పోటీ పడిన అభిమానం... పోటెత్తిన జనసందోహం. తమ గుండెల్లో కొలువైన మహానేత తనయకు... తాము అభిమానించే నేత జగనన్న సోదరి షర్మిలకు జిల్లా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ‘మరో ప్రజాప్రస్థానం’ యాత్రలో భాగంగా జిల్లాలోకి మంగళవారం జిల్లాలోకి అడుగిడిన షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామంలోకి ప్రవేశించగానే... జిల్లా నేతలు ఎదురేగి స్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయ, సంస్కృతికి అద్దంపట్టేలా బతుకమ్మ పాటలు, నృత్యాలతో గిరిజనులు ఘనంగా ఆహ్వానించారు. కోళ్లపడకల్. దుబ్బచర్ల, పెండ్యాల్ క్రాస్‌రోడ్స్ నుంచి మన్సాన్‌పల్లి వరకు సాగిన యాత్రకు జన నీరాజనాలు పట్టారు.
వడివడిగా ముందుకుసాగుతున్న షర్మిలను చూసేందుకు చెట్లు, చేమలు, డాబాలపైకి ఎక్కారు. అభిమానులు, పార్టీశ్రేణులు, ప్రజలతో పాదయాత్ర మార్గమంతా కిటకిటలాడింది. జిల్లాలోకి అడుగిడిన తర్వాత మన్సాన్‌పల్లిలో షర్మిల తొలిసారి ప్రసంగానికి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. వైఎస్‌కు జిల్లాపై ఉన్న ప్రేమ, ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చే స్తుంటే స్థానికుల చప్పట్లతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కడప, ఆనంతపూర్, కర్నూలు, మహబూబ్‌నగర్‌లో యాత్ర ముగించుకొని రంగారెడ్డి జిల్లాలోకి రాగానే తనకు అపూర్వ స్వాగతం పలికారని, ఆప్యాయంగా ఆహ్వానించారని షర్మిల అనగానే ప్రజల నుంచి హర్షధ్వనాలు వెలువడ్డాయి.
No comments:
Post a Comment