YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 10 December 2012

ఇది రాబందుల రాజ్యం..


మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇది రాబందుల రాజ్యం.. వైఎస్సార్ ఉచితంగా ఇచ్చిన విద్యుత్తు పథకానికి ఈ పాలకులు తూట్లు పొడుస్తున్నారు. సర్ చార్జీలు వేసి పేదల మీద మోయలేని భారం మోపుతున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్తు బకాయిలు కట్టని రైతులను ఎత్తుకొని పోయి జైల్లో పెట్టిన పాత రోజులను మళ్లీ కిర ణ్‌కుమార్‌రెడ్డి గుర్తుకు తెస్తున్నారు. వేలకు వేలు వస్తున్న కరెంటు బిల్లులను కట్టలేని తమ వాళ్లను పోలీసు స్టేషన్లలో పెట్టారని, తాళిబొట్టు కుదవబెట్టి విడిపించుకున్నామని నా అక్కా చెల్లెమ్మలు చెప్తున్నపుడు మనసుకు చాలా బాధనిపించింది.

ఇందుకోసమేనా వైఎస్సార్ తన రెక్కల కష్టం మీద ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిందని అనిపించింది’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల బాధలు పట్టని ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రజల్ని గాలికొదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 53వ రోజు సోమవారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. కొత్తూరు, ఎన్ముల నర్వలలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

మహిళల ఉసురు పోసుకుంటున్నారు..

‘‘మహిళల తాళిబొట్టు తాకట్టు పెట్టించి కరెంటు బిల్లు కట్టించుకొంటోందీ ప్రభుత్వం. మహిళలను కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ పాలకులు ఊరికే పోరు. వాళ్ల ఉసురు తాకి పోతారు’’ అని షర్మిల విమర్శించారు. ‘‘ఇవాళ ఎక్కడ చూసినా రైతన్నలు అప్పుల ఊబిలో ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ భయంకరమైన విద్యుత్తు సంక్షోభం ఉంది. రోజుకు రెండు మూడు గంటల కరెంటు సరఫరా కూడా లేదు. రైతులకైతే ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడం లేదు. ఉచితం ఉంచుతారో.. ఎత్తేస్తారో.. తెలియడం లేదు. పరిశ్రమలకు కూడా కోతలు పెడుతున్నారు. విద్యుత్తు కోతతో పరిశ్రమలు మూతపడ్డాయి. మరికొన్ని పరిశ్రమలు ఉత్పత్తి తగ్గించుకోవడం వల్లలక్షలాది మంది యువకులు నిరుద్యోగులై రోడ్డున పడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డి 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. అందులో 10 శాతం కూడా కల్పించలేకపోయారు. రూ. వేల కోట్ల పెట్టుబడులు తెస్తానని అన్నారు. ఏమీ తేలేకపోయారు. కొత్త పరిశ్రమలు మన రాష్ట్రానికి రావ డం సంగతి పక్కన పెడితే.. కరెంటు సంక్షోభంతో ఉన్న పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఈ పాపం సర్కారుది కాదా?’’ అని ఆమె నిలదీశారు. ప్రజల రక్తం తాగుతున్న ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టి దించు చంద్రబాబూ అని రోజూ చెప్తున్నా.. ఆయనకు పట్టడం లేదని, ఇది చేతగాని ప్రభుత్వం అని విమర్శిస్తూనే ఆయన ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని షర్మిల విమర్శించారు.

నేటి నుంచి రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర

మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుతున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 53వ రోజు సోమవారం ఉదయం కొత్తూరు మండలం జేపీ దర్గా నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఎన్ముల నర్వ మీదుగా పాదయాత్ర చేస్తూ సాయంత్రానికి కొత్తూరు మండల కేంద్రానికి షర్మిల చేరారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అక్కడి నుంచి 3 కిలో మీటర్లు ప్రయాణం చేసి రాత్రి 7.45 గంటలకు షర్మిల కొత్తూరు తాండలోని బస కేంద్రానికి చేరుకున్నారు. సోమవారం మొత్తం 16.50 కిలోమీటర్ల యాత్ర సాగింది. ఇప్పటి వరకు మొత్తం 756.30 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. మంగళవారం మధ్యాహ్నం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంతో మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర ముగుస్తుంది. అక్కడి నుంచి మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామంలోకి ప్రవేశించడంతో రంగారెడ్డి జిల్లాలో యాత్ర మొదలవుతుంది

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!