దేశ, రాష్ట్ర రైతుల, చిల్లర వర్తకుల ప్రయోజనాలను కాలరాయడంలో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త డ్రామాకు తెర తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన వ్యవహారం బట్టబయలు కావడంతో పాలుపోని నాయకులు రాజీనామాల డ్రామాకు తెర తీశారు. చిల్లర వర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్ కు గైర్హాజరైన ముగ్గురు ఎంపీలు సుజనా చౌదరీ, దేవేందర్ గౌడ్, గుండు సుధారాణిలపై తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వెల్లువెత్తిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాజీనామాల డ్రామాను నడిపించడానికి ప్రయత్నిస్తోందని పలు రాజకీయ పార్టీలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి.
రాజ్యసభలో ఎఫ్‌డిఐలపై ఓటింగ్ లో పాల్గొనకపోవడం తనది తప్పే అని నిన్న చంద్రబాబును కలిసి సుజనా చౌదరి వివరణ ఇచ్చుకున్నారు. అయినా సుజనా చౌదరితోపాటు మిగిలిన ఇద్దరు ఎంపీలను సస్పెండ్ చేయాలని సొంత పార్టీనుంచే కొందరు నేతలు డిమాండ్ చేశారు. పార్టీ ప్రతిష్టను మంటగలిపారని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా చంద్రబాబుకు తెలియకుండా జరిగి ఉంటే ఈ పాటికి వారిని సస్పెండ్ చేయాల్సి ఉంది. కానీ ఈ విషయంలో పట్టీ పట్టనట్టు వ్యవహరించడం పార్టీలోని నాయకులకే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో ఓటింగ్ కు గైర్హాజరైన నాయకులు ఊహించని విధంగా సొంత పార్టీలోని తోటి నేతల నుంచి వ్యతిరేకత రావడంతో సుజనా చౌదరి ఎంపి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్తితి ఏర్పడింది. దాంతో రాజీనామా సమర్పించి.. లేఖను చంద్రబాబుకు పంపారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని సుజనా చౌదరి వెల్లడించారు. సుజనా బాటలోనే మిగిలిన ఇద్దరు ఎంపిలు కూడా నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న రహస్య ఒప్పందంలో భాగంగానే టీడీపీ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదని వైఎస్ఆర్ సీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెరవెనుక రాజకీయాలు, పరస్పర సహకారాలు చేసుకునే దానికన్నా.. టీడీపీని పూర్తిగా కాంగ్రెస్‌లో విలీనం చేయడమే మంచిదని నల్లపురెడ్డి సూచించారు. సోనియా, చిదంబరం చెప్పుచేతల్లో నడుచుకుంటున్న బాబు ఆదేశాల మేరకే రాజ్యసభ ఓటింగ్ లో పాల్గొనకుండా ఉన్నారని... అందుకు మూల్యం త్వరలోనే చెల్లించుకుంటారని.. టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారని నల్లపురెడ్డి జోస్యం చెప్పారు.
ఇదిలా ఉండగా.. తెలుగు దేశం పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉందని.. అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌తో లాలూచీపడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆదేశాల మేరకే.. ముగ్గురు ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదని అన్నారు. ఎంపీల నిర్వాకంతో.. టీడీపీ ప్రతిష్ట పూర్తిగా అడుగంటిపోయిందని మేకపాటి ఆరోపించారు.
సుజనా చౌదరీ రాజీనామా పై చంద్రబాబు స్పందిస్తూ తప్పని తేలితే కఠిన చర్యలు తప్పవని డైలాగులు వల్లించారు. కాని తెలుగుదేశం పార్టీ నేతల నుంచి.. ఇతర పార్టీల నేతల నుంచి వస్తున్న ఆరోపణలకు పార్టీ అధినేత హోదాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. సుజనా చౌదరీ రాజీనామా బంతి ప్రస్తుతం చంద్రబాబు కోర్టులో ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి తాను ఆడుతున్న రాజీనామా డ్రామాలో ఎంపిలను బలి చేయడమా.. లేక తిరస్కరించి నాటకాన్ని ఒప్పుకోవడమా అనేది చంద్రబాబు తేల్చాల్సి ఉంది.
No comments:
Post a Comment