YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 14 December 2012

సీబీఐ అసలు రంగు బట్టబయలు!

Written by MK On 12/14/2012 7:06:00 PM

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=54267&Categoryid=28&subcatid=0
సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసి రిటయిరయిన మరో ఐయేయెస్ అధికారి యూఎస్ మిశ్రా కేంద్రీయ దర్యాప్తు సంస్థ -సీబీఐ-పై రాజకీయపరమయిన ఒత్తిళ్లు ఉండే మాట వాస్తవమేనని బహిరంగంగా ఒప్పుకున్నారు. గురువారంనాడు -డిసెంబర్ 13న- సీబీఐ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం గురించి ఓ టెలివిజ్షన్ చానెల్‌లో మాట్లాడుతూ మిశ్రా ఈ విషయం చెప్పారు. మాయావతి ఆస్తుల కేసు దర్యాప్తు సందర్భంగా రాజకీయపరమయిన ఒత్తిడి ఎదుర్కొన్నానని మిశ్రా స్పష్టం చేశారు. వాస్తవానికి సీబీఐపై రాజకీయపరమయిన ఒత్తిడి గురించి మొట్టమొదటిసారి ప్రస్తావించిన ఉన్నతాధికారి మిశ్రా కాదు. మరో రిటైర్డ్ సీబీఐ డెరైక్టర్ జోగీందర్ సింగ్ ఈ విషయాన్ని ఎన్నడో బహిరంగంగా వెల్లడించారు. అంతేకాదు- పాలకుల చేతుల్లో సీబీఐ సామూహిక సంహరణాస్త్రంగా తయారయిందని కూడా గురువారంనాడు అదే టెలివిజ్షన్ చానెల్‌లో మాట్లాడుతూ సింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. 1996-97 సంవత్సరాల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌పై నమోదయిన పశువుల దాణా కుంభకోణం కేసు విషయంలో తనపై ఆనాటి పాలకులు ఒత్తిడి తెచ్చారని జోగీందర్ సింగ్ వెల్లడించారు. 1977లో ఇందిరా గాంధీని అరెస్ట్ చేసిన సీబీఐ మాజీ జాయింట్ డెరైక్టర్ ఎన్.కే. సింగ్ కూడా సీబీఐ పనిలో అడుగడుగునా రాజకీయ జోక్యం ఎదురయ్యేదని చెప్పడం విశేషం.

చిత్రమేమిటంటే, కేంద్రం తరఫున నలుగురు మంత్రులు ఈ ఆరోపణలను శుక్రవారం నాడు ఖండించారు. ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాలు చూసే కేంద్రమంత్రి వి.నారాయణ స్వామి, న్యాయ శాఖామాత్యులు అశ్వినీ కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా, సమాచార ప్రసార శాఖల మంత్రి మనీష్ తివారీ సీబీఐ మాజీ డెరైక్టర్ల వ్యాఖ్యలను ఖండించారు. కేంద్రం ఒకేసారి ఇంతగా ఉలిక్కిపడి, బుజాలు తడుముకోవడం విడ్డూరంగానే ఉంది. పెపైచ్చు, యూఎస్ మిశ్రా ఆరోపణపై స్పందిస్తూ, ఆయన పదవిలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏలుబడి సాగించింది బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమే కనుక వారే ప్రతిస్పందిస్తే బాగుంటుందని కొందరు మంత్రులు పేర్కోవడం మరీ వింతగా ఉంది. ఈ నిందనుఎన్‌డీయే కూటమి నెత్తిన మోపితే తాము బయటపడిపోతామని కేంద్ర మంత్రులు భావించడమే చిత్రంగా ఉంది. ఇక్కడ చర్చ జరుగుతున్నది సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తి గురించి. ఏ కూటమికి చెందినవారయినా, కేంద్ర దర్యాప్తు సంస్థను స్వతంత్రంగా పనిచేసుకోనివ్వడం లేదన్నదే ఇక్కడ పాయింటు. మన మంత్రిపుంగవులకు ఈ విషయం తట్టినట్లు తోచదు.

ఏ మాటకయినా విలువగానీ, విశ్వసనీయతగానీ వచ్చేది ఆ మాట అన్న వ్యక్తి చరిత్రను బట్టి. అందుకే, ఈ వ్యాఖ్యలు చేసిన సీబీఐ మాజీ డెరైక్టర్లు ఎవరో వాళ్ల కథా కమామిషు ఏమిటో ఒక్కసారి చూద్దాం:

