YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 13 December 2012

బాబుపైనా విచారణ జరపాలి

వాల్‌మార్ట్‌కు ఎంపీలను అమ్ముకున్న దొంగ చంద్రబాబు
ఎఫ్‌డీఐల విషయంలో బాబు నిస్సిగ్గుగా యూపీఏను గెలిపించారు
చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు ముగ్గురిపై జేపీసీతో కూడా విచారణ జరిపించాలి
స్వలాభం కోసం ప్రజల్ని పణంగా పెట్టే నీచ సంస్కృతి బాబుది
హెరిటేజ్ కోసం 4 లక్షల మంది చిల్లర వర్తకుల పొట్టకొడుతున్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వాల్‌మార్ట్‌కు సరుకులు మాదిరిగా టీడీపీ ఎంపీలు ముగ్గురిని హోల్‌సేల్‌గా, రిటైల్‌గా అమ్ముకున్న ఘరానా దొంగ చంద్రబాబు. భారత్‌లో ప్రవేశించేందుకు వాల్‌మార్ట్ జరిపిన లాబీయింగ్‌పై జరిగే న్యాయ విచారణలో చంద్రబాబును కూడా చేర్చాలి. రాజ్యసభలో ఓటింగ్‌కు గైర్హాజరైన ముగ్గురు టీడీపీ ఎంపీల పాత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో ప్రవేశించేందుకు రూ.125 కోట్లు ఖర్చు చేసినట్లు అమెరికా సెనేట్‌కు ఇచ్చిన నివేదికలో వాల్‌మార్ట్ తెలిపింది. రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లు నెగ్గేందుకు తెలుగుదేశం పార్టీ పరోక్షంగా ప్రభుత్వానికి సహరించింది. రాజ్యసభలో యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ లేదు. అయినా ఎఫ్‌డీఐల విషయంలో యూపీఏను గెలిపించేందుకు చంద్రబాబు నిస్సిగ్గుగా సహకరించారు. 

ఢిల్లీ వెళ్లి చీకట్లో ఒప్పందాలు కుదుర్చుకునే చంద్రబాబు వాల్‌మార్ట్ విషయంలో ఎంత వాటా తీసుకున్నారో బహిర్గతం చేయాలి. ఇలాంటి వ్యక్తులకే వాల్‌మార్ట్ డబ్బులు అందివుంటాయని పార్లమెంటులో ప్రతిపక్షాలు చెబుతున్నందున, చంద్రబాబు, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత కూడా విచారణ జరిపించాలి. అప్పుడే బడా బాబుల బాగోతం బయటపడుతుంది’’ అని చెప్పారు. సొంత లాభం కోసం ఎంతటి నీచానికైనా దిగజారే సంస్కృతి చంద్రబాబుదని జనక్‌ప్రసాద్ దుయ్యబట్టారు. ‘‘స్వలాభం కోసం పేరొందిన ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలను కుప్పకూల్చిన చరిత్ర చంద్రబాబుది. ఆఖరికి ప్రజలను పణంగా పెట్టేందుకు కూడా వెనుకాడరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో విజయవంతంగా నడుస్తున్న చిత్తూరు డెయిరీని పథకం ప్రకారం దెబ్బకొట్టి ఆయన సతీమణి పేరిట ప్రారంభించిన హెరిటేజ్ డెయిరీకి లబ్ధి చేకూర్చారు. చిత్తూరు డెయిరీని నామరూపాలు లేకుండా చేశారు. ఇలా అనేక ప్రభుత్వరంగ సంస్థలను దొంగ దెబ్బకొట్టి ఆయన బినామీలకు కట్టబెట్టారు. ఎఫ్‌డీఐల విషయంలో కూడా చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కోసం రాష్ట్రంలోని 4 లక్షల మంది చిల్లర వర్తకుల పొట్టకొట్టేందుకు వెనకాడలేదు’’ అని చెప్పారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే హెరిటేజ్‌లోకి విదేశీ పెట్టుబడులను తీసుకోబోమని బహిరంగ ప్రకటన చేయాలని జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!