జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క భారీ ప్రాజెక్టునూ సాధించుకోలేకపోయారని, ఆయన అవినీతిపై విచారణలు రాకుండా తప్పించుకునేందుకే అధికారాన్నంతా ఉపయోగించారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన సీజీసీ సభ్యుడు మూలింటి మారెప్పతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న బాబు... తానేదో నీతిమంతుడినని, తన పాలన అద్భుతమని గంటలు గంటలు డబ్బా వాయించుకుంటుకుంటున్నారని విమర్శించారు.
గుజ్రాల్, దేవెగౌడ, వాజ్‌పేయి ప్రభుత్వాలను నిలబెట్టిన చంద్రబాబు రాష్ట్రానికి బీహెచ్‌ఈఎల్ వంటి ఒక్క ప్రాజెక్టును ఎందుకు తీసుకు రాలేకపోయారని ప్రశ్నించారు. కేంద్రంలో టీడీపీకి మంత్రిపదవులు తీసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి తనపై కేసులు, విచారణలు రాకుండా బాబు తప్పించుకున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజకీయవేత్తగా చంద్రబాబును తెహల్కా డాట్‌కామ్ సంస్థ వెల్లడించిందని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు స్వీయ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని తప్పు పట్టారు. నిన్నటికి నిన్న చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అంశంపై కూడా టీడీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను గైర్హాజరయ్యేలా చేసి బాబు తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకున్నారని దుయ్యబట్టారు. బాబు ఎంతో కాలం ఇలా తప్పించుకోలేరని... ఆయన పాపం పండే రోజు వస్తుందని హెచ్చరించారు. లారీలో ఎన్ని నోట్లకట్టలు పడతాయి, ఎలా తీసుకెళ్లవచ్చు అని కథలు చెబుతున్న బాబుకు నోట్ల కట్టలు లారీల్లో పేర్చడంలో బాగా అనుభవం ఉన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. మాయావతి, ములాయంసింగ్‌లను సీబీఐ ఆయుధంగా కేంద్రం బెదిరిస్తోందనేది స్పష్టమవుతోందని... వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని కూడా అలాగే చేయాలని చూసినా ఆయన బెదరలేదని చెప్పారు.
sakshi
No comments:
Post a Comment