హైదరాబాద్, న్యూస్‌లైన్: వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థులకు పెరిగిన ఫీజులను చెల్లించకూడదని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వ కుట్ర బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
రెండేళ్లుగా ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ బూటకమేనని చెప్పారు. అన్ని వర్గాల్లోని పేదలు ఉన్నత చదువులు చదువుకొని అత్యున్నత స్థానంలో నిలవాలన్న ఆకాంక్షతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని.., ఆయన మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు.
రూ.1.20 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌లో విద్యార్థుల ఫీజుల కోసం రూ.5 వేల కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారని, ఆ పథకాలు కాంగ్రెస్‌వేనని పిడివాదం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై నీలినీడలు కమ్మినప్పటి నుంచి తమ పార్టీ వైఎస్ ఆశయ స్ఫూర్తితో, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పోరాటం చేస్తూనే ఉందని చెప్పారు. పేదలకు ద్రోహం తలపెట్టాలని ప్రభుత్వం భావిస్తే సహించబోమని జూపూడి హెచ్చరించారు.
No comments:
Post a Comment