జోగీందర్ సింగ్ సీబీఐ డెరైక్టర్‌గా ఉన్నది కేవలం 11 మాసాలకాలమే. అది కూడా పదహారేళ్ల కిందటి మాట. బొఫోర్స్, సెయింట్ కిట్స్, హవాలా కుంభకోణం, జేఎంఎం లంచాల కేసు, లాలూప్రసాద్ పశువుల దాణా కుంభకోణం లాంటి అత్యంత ముఖ్యమయిన కేసుల దర్యాప్తులను ఆయన పర్యవేక్షించారు. ‘పాలకుల చేతిలో అత్యంత ప్రాణాంతకమయిన, అసహ్యకరమయిన ఆయుధం సీబీఐ’ అంటారు జోగీందర్ సింగ్. ‘ఈ విషయాన్ని రుజువు చెయ్యగల సాక్ష్యాధారాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నిటినీ తెచ్చి పార్లమెంట్ భవన్‌లో చేరిస్తే మొత్తం భవనమంతా ఆ పత్రాలతోనే నిండిపోతుం’దన్నారాయన. అయితే, ‘సీబీఐ దర్యాప్తులో రాజకీయుల జోక్యం నేరుగానూ, సూటిగానూ, లిఖితపూర్వకంగానూ ఉండదు. తరచు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. తద్వారా దర్యాప్తు కొనసాగకుండా అడ్డుతగుల్తూ ఉంటారు. అది కేసు బలహీనం కావడానికి దారితీస్తుంది. నా దృష్టిలో ఇది కూడా దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే!’ అన్నారు జోగీందర్ సింగ్. ‘ఉదాహరణకు లాలూ ప్రసాద్ కేసు విషయంలో ఓ నేత నాతో మాట్లాడుతూ విచారణను నిదానంగా సాగించమన్నారు. సదరు ఆదేశాన్ని లిఖిత పూర్వకంగా ఇస్తే అలాగే చేస్తానన్నాను నేను. అయితే, ఆయన అలా చెయ్యలేదనుకోండి’ అన్నారు జోగీందర్. మచ్చలేని జోగీందర్ వ్యక్తిత్వం కారణంగానే ఆయన్ను ఆ పదవికి ఎంపిక చేశారు. కానీ, కుర్చీలోకూర్చున్న క్షణం నుంచీ ఆయన్ను ఏదో రకంగా కళంకితుణ్ణి చెయ్యాలన్నదే మన పాలకుల పనయిపోయింది. ఆ బాధ భరించలేక, తనకు ఎదురవుతున్న అనాదరణను సహించలేక జోగీందర్ సింగ్ లాంటి నిజాయితీపరుడు చివరకు తప్పుకోవలసి వచ్చింది.

2003 డిసెంబర్‌లో యూఎస్ మిశ్రాను సీబీఐ డెరైక్టర్‌గా నియమించారు అప్పటి ప్రధాని ఏబీ వాజ్‌పేయీ. అయితే, అప్పట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అందుకు కారణం లేకపోలేదు. అంతకు కొద్దిగా ముందే, సీబీఐ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ ప్రముఖ నేతలందరి పేర్లనూ చార్జ్‌షీట్‌లోంచి తొలగించింది. సహజంగానే ప్రతిపక్షం ఆ చర్యను తీవ్రంగా విమర్శించింది. దాంతో అప్పటి సీబీఐ డెరైక్టర అల్లరిపాలయ్యారు కూడా. ఆయన చేసిన సూచన మేరకే వాజ్‌పేయీ యూఎస్ మిశ్రాను సీబీఐ డెరైక్టర్‌గా నియమించారు. అయితే, తన పనిలో నిత్యం పాలకుల జోక్యం ఎదురవుతూనే ఉండేదని అదే మిశ్రా -దాదాపు దశాబ్దం తర్వాత- వెల్లడించడం విశేషం. ముఖ్యంగా మాయావతి ఆస్తుల కేసులో ఈ జోక్యం తీవ్రస్థాయిలో ఉండేదని ఆయన వెల్లడించారు. పాలకులు ఏ పార్టీకి చెందినవారయినా, ప్రత్యర్థులను వేధించే పాపపు పనికి సీబీఐని వినియోగించేవారన్నదే ఇక్కడ ఆరోపణ. నిన్నగాక మొన్న ఎఫ్‌డీఐ బిల్లు ఓటింగ్ సందర్భంగా ఇదే మాయావతినీ, ఆమె ప్రధాన ప్రత్యర్థి పక్షమయిన ఎస్పీనీ కూడా యూపీయే ప్రభుత్వం సీబీఐ అస్త్రం ప్రయోగించే లొంగదీసుకో లేదా? యూపీయే ప్రభుత్వం ఇదే అస్త్రం ప్రయోగించి చంద్రబాబు నాయుడిని కూడా బెదిరించి, ఆయన పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసిందన్నది ఓ బహిరంగ రహస్యమే కదా!

అంతెందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఆరేడు నెలలుగా సాగుతున్న బాగోతం సీబీఐ నిజస్వరూపాన్ని వెల్లడించడం లేదా? 26 జీవోల కేసులో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్ట్ చెయ్యలేదా? రాజ్యాంగం ప్రసాదించిన హక్కును సైతం కాలదన్ని, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా సీబీఐ అడుగడుగునా అడ్డుతగలడం లేదా? ఒకే కేసులో అనేక చార్జ్‌షీట్లు దాఖలు చేసే అపూర్వ దురాచారానికి సీబీఐ తెగబడలేదా? ‘సాక్షి’ ఆర్థిక మూలాలపై దాడికి సైతం తెగబడలేదా? ఏ రాజకీయ జోక్యం లేకుండానేసీబీఐ ఇవన్నీ జరిపించిందా? అయినా ఉన్నమాటంటే ఉలుకెక్కువంటారు. జోగీందర్ సింగ్, యూఎస్ మిశ్రా, కేఎన్ సింగ్ తదితరులెందరో ఎన్నెన్నో విషయాలు వెల్లడించి సీబీఐ అసలు రంగు మరోసారి బట్టబయలు చేశారు. వందమంది ఉన్న సభలో ఒక్క వికర్ణుడు వాస్తవం పలికినట్లుగా ఈ నిజాయితీపరులు నిజం మాట్లాడుతున్నారు. అందుకు ఆక్రోశించి ప్రయోజనమేమిటి?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!