YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 6 August 2012

అసెంబ్లీ నిర్వహణలో రూ.కోట్ల అక్రమాలు!

బిల్లులు లేకున్నా రూ.కోట్ల నిధులు చెల్లింపు
అసెంబ్లీ నిధుల వ్యయంపై స్పీకర్‌కు ఏజీ ప్రాథమిక నివేదిక

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఎక్కడ ఏ అక్రమాలు జరిగినా శాసనసభలో చర్చించడం తెలుసు మనకు... మరి ఆ శాసనసభ నిర్వహణలోనే అక్రమాలు జరిగితే... ఒకటికాదు రెండుకాదు.. దాదాపు నాలుగైదు కోట్ల రూపాయలమేర అక్రమాలు జరిగాయని తేల్చారు అకౌంటెంట్ జనరల్ అధికారులు. బిల్లులు లేకున్నా పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి రూ.కోట్లు స్వాహా చేశారని గుర్తించారు. శాసనసభ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల వినియోగంలో అక్రమాలు జరుగుతున్నట్లు, పనులు చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నట్లు, తప్పుడు పత్రాలతో నిధులు స్వాహాచేస్తున్నట్లు గత ఏడాదిలో స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. దానిపై ప్రాథమిక పరిశీలన చేయించిన స్పీకర్ మనోహర్ నిధుల వినియోగం అక్రమాలపై అనుమానాలు కలగడంతో ఏజీ అధికారులతో పరిశీలనకు ఆదేశించారు. నలుగురు ఏజీ అధికారుల బృందం అసెంబ్లీలో వివిధ పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించింది. 

ఇటీవలే స్పీకర్‌కు నివేదిక సమర్పించింది. వివిధ పనుల పేరిట నిధుల చెల్లింపులు రికార్డుల్లో చూపుతున్నా... అందుకు సంబంధించిన బిల్లులు మాత్రం లేకపోవడాన్ని ఏజీ అధికారులు గుర్తించారు. ఇవే కాకుండా ఒకే పనికి సంబంధించిన బిల్లుల పత్రాలను కిందా మీదా మార్చి రెండుసార్లు బిల్లులు తీసుకున్న వైనాన్ని గుర్తించారు. ఇలా లక్షలాది రూపాయలు స్వాహా అయినట్లు గమనించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ఎక్కువ సమయం సభ జరిగేటప్పుడు స్పీకర్ లంచ్ ఏర్పాటుచేస్తుంటారు. ఇలా ఎమ్మెల్యేలు, మీడియా సిబ్బందికి భోజనాల పేరిట బిల్లులను భారీగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఒకరోజు లంచ్ పెడితే రెండు మూడురోజులుగా చూపించి బిల్లులు తీసుకున్నట్లు తేలింది. ఈ సమావేశాలకు సిబ్బంది అవసరం ఎక్కువ ఉండడంతో ‘లంప్’పేరిట తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటారు. ఈ సిబ్బంది సంఖ్యను ఎక్కువ చూపడం ద్వారా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారని తెలుస్తోంది. 

మాజీ ఎమ్మెల్యేల పెన్షన్లకూ టోకరా

కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, లేదా మరణించిన మాజీల కుటుంబ సభ్యులు వారి పెన్షన్ నిధులను వేర్వేరు కారణాలవల్ల తీసుకోవడం లేదు. అక్రమార్కులకు అదీ వరంగా మారింది. కొద్ది సంవత్సరాలుగా పెన్షన్ డబ్బు తీసుకోని వారి వివరాలు తీసుకొని మాజీల పేరిట, వారి కుటుంబ సభ్యుల పేరిట అసెంబ్లీకి ఫోర్జరీ సంతకాలతో దరఖాస్తు చేయించి, ఆపై అకౌంట్లు తెరిచి నిధులు కొల్లగొట్టినట్లు పరిశీలనలో తేలినట్లు సమాచారం. ఆ సభ్యుల పేరిట చెక్కులను రూపొందించే సిబ్బందిని తమ చెప్పుచేతల్లో పెట్టుకొని వాటిని బ్యాంకు అకౌంట్లలో జమచేయించి లక్షల మేర నిధులు స్వాహా చేశారు. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ డబ్బు తీసుకున్నట్లు తేలుతోంది. అసెంబ్లీ ద్వారా చేపడుతున్న పనుల్లో వినియోగించే వివిధ పరికరాలు, ఇతర సామాగ్రిని సైతం మార్కెట్ ధరలకు వందల రెట్లు పెంచి బిల్లులు తీసుకున్నట్లు పరిశీలనలో తేలినట్లు సమాచారం. కాగా దీనిపై అధికారవర్గాలను సంప్రదించగా... ఏజీ పరిశీలన, ప్రాథమిక నివేదిక సమర్పణ గురించి తమకు తెలియదని, ఏ నివేదిక అయినా వారు నేరుగా స్పీకర్‌కే సమర్పిస్తారని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!