పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన గురించి పరస్పరం కలహించుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి పురందేశ్వరి ఇద్దరికీ కనీసం ఆయన పేరెత్తడానికి కూడా అర్హత లేదని ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి విమర్శించారు. ఆమె మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. వీరిద్దరూ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, మానసిక క్షోభకు గురి చేసి చివరకు ఆయన మరణానికి కారకులయ్యారని ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్ విగ్రహం విషయంలో వీరిద్దరూ వివాదానికి దిగడం చూస్తే.. వీరి రాజకీయ చదరంగంలో ఎన్టీఆర్ పేరును మళ్లీ ఒక పావులాగా వినియోగించుకుంటూ హైడ్రామాకు తెరలేపారని, ఇంతకంటే నీచ రాజకీయం మరొకటి ఉండదని విమర్శించారు. ఎన్టీఆర్ పదవిని చంద్రబాబు లాక్కున్నారని, పురందేశ్వరి తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఒత్తిడి చేసి ఒప్పించి వైస్రాయ్ హోటల్‌కు పంపారని, అలాంటివారిపుడు ఆయన విగ్రహం గురించి కలహించుకుంటున్నారని దుయ్యబట్టారు. కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకుంటున్నపుడు ఎన్టీఆర్ సతీమణిగా తాను ఉన్నాననే విషయాన్ని ఎలా విస్మరిస్తారని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
లక్షలాది మంది సాక్షిగా ఎన్టీఆర్ తనను పెళ్లాడారని, తాను ఆయన ధర్మపత్నినని, సాటి మహిళగా పురందేశ్వరి కూడా విగ్రహ ప్రతిష్ఠాపన వ్యవహారంలో తనను సంప్రదించలేదని విమర్శించారు. తన ప్రాపకంతో ఎంతో పైకి వచ్చిన అల్లుడు చంద్రబాబు కూడా తన సంతకం కోసం ప్రయత్నించలేదన్నారు. ఎన్టీఆర్ విగ్రహం వ్యహారంలో తన అభిప్రాయంగాని, సంతకం గాని తీసుకోనందుకు ఆవేదన వ్యక్తంచేస్తూ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశానని లక్ష్మీపార్వతి తెలిపారు.
ఇన్ని అడ్డంకుల తర్వాతైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టించిన ఘనత కోసం పాకులాడుతున్న చంద్రబాబు.. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయనకు భారతరత్న రాకుండా అడ్డుపడ్డారని ఆమె ఆరోపించారు. భారతరత్న కనుక ఎన్టీఆర్‌కు వస్తే ఆయన సతీమణిగా తాను దానిని స్వీకరించాల్సి వస్తుందని, అది ఇష్టంలేకనే బాబు అడ్డుపడ్డారని దుయ్యబట్టారు. ఐ.కె.గుజ్రాల్, దేవెగౌడ, వాజ్‌పేయిలను తానే ప్రధానులను చేశానని చెప్పుకున్న చంద్రబాబు.. అపుడే ఎన్టీర్‌కు భారతరత్న కోసం ఎందుకు కృషి చేయలేదని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. అప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు ఈ డిమాండ్ చేయడం రాజకీయ నాటకమేనని విమర్శించారు. |
No comments:
Post a Comment