పెరగనున్న ఫీజులను తాము చెల్లించబోమని ప్రకటించిన ప్రభుత్వం
బీసీ, ఈబీసీ, వికలాంగ, మైనార్టీ విద్యార్థులకు పాత ఫీజులే చెల్లింపు
ఇంజనీరింగ్‌కే ఒక్కొక్కరిపై రూ.20 వేల నుంచి 80 వేల దాకా భారం!
అలా 6లక్షల మందిపై ఏటా పడే భారం దాదాపు రూ. 350 కోట్లు
బ్యాంకు రుణం తీసుకుని కట్టుకోండంటూ సర్కారు సలహా
దానిపై వడ్డీ రాయితీ, సబ్సిడీ ఇస్తామంటూ ఏమార్చే యత్నం
వైఎస్ పథకానికి తెలివిగా తూట్లు పొడిచిందంటున్న నిపుణులు
రీయింబర్స్‌మెంట్ పదాన్ని కూడా పథకం నుంచి తొలగించే యోచన
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భారం భరిస్తామంటూ ముక్తాయింపు
కానీ వీరి ఫీజుల భారాన్ని ప్రధానంగా భరించేది కేంద్రమే
అడ్మిషన్ తీసుకున్నాకే స్కాలర్‌షిప్ కోరేలా కొత్త నిబంధనలు!
హైదరాబాద్, న్యూస్‌లైన్: అనుకున్నదే అయింది. ఫీజుల భారాన్ని తమపై ఎక్కడ మోపుతారోనన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనే చివరికి నిజమయింది. వృత్తి విద్యా కోర్సులకు పెరిగిన ఫీజులను తాము చెల్లించే ప్రసక్తే లేదంటూ ప్రభుత్వం అధికారికంగా చేతులెత్తేసింది. పెరిగే ఫీజులను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ వర్గాల విద్యార్థులకు చెల్లించకూడదని సోమవారం సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా దాదాపు 6 లక్షల మంది పేద విద్యార్థులపై ఏటా రూ.350 కోట్ల భారం పడనుంది. సర్కారు తాజా నిర్ణయంతో.. అర్హుడైన ఏ విద్యార్థీ డబ్బు లేమి కారణంగా ఉన్నత విద్యకు దూరం కారాదన్న ఉదాత్త ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఒకవిధంగా ఎత్తేసినట్టే అయింది. ఎందుకంటే కోర్సు ఫీజు మొత్తాన్నీ విద్యార్థికి తిరిగి చెల్లించడమే రీయింబర్స్‌మెంట్ ప్రధాన లక్ష్యం. తాజా నిర్ణయంతో దానికి పూర్తిగా తూట్లు పొడిచినట్టయింది. కనీసం వికలాంగ విద్యార్థులపై కూడా ప్రభుత్వం కనికరం చూపలేదు. ఏకీకృత విధానం
ప్రకారం ఇకపై ఇంజనీరింగ్ కోర్సుకు ఫీజు కనీసం రూ.50,200 నుంచి లక్ష దాకా పెరగవచ్చు. కానీ బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చేది మాత్రం ఎప్పట్లా కేవలం రూ.31,000 మాత్రమే. అంటే అదనంగా కట్టాల్సిన రూ.20 వేల నుంచి 80 వేల దాకా ఇకపై విద్యార్థులు భరించుకోవాల్సిందే! ఆ మొత్తాలను బ్యాంకుల నుంచి రుణంగా తెచ్చుకోండంటూ వారికి సర్కారు ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఆ రుణాలపై వడ్డీ రాయితీ, కొంతమేర సబ్సిడీ ఇప్పిస్తామంటూ ఔదార్యం కూడా ప్రదర్శించింది. వృత్తి విద్యా కోర్సులకు బ్యాంకు రుణం దొరకడం ఎంత కష్టమో తెలిసి కూడా, కేవలం విద్యార్థులను ఏమార్చేందుకే ప్రభుత్వం ఇలా కంటితుడుపు మాటలు చెబుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. మున్ముందు ఇంటర్, డిగ్రీ తదితర ఏ కోర్సు ఫీజు పెరిగినా అదనపు భారాన్ని ఇదే మాదిరిగా విద్యార్థుల నెత్తినే మోపే అవకాశముంది. ఏతావాతా వేలకు వేల ఫీజులను చెల్లించలేక లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పాత పరిస్థితే పునరావృతమయ్యేలా కన్పిస్తోంది.
నిబంధనలూ మార్చే యోచన
వృత్తి విద్యా కాలేజీల్లో ఏకీకృత ఫీజును అమలు చేయాలని, వాటిలోని సౌకర్యాలను బట్టి ఫీజులను పెంచాలని కోర్టు తీర్పులు రావడం, 133 కళాశాలల్లో ఈ ఏడాది నుంచి ఫీజులను 150 శాతం దాకా పెంచాలని ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సు చేయడం, ఈ నేపథ్యంలో ఫీజుల పథకంపై పడే భారం తదితరాలను తేల్చేందుకు ప్రభుత్వం 9 మంది నిపుణులతో కమిటీ వేయడం తెలిసిందే. కమిటీ తమకు సమర్పించిన నివేదికపై మంత్రివర్గ ఉపసంఘం సోమవారం చర్చించింది. ఈ సందర్భంగా పలు అంశాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు మినహా మిగతా విద్యార్థులందరికీ ఫీజుల చెల్లింపుపై శ్లాబ్ విధించాలనే ప్రతిపాదనను ఉప సంఘం ఆమోదించింది. అంతేగాక రీయింబర్స్‌మెంట్ అనే పదాన్ని కూడా ఫీజుల పథకం నుంచి తొలగించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ పదం వల్ల విద్యార్థి కాలేజీలో అడ్మిషన్ తీసుకునేప్పుడే ఫీజును మినహాయించాల్సి వస్తోందని మంత్రులకు అధికారులు వివరించారు. అలాకాకుండా ముందు విద్యార్థి అడ్మిషన్ తీసుకుని, ఆ తర్వాత స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునేలా నిబంధనలు మార్చాలన్న ప్రతిపాదనను ఎంసెట్ నోటిఫికేషన్‌లో పొందుపరిచే అవకాశాలున్నాయి.
ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటూ గొప్పలు
ఫీజుల పథకం కింద ప్రస్తుతం దాదాపు 26 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఏటా ఇందుకుద్దేశించిన రూ.3,500 కోట్లలో రూ.2,100 కోట్లను వృత్తి విద్యా కోర్సులకే చెల్లిస్తున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న 8 లక్షల మంది లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీలు పోను.. బీసీ, ఈబీసీ వర్గాల విద్యార్థులు 6 లక్షల మంది దాకా ఉంటారని అంచనా. వారికి పెరిగిన ఫీజు చెల్లించడం తనవల్ల కాదంటూ చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీల విద్యార్థులకు మాత్రం ఆ భారాన్ని భరిస్తామంటూ గొప్పలు పోయింది. కానీ నిజానికి ఇందులో సర్కారు గొప్పదనమేమీ లేదు. ఎస్సీ, ఎస్టీల ఫీజులు, స్కాలర్‌షిప్‌లో సింహభాగాన్ని కేంద్రమే భరిస్తుంది. ఇందుకు ఏటా రూ.600 కోట్ల దాకా నిధులిస్తుంది. మిగతా కొసరును మాత్రమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధపడిందన్నమాట! పైగా ఫీజుల పెంపు సాకుతో ఇందుకోసం కేంద్రం నుంచి మరినిన నిధులు రాబట్టవచ్చని సంక్షేమ శాఖల వర్గాలే చెబుతున్నాయి! విదేశాల్లో ఉన్నత చదువులకు, ఐటీలో పోస్టుగ్రాడ్యుయేషన్‌కు రుణాలిచ్చేందుకు బ్యాంకులు అనేక షరతులు విధిస్తుంటాయి. లక్షల రూపాయల విలువైన బ్యాంకు ష్యూరిటీలు పెట్టుకుంటాయి. అంతెందుకు...? మన దగ్గర రైతులకు రుణాలిచ్చేందుకు కూడా సవాలక్ష నిబంధనలున్నాయి. అలాంటప్పుడు ఎలాంటి షరతులూ లేకుండా ఇంజనీరింగ్ వంటి కోర్సులు చదివేందుకు ఏ బ్యాంకులు రుణాలిస్తాయో ప్రభుత్వానికే తెలియాలి!
పీజీ కోర్సులకూ అప్పు చేయాల్సిందే!
వృత్తి విద్యా కోర్సులతో పాటు అన్ని పీజీ కోర్సుల ఫీజులనూ విద్యార్థులే అప్పులు చేసి చెల్లించుకోవాలంటే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనపై కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు. డిగ్రీ స్థాయి దాకా మాత్రమే ఫీజును రీయింబర్స్ చేయాలని, ఆ తర్వాత ఇలా రుణాలకు లింకు పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. నాలుగు విభాగాల్లో ఇస్తున్న స్కాలర్‌షిప్‌లను కూడా అందరికీ లభించేలా సంతృప్త స్థాయి(శాచ్యురేషన్) పద్ధతిన కాకుండా, ‘మెరిట్ కమ్ మీన్స్’ విధానంలో అమలు చేయాలని నిర్ణయించారు. అంటే ఉత్తమ కాలేజీలు, చదువుపై సీరియస్‌గా ఉండే, మంచి మార్కులు సాధించిన విద్యార్థుల వంటి వీలైనన్ని కేటగిరీలతో వారిని స్కాలర్‌షిప్‌ల నుంచి కూడా దూరం చేసే ఎత్తుగడకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై నిర్ణయాన్ని మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేశారు.
No comments:
Post a Comment