YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 13 December 2012

జగన్‌కు బెయిల్ హక్కుంది

హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి
చార్జిషీటు కూడా దాఖలు చేయలేదు
చార్జిషీట్ వెయ్యకపోతే జగన్ బెయిల్‌కు అర్హుడని హైకోర్టే చెప్పింది
ఆ తీర్పుపై సీబీఐ అప్పీల్ కూడా చేయలేదు.. అదే అంతిమం
167(2) కింద బెయిల్ కోరుతున్నాం
విచారణ సోమవారానికి వాయిదా

హైదరాబాద్, న్యూస్‌లైన్: బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించినంత మాత్రాన, బెయిల్ కోరే హక్కును పిటిషనర్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోల్పోయినట్టు కాదని సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి హైకోర్టుకు నివేదించారు. అరెస్టు చేసిన నాటి నుంచి చట్టం నిర్దేశించిన మేరకు 90 రోజుల్లోపు సీబీఐ అధికారులు దర్యాప్తు పూర్తి చేయడంలోనూ, చార్జిషీట్ దాఖలు చేయడంలోనూ విఫలమైతే సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ పొందే హక్కు జగన్‌కు ఉందని హైకోర్టే గతంలో తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. 

‘‘ఆ తీర్పుపై మేము గానీ, సీబీఐ గానీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేదు. కాబట్టి ఆ తీర్పే అంతిమం అవుతుంది. ఆ తీర్పుకు లోబడే మేమిప్పుడు 167(2) కింద బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాం. సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసే నాటికి, సీబీఐకి చార్జిషీట్ దాఖలు చేసేందుకు చట్టం నిర్దేశించిన 90 రోజుల గడువు పూర్తవలేదు. అందుకే జగన్‌కు సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద చట్టబద్ధమైన బెయిల్‌ను మంజూరు చేసే విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. 90 రోజుల గడువు పూర్తయినా చార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైంది. దీన్ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే చట్టబద్ధమైన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాం’’ అని ఆయన కోర్టుకు వివరించారు. 167(2) కింద బెయిల్ మంజూరు చేయాలన్న తన అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి గురువారం మరోసారి విచారించారు. జగన్ తరఫున పద్మనాభరెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ తరఫున పి.కేశవరావు హాజరయ్యారు.

జస్టిస్ చంద్రకుమార్ తీర్పే ఆధారం

ఎఫ్‌ఐఆర్‌లోని కొన్ని అంశాలపై సీబీఐ ఇప్పటిదాకా దర్యాప్తు పూర్తి చేయడం గానీ, తుది చార్జిషీట్ దాఖలు చేయడం గానీ చేయలేదని, ఈ విషయంలో చట్టం నిర్దేశించిన 90 రోజుల గడువు కూడా పూర్తయిందని పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, మీ అభ్యర్థనను ఏ ప్రాతిపదికన మన్నించాలని ప్రశ్నించారు. పద్మనాభరెడ్డి బదులిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన ఒక్కో అంశాన్ని ఒక్కో నేరంగా సీబీఐ పరిగణించడాన్ని ఇదే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సమర్థిస్తూ తీర్పునిచ్చారని గుర్తు చేశారు. ‘‘అంతేగాక ఒక అంశంలో చూపిన అరెస్టును మిగతా వాటన్నింటికీ వర్తింపజేయాలని కూడా తీర్పునిచ్చారు. దానిప్రకారం జగన్ ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన అంశాలన్నింట్లోనూ అరెస్టయినట్టే. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలన్నింటిపై సీబీఐ దర్యాప్తు పూర్తి చేయకపోయినా, చార్జిషీట్ దాఖలు చేయకపోయినా జగన్ బెయిల్ పొందేందుకు అర్హుడని జస్టిస్ చంద్రకుమార్ తీర్పు చెప్పారు. 

కాబట్టే, దానినే ప్రాతిపదికగా చేసుకుంటూ సెక్షన్ 167(2) కింద జగన్‌కు చట్టబద్ధమైన బెయిల్‌ను మంజూరు చేయండి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు జరగాల్సి ఉందని సీబీఐ అధికారులు చెప్పిన ఏడు అంశాలు కొత్తవేమీ కాదని, అన్నీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచినవేనని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ, జస్టిస్ చంద్రకుమార్ తీర్పుపై ఈప్పీల్ దాఖలు చేయలేదు గనుక దాని నుంచి మీరు ఎందుకు లబ్ధి పొందకూడదని ప్రశ్నించారు. తాము అదే పనిచేస్తున్నామని పద్మనాభరెడ్డి బదులిచ్చారు. 167(2) కింద తాము బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు జస్టిస్ చంద్రకుమార్ తీర్పే ఆధారమని వివరించారు. 

ఇదే విషయాన్ని కింది కోర్టుకు వివరించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఏడు అంశాలపై దర్యాప్తు పూర్తి చేసి ఒకే చార్జిషీట్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని తెలిపారు. సుప్రీంకోర్టు సాధారణ బెయిల్‌ను తిరస్కరించినా బెయిల్ కోరే హక్కును జగన్ కోల్పోరని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కును సాధించేందుకు న్యాయపోరాటం చేస్తుంటారని పేర్కొంటూ పద్మనాభరెడ్డి తన వాదనలను ముగించారు. సీబీఐ న్యాయవాది కేశవరావు తన వాదనలను వినిపించేందుకు సమయం కోరడంతో తదుపరి విచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. ఈ పిటిషన్‌తో పాటు సాధారణ బెయిల్ కోసం జగన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లోనూ కలిపి వాదనలు వినిపించేందుకు అనుమతినివ్వాలన్న కేశవరావు అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ కేసు పూర్తయ్యాక ఆ కేసును విచారిస్తానని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!