భావించారు. కనీసం తాగునీరు అందించని ప్రభుత్వం బతికున్నట్టా... చచ్చినట్టా అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ హయాంలో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందింది.ఔటర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్కులు వచ్చాయి. ఆర్థికంగా స్థిరపడ్డారు. కానీ, కరెంట్ సంక్షోభంతో ఇక్కడి పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. ఎంతోమంది ఉపాధి కోల్పోయారని షర్మిల అన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్దన్, కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, జనక్ ప్రసాద్, గట్టు రాంచంద్రరావు, జనార్ధన్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, రాజ్‌ఠాగూర్, దేప భాస్కరరెడ్డి, హరివర్దన్‌రెడ్డి, అమృతాసాగర్, రాచమల్ల సిద్ధేశ్వర్, సురేశ్‌రెడ్డి, కొలను శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!