బీసీల అభ్యున్నతి కోసం వైఎస్ అనేక పథకాలు చేపట్టారు వాటికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది ఆ పథకాలన్నింటినీ అమలు చేసే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్‌కే ఉంది జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం బీసీలకుంది అందుకే వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వస్తున్నాం: బీసీ నేతల మాట
హైదరాబాద్, న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా అమలు కావాలంటే.. ఆయన కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ఆయా వర్గాలకు చెందిన నాయకులు బలంగా నమ్ముతున్నారు. బీసీల అభ్యున్నతి కోసం వైఎస్ ప్రవేశపెట్టిన అనేక పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుండగా.. ఆ పథకాలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే హామీ ఇస్తోందని.. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం ఉన్నందునే పెద్ద ఎత్తున బలహీన వర్గాల నేతలు పార్టీలో చేరుతున్నారని వారు చెప్తున్నారు. మహానేత రాజశేఖరరెడ్డి రూపొందించిన ప్రతి పథకమూ బలహీనవర్గాలను దృష్టిలో ఉంచుకొనే ప్రవేశపెట్టారని పార్టీలో చేరుతున్న వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాల వల్ల రాష్ట్రంలో బీసీలే ఎక్కువగా లబ్ధిపొందారని వారు స్పష్టంచేస్తున్నారు. ఈ పథకాలనే కాకుండా.. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పథకాలను చిత్తశుద్ధితో అమలు చేసే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన నేతలు గట్టిగా చెప్తున్నారు. బీసీల అభ్యున్నతి విషయంలో ఇతర పార్టీలపై నమ్మకం లేనందునే.. ఇటీవలి కాలంలో బీసీ నేతలు పెద్దఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వలస వస్తున్నారని పేర్కొంటున్నారు.
వెల్లువెత్తుతున్న బీసీ నేతల మద్దతు: ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించగా, తాజాగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్‌లు చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిసి మద్దతు తెలపటం ఇందులో భాగమేనని అంటున్నారు. వీరే కాకుండా ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన సి.రమేష్‌బాబు, మూర్తినేని సోమేశ్వరరావు, ఆదిలాబాద్ నుంచి అప్పాల అనురాధ, తుల శ్రీనివాస్, ధర్మాజీ రాజేందర్, అప్పాల గణేష్ చక్రవర్తి, కరీంనగర్ నుంచి కె.స్టాలిన్‌గౌడ్, నల్లగొండ నుంచి రామచందర్‌గౌడ్, అనంతకుమార్‌గౌడ్, చిత్తూరు నుంచి రెడ్డమ్మ, రంగారెడ్డి నుంచి ఇ.సి.శేఖర్‌గౌడ్‌లు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
బీసీలకు గుర్తింపునిచ్చింది వైఎస్సే...
బీసీలకు సరైన గుర్తింపు ఇచ్చి గౌరవించిన ముఖ్యమంత్రులలో మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అగ్రస్థానంలో ఉంటారు. బడుగులకు ఆయన చేసిన మేలు మరెవరూ చేయలేదు. వైఎస్ అధికారం చేపట్టిన తర్వాత నామినేటెడ్ పోస్టుల నియామకంలో మొట్టమొదటగా ఒక బీసీ వ్యక్తినైన నన్ను మార్కెట్‌యార్డు చైర్మన్‌గా నియమించారు. దీన్నిబట్టే వైఎస్‌కు బీసీల పట్ల ఉన్న గౌరవమేంటో అర్థమవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మళ్లీ బీసీలు తలెత్తుకోగలుగుతారు. - తుల శ్రీనివాస్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, బోధ్, ఆదిలాబాద్ జిల్లా
మళ్లీ వైఎస్ సువర్ణయుగం కోసం...
వైఎస్ హయాంలో బీసీలకు లబ్ధి చేకూరినంతగా మరెప్పుడూ జరగలేదు. ఆయన ప్రవేశపెట్టిన ప్రతీ పథకం బడుగులను దృష్టిలో పెట్టుకొనే రూపొందించేవారు. అయితే మహానేత మరణానంతరం బీసీలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మళ్లీ వైఎస్ సువర్ణయుగం కోసం మేమంతా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నాం. శనివారం గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నా. - జి.సుదర్శన్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, విజయనగరం
వైఎస్ ఆశయ సాధన కోసం...
‘వరంగల్ మార్కెట్ యార్డు చరిత్రలో చైర్మన్‌గా మొదటి బీసీని నియమించింది వైఎస్సే. ఆయన చలువ వల్లే నేను చైర్మన్ కాగలిగాను. నాలాంటి వారికి రాజకీయంగా తోడ్పాటు అందించి నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ మహానేతదే. వైఎస్ మొదటి నుంచి బీసీల పట్ల ప్రేమ కనబరిచేవారు. బీసీల కోసం వైఎస్ తపనపడేవారు... ఆయన ఆశయ సాధన కోసం మేమంతా అండగా ఉంటాం. - రమేష్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, వరంగల్ |
No comments:
Post a Comment