YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 11 August 2012

ఫీజులపై తేల్చకుండా ప్రభుత్వం మొద్దునిద్ర

* రెండు లక్షల మంది విద్యార్థుల్లో ఆందోళన
* కౌన్సెలింగ్‌పై సర్కారు బాధ్యతా రాహిత్యం
* విద్యార్థులు రోడ్లెక్కుతున్నా స్పందన కరువు 
* కమిటీలు, సమావేశాలు అంటూ తాత్సారం
* కాలేజీలతో చర్చలకూ చొరవ చూపలేని దైన్యం 
* పసలేని బెదిరింపులకు దిగే యత్నం 
* తనిఖీలకు టాస్క్‌ఫోర్స్ కమిటీలంటూ లీకులు 
* రాత్రికి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
* ఏకాభిప్రాయం కోసం కాలేజీ సంఘాల యత్నం 
* నేడు ఉప ముఖ్యమంత్రితో యాజమాన్యాల చర్చలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచిపోయినా.. ఇంతవరకూ కౌన్సెలింగ్ షెడ్యూలు కూడా విడుదల చేయకుండా మొద్దునిద్ర పోతోంది. వివాదాస్పదమైన ఫీజుల విషయం ఎటూ తేల్చకుండా ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లోనే కాదు.. రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ వరంగల్ నిట్‌లోనూ తరగతులు మొదలైనప్పటికీ.. రాష్ట్ర విద్యార్థుల విషయం తనకేమీ పట్టనట్టు ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తోంది. వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగుతోంటే.. వారిపైకి పోలీసులను ఉసిగొల్పుతున్నారు తప్పించి.. సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వ పెద్దలెవరూ చొరవచూపటం లేదు. 

పరిస్థితి చూస్తోంటే.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వమన్నదే లేనట్టుగా తయారయింది. కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందో అడ్మిషన్లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియక మానసిక క్షోభకు గురవుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కౌన్సెలింగ్ షెడ్యూలు తేల్చాలంటూ శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లిన విద్యార్థి సంఘాల నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపించిన ప్రభుత్వం.. ఇదే విషయమై 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆందోళనగా ఎదురుచూస్తుంటే కనీసం ఒక ప్రకటన కూడా వెలువరించలేని దుస్థితిలో ఉంది. ఫీజుల వివాదంపై కనీసం కళాశాలలతో చర్చలు జరిపేందుకు కూడా ప్రభుత్వం ఇష్టపడలేదు. 

శనివారం జరిగిన ఏకైక పరిణామం ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశమవటం మాత్రమే. ఆయన భేటీ అనంతరం కళాశాలల తనిఖీలకు టాస్క్‌ఫోర్స్ కమిటీ అంటూ ఓ అనధికారిక ప్రకటన లీకులా వెలువడటం తప్ప పురోగతి శూన్యం. వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తింటుండం, రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తుండటం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మసోమవారం నుంచి ఫీజు దీక్ష నిర్వహిస్తుండటం వంటి పరిణామాలేవీ తనకు పట్టనట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 

టాస్క్‌ఫోర్స్ అంటూ సర్కారు లీకులు... 
ఫీజుల వ్యవహారంపై శుక్రవారం రాత్రి సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వచ్చి.. శనివారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమవుతుందని చెప్పారు. కానీ శనివారం ఉపసంఘం సమావేశమేదీ జరగలేదు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రితో సమావేశమై వచ్చిన కాసేపటికి అనధికార సమాచారం పత్రికలకు విడుదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అంటూ ప్రభుