YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 10 December 2012

హెరిటేజ్‌లోకి ఎఫ్‌డీఐ తీసుకోరా?

చంద్రబాబు స్పష్టం చేయాలి 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తాను నిజంగా వ్యతిరేకమైతే.. తన సొంత సంస్థ హెరిటే జ్‌లోకి ఎఫ్‌డీఐలను తీసుకోబోమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టంగా చెప్పగలరా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు సవాల్ విసిరారు. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐల విషయంలో చంద్రబాబు ఒక స్పష్టమైన వైఖరి తీసుకోకుండా ప్రజలను మోసం చేయబోయి తానే మోసపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. హెరిటేజ్ బాగా నష్టాల్లో ఉందని, వాటి నుంచి బయటపడాలంటే ఎఫ్‌డీఐలు వస్తేనే సాధ్యమవుతుందనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఓటేయాలని ఒక చోట, గైర్హాజరు కావాలని మరో చోట ఇలా చెప్తూ అసలు ఈ అంశంపై తన వైఖరి ఏమిటనే విషయం తెలియకుండా చంద్రబాబు వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. ముగ్గురు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరు కావటం, వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం అంతా చిత్ర విచిత్రంగా ఉందని, దీనికంతకూ కారణం ఒక విధానపరమైన స్పష్టత లేకపోవటమేనన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల వైరుధ్యంలో చిక్కుకున్నారనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ‘ద హిందూ’ ఆంగ్ల పత్రిక రాసిన వార్త కూడా ఆయన పరిస్థితేంటో తెలియజేస్తోందని సోమయాజులు ఉదహరించారు. 

ఎఫ్‌డీఐ కోసం కేంద్రంపై బాబు ఒత్తిడి... 

‘‘హెరిటేజ్ చిల్లర వర్తక సంస్థకు అధిపతి అయిన చంద్రబాబు టీడీపీకి అధ్యక్షుడు కూడా. ఆయన హెరిటేజ్ డెయిరీని స్థాపించాక చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ డెయిరీ ఎలా దెబ్బ తిన్నదో అందరికీ తెలుసు. ప్రస్తుతం హెరిటేజ్ చిల్లర వ్యాపార రంగం బాగా దెబ్బ తిన్నది. మూడు నాలుగేళ్లుగా ఆ సంస్థకు భారీగా నష్టాలొస్తున్నాయి. ఆ సంస్థ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే బాగా లాభపడేది తన హెరిటేజ్ సంస్థేనన్న విషయం బాబుకు బాగా తెలుసు. విదేశీ పెట్టుబడులు వస్తే తన సంస్థ నష్టాల ఊబిలోనుంచి బయట పడటమే కాకుండా.. వందల కోట్ల రూపాయల లాభాలు కూడా వస్తాయి. అందుకే చంద్రబాబు గత మూడు నాలుగేళ్లుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లినపుడల్లా చిల్లర వర్తక రంగంలో ఎఫ్‌డీఐల రాకకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందరికన్నా ముందుగా దీనివల్ల బాగుపడేది ఆయనొక్కడేనన్న విషయం తెలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇది బయటపడకూడదని ఆయన భావిస్తూ వచ్చారు. తాను ఎఫ్‌డీఐలకు అనుకూలమనే విషయం బయటకు తెలిస్తే రాష్ట్రంలోని 80 లక్షల మంది చిల్లర వ్యాపారులు వ్యతిరేకమై టీడీపీకి ఓట్లేయరని బాబుకు భయం. అందుకే ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యాపార లాభాల మధ్య సంఘర్షణలో నలిగి పోతున్నారనేది ఇక్కడ స్పష్టమవుతోంది’’ అని సోమయాజులు చంద్రబాబు పడుతున్న పాట్లను వివరించారు. 

ఎఫ్‌డీఐలను ఆహ్వానించాలని హెరిటేజ్ 
పాలకమండలి నిర్ణయం... 

ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతున్నపుడే హెరిటేజ్ సంస్థ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు (ఈయన మాజీ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయనకు కార్యదర్శిగా పని చేశారు) ‘ఎకనమిక్ టైమ్స్’ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెరిటేజ్ సంస్థలోకి భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలని తమ పాలక మండలి (బోర్డు) ప్రతిపాదనలను ఆమోదించిందనే విషయాన్ని వెల్లడించారని సోమయాజులు గుర్తుచేశారు. ఇందుకోసం కొత్త కంపెనీని ఏర్పాటు చేసినట్లు కూడా సాంబశివరావు వెల్లడించారని చెప్పారు. ఈ తరుణంలో బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హెరిటేజ్‌లోకి 51 శాతం విదేశీ పెట్టుబడులను తీసుకోబోమని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎఫ్‌డీఐల పట్ల అనుకూలత ఉంటే ఆ విషయం బాబు కాంగ్రెస్ మాదిరిగా బహిరంగంగానే చెప్పాలన్నారు. చంద్రబాబు ఈ వ్యవహారంలో తాను అయోమయంలో ఉండిపోయి రాష్ట్రాన్ని, దేశాన్ని గందరగోళంలో పడేయాలని చూస్తున్నారని విమర్శించారు. 

‘రుణమాఫీ’ అనేది రైతులను మోసం చేయటమే... 

తాను రైతుల రుణాలను మాఫీ చేస్తానంటే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని చంద్రబాబు చెప్పుకోవటం పెద్ద మోసం తప్ప మరొకటి కాదని సోమయాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రుణాల మాఫీ ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తే బాబు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. రుణాల మాఫీ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉంటుందా? ఎలా చేయిస్తారో చెప్పాలని మాత్రమే మేం అడుగుతున్నాం’’ అని పేర్కొన్నారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తమ చేతుల్లో ఉన్న ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయటంతో పాటుగా అప్పటికే 1,300 కోట్ల రూపాయల రైతు కరెంటు బకాయిలన్నీ రద్దు చేశారని ఆయన గుర్తుచేశారు. ఈ రెండూ తమ చేతుల్లో ఉన్నాయి కనుక తక్షణం చేయగలిగారని, రుణాల మాఫీ తామే చేస్తామని ఏనాడూ ఆయన చెప్పలేదని పేర్కొన్నారు. 2001-03 సంవత్సరం వరకూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భయానక పరిస్థితులు నెలకొని రైతులు అష్టకష్టాలు పడుతోంటే చంద్రబాబు ఒక్కరోజు కూడా కేంద్రం వద్దకు వెళ్లి రుణాల మాఫీ గురించి గానీ, కనీసం వడ్డీ మాఫీ గురించి గానీ అడిగిన పాపాన పోలేదన్నారు. గుజ్రాల్‌ను, దేవెగౌడను తానే ప్రధానులుగా చేశానని తనకే ప్రధానిగా అవకాశం వస్తే తెలుగు ప్రజల సేవ కోసం వద్దన్నానని గొప్పలు చెప్పుకున్న వ్యక్తి తాను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో అసలు ఎందుకు రుణాల మాఫీ ఊసెత్తలేదని మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోందన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!