YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 8 August 2012

11,800 ఎకరాలు ఎక్కువా?


వాన్‌పిక్‌కు కేటాయించిన 18 వేల ఎకరాల్లో నిజాంపట్నం పోర్టు, వాడరేవు పోర్టు, షిప్ యార్డు, ప్రకాశం ఎయిర్‌పోర్టులకు కేటాయించిన భూమి 6,200 ఎకరాలు. మిగిలిన 11,800 ఎకరాల భూమి పారిశ్రామిక కారిడార్‌కు. దీనర్థం రియల్ ఎస్టేట్ కోసమని కాదు. పరిశ్రమలు గనక యూనిట్లు ఏర్పాటు చేయటానికి ముందుకు వస్తే వాటి అవసరాల మేరకు వాటికి భూమిని కేటాయిస్తారు. అంటే పరిశ్రమల కోసమన్న మాట. మరి రెండు పోర్టులు, ఒక ఎయిర్‌పోర్టు, ఒక షిప్‌యార్డుకు 6,200 ఎకరాలు కేటాయించటమనేది అంత ఎక్కువగా చంద్రబాబు నాయుడికి ఎందుకు కనిపిస్తోందన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

ఎందుకంటే గంగవరం పోర్టుకు చంద్రబాబు స్వయంగా కేటాయించిన భూమి 2,800 ఎకరాలు. ప్రభుత్వం వద్ద తగినంత భూమి లేకపోతే వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నుంచి 1,400 ఎకరాలు తీసుకుని మరీ గంగవరం పోర్టుకు అప్పగించారు బాబు. కృష్ణపట్నం పోర్టుకు కూడా బాబు ఏకంగా 2,000 ఎకరాలు కేటాయించారు. అంతెందుకు! హైదరాబాద్‌లో విమానాశ్రయానికి ఏకంగా 5,500 ఎకరాలు కేటాయించారు. విశాఖలో ఫార్మాసిటీకి 2,143 ఎకరాలిచ్చేశారు.

ఇటీవలే మచిలీపట్నం పోర్టుకోసం కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏకంగా 5,324 ఎకరాలు కేటాయించింది. మరి ఇన్ని కేటాయింపులు చేసిన చంద్రబాబుకు గానీ, కిరణ్ సర్కారుకు గానీ రెండు పోర్టులు, షిప్‌యార్డు, ఎయిర్‌పోర్టుకు కలిసి 6,800 ఎకరాలు కేటాయించటం ఎందుకు నేరంగా కనిపిస్తోందన్న ప్రశ్నకు... అది వైఎస్ హయాంలో జరిగింది కాబట్టేనన్నది తప్ప మరో జవాబు కనిపించదు.

నిజానికి దేశంలో ఏ మల్టీ ప్రొడక్ట్ సెజ్‌ను చూసినా 10 వేల ఎకరాలు కేటాయించటం సర్వసాధారణమన్నది చెప్పకనే తెలుస్తుంది. ఉదాహరణకు గుజరాత్‌లో అదానీ సంస్థ చేపట్టిన ముంద్రా పోర్టు, సెజ్‌లకు అక్కడి ప్రభుత్వం కేటాయించింది కూడా 32,353 ఎకరాలు. అసలు మన రాష్ట్రంలో జీఎంఆర్ సంస్థకు హైదరాబాద్ విమానాశ్రయం కోసం చంద్రబాబు కేటాయించింది 5,500 ఎకరాలు.

అసలు అంతర్జాతీయంగా చూసినా పేరొందిన విమానాశ్రయాలేవీ ఇంత స్థలంలో లేవు. ప్రపంచ ప్రఖ్యాత హాంకాంగ్ విమానాశ్రయం నిర్మించింది 3,300 ఎకరాల్లో. బాబు తరచూ చెప్పే సింగపూర్ విమానాశ్రయం నిర్మితమయింది 3,212 ఎకరాల్లో. మలేసియా విమానాశ్రయం నిర్మించింది 2,300 ఎకరాల్లో. అంతెందుకు! హైదరాబాద్ కన్నా ఎక్కువ బిజీగా ఉండే చెన్నై విమానాశ్రయం నెలకొన్నది కేవలం 1,800 ఎకరాల్లో. మరి ఎక్కడా లేని విధంగా జీఎంఆర్‌కు 5,500 ఎకరాలు కేటాయించిన బాబు... వాన్‌పిక్‌లో పోర్టు ఆధారిత సెజ్‌కు (పారిశ్రామిక కారిడార్) 11,200 ఎకరాలు కేటాయించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని తప్పుబట్టడం చోద్యం కాదా?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!