YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 13 December 2012

కాంగ్రెస్-టీడీపీ దొందూ దొందే!

నాటి చంద్రబాబు, నేటి కిరణ్ పాలన ఒక్కటే
రెండూ జనం రక్తం పీల్చే పాలనలే
రైతులు మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోయారు
వైఎస్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా 
జనం నెత్తిన ఒక్క రూపాయి భారం కూడా వేయలేదు
ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 56, కిలోమీటర్లు: 807.70

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘నాటి చంద్రబాబు పాలన.. నేటి కాంగ్రెస్ పాలన రెండూ వేరువేరు కాదు. జనం రక్తం తాగే రాబందుల రాజ్యాలే ఇవి. నాటి చంద్రబాబునాయుడి అడుగుజాడల్లోనే నేటి కిరణ్ సర్కారు కూడా నడుస్తోంది. ఆనాటి టీడీపీ పాలనకు, ఈ కాంగ్రెస్ పాలనకు తేడానే లేదు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాలక, ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలో మాదిరే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కష్టాల ఊబిలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం 56వ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో సాగింది. రావిరాలలో ‘రచ్చబండ’ నిర్వహించిన అనంతరం ఆదిభట్ల గ్రామంలో కిక్కిరిసిన జనసమూహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు.

వైఎస్ పాలనలో గ్యాస్ ధర 
ఒక్క రూపాయి కూడా పెరగలేదు..

చంద్రబాబు హయాంలో గ్యాస్ ధర రూ.145 నుంచి రూ.305కి పెరిగిందని, అదే వైఎస్ పాలనలో ఒక్క రూపాయి కూడా పెరగలేదని షర్మిల చెప్పారు. వైఎస్ జనం నుంచి దూరమయ్యాక ఇప్పటి ప్రభుత్వం రూ.305 నుంచి రూ.460కి గ్యాస్ ధర పెంచిందని దుయ్యబట్టారు. ఆరు సిలిండర్లు దాటితే ఒక్కో సిలిండర్‌కు రూ.1,000 చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ‘‘చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు కట్టలేక అల్లాడిపోయారు. వైఎస్ సీఎం కాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే బిల్లుపై తొలి సంతకం చేశారు. గృహావసరాల కరెంటు చార్జీలు పెంచబోమని మాటిచ్చారు. ఐదేళ్లపాటు ఆ మాటపైనే ఉన్నారు. వైఎస్ మనకు దూరమయ్యాక వచ్చిన నేతలు కరెంటు చార్జీలను ఇష్టానుసారం పెంచేస్తున్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రైతులందరూ అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవచ్ఛవాల్లా తయారయ్యారు. వైఎస్ అధికారంలోకి రాగానే రూ.12 వేల కోట్లు రుణమాఫీ చేసి, రైతన్నను అప్పుల ఊబి నుంచి బయట పడేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ మూడేళ్లలోనే రైతును మళ్లీ అప్పుల ఊబిలోకి తోసేసింది. ఏ రకంగా చూసుకున్నా నాటి చంద్రబాబు పాలనకు, నేటి కాంగ్రెస్ పాలనకూ ఇసుమంత కూడా తేడా లేదు. జనం నెత్తిన పన్నుల భారం మోపడంలోను, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేయడంలోనూ రెండూ రెండే..’’ అని విమర్శించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలు చేపట్టినా వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో ఒక్క పైసా కూడా ప్రజలపై భారం వేయలేదని చెప్పారు. వైఎస్ మన నుంచి దూరమయ్యాక ఆయన పథకాలకు ఒకవైపు తిలోదకాలు ఇస్తూ.. మరోవైపు జనం నెత్తిన అదనపు పన్నుల భారం మోపుతున్నారన్నారు.

చంద్రబాబూ.. మీకు పాదయాత్రలు ఎందుకు?

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదని షర్మిల అన్నారు. ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఓవైపు ప్రభుత్వాన్ని తిడుతూనే మరోవైపు ఆ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి పడగొట్టే శక్తి ఉన్నా ఆ పని చేయకుండా పాదయాత్రల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ బయట ఉంటే తమ ఆటలు సాగవనే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించారు. ‘‘పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవ్వరి తరమూ కాదో అలాగే జగనన్న త్వరలోనే వస్తాడు. రాజన్న రాజ్యం తెస్తాడు’’ అని చెప్పారు.


ప్రజా సమస్యల వెల్లువ..

రోజుకు నాలుగు గంటలే కరెంటు ఇస్తున్నారు.. బిల్లేమో నాలుగింతలు పెరిగిందంటూ ఓ మహిళ ఫిర్యాదు. పింఛన్ రావడం లేదంటూ ఓ అవ్వ ఆవేదన. స్కూలుకు వెళ్లేందుకు కూడా బస్సు లేదంటూ ఓ బాలిక బాధ! రావిరాలలో షర్మిల నిర్వహించిన రచ్చబండలో గ్రామస్తులు ఇలా తమ సమస్యలను చెప్పుకున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు తుక్కుగూడ నుంచి బయల్దేరిన షర్మిల 10.30 గంటలకు రావిరాల చేరుకుని రచ్చబండ నిర్వహించారు. జనం సమస్యలను ఓపిగ్గా విన్న షర్మిల.. ‘‘కొంతకాలం ఓపిక పట్టండి. రాజన్న కలలు నెరవేర్చేందుకు జగనన్న వస్తాడు..’’ అంటూ వారికి ధైర్యం చెప్పి ముందుకు సాగారు. గురువారం షర్మిల 16 కిలోమీటర్లు నడిచారు. రాత్రి 7 గంటల సమయంలో నాదర్‌గుల్ సమీపంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకున్నారు. పాదయాత్రలో పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధ్దన్, కె.కె.మహేందర్‌రెడ్డి రాజ్ ఠాకూర్, జనార్దన్‌రెడ్డి, అమృతసాగర్, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు దేప సురేఖ, హరివర్ధన్‌రెడ్డి, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!