YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 8 August 2012

తీవ్ర ప్రజా వ్యతిరేకత దృష్ట్యా రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు ఉత్తర్వు అమలుపై ప్రభుత్వం వెనకడుగు

- {పజలపై భారం తగ్గించాల్సిందే
- సీఎంకు మంత్రి తోట విజ్ఞప్తి
- {పజా వ్యతిరేకతతోనే వెనకడుగు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తీవ్ర ప్రజా వ్యతిరేకత దృష్ట్యా రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు ఉత్తర్వు అమలుపై ప్రభుత్వం వెనకడుగువేసింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా పెంచుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ గత నెల 25న జారీ చేసిన జీవో-476ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, మీడియా నుంచే కాకుండా సబ్‌రిజిస్ట్రార్ల అసోసియేషన్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీవో-476 అమలుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వివిధ వర్గాల ప్రజలనుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని అన్ని రకాల రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాల్సిన అవసరం ఉందంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం స్వయంగా ముఖ్యమంత్రికి సిఫార్సు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

‘భారీగా పెంచిన అన్ని రకాల రిజిస్ట్రేషన్ ఫీజులపై పునస్సమీక్షించి ప్రజలకు భారంకానిరీతిలో తగ్గించాల్సి ఉంది. అప్పటివరకూ జీవో-476ను తాత్కాలికంగా నిలిపివేయాలి (అబయెన్స్‌లో పెట్టాలి)’ అని మంత్రి సిఫార్సు చేశారు. పెంచిన రిజిస్ట్రేషన్ ఫీజుల తగ్గింపుపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ అమలును నిలిపివేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి దినేష్‌కుమార్ తాజాగా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

రెండోసారి అబయెన్స్..
జీవో-476ను అబయెన్స్‌లో పెట్టడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వాస్తవంగా సంబంధిత మంత్రి తోట నరసింహం అంగీకారం లేకుండానే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), దస్తావేజు నకళ్లు జారీ, వివాహ రిజిస్ట్రేషన్, సేల్‌డీడ్, గిఫ్ట్ డీడ్ తదితర అన్ని రిజిస్ట్రేషన్ ఫీజులను 40 నుంచి 50 రెట్ల వరకూ పెంచుతూ అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.సాహు గత నెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మంత్రి ఆదేశాలమేరకు ఆగస్టు పదో తేదీ వరకూ జీవో అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు గతనెల 30న ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికీ దీనిపై నిర్ణయం తీసుకోనందున మళ్లీ ఈ జీవోను అబయెన్స్‌లో పెట్టాలని మంత్రి ప్రస్తుతం ముఖ్య కార్యదర్శి దినేష్‌కుమార్‌కు సిఫార్సు చేశారు. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ జీవో అమలును నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 

జీవోను రద్దు చేయాలి..
జీవో-476ను రద్దుచేసి ప్రజలకు భారంకాని రీతిలో రిజిస్ట్రేషన్ ఫీజులను నిర్ధారించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి దినేష్‌కుమార్‌కు సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దినేష్‌కుమార్‌ను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వాస్తవ పరిస్థితులను వివరించారు. వారి సూచనలపై ఆయన సానుకూలంగా స్పందించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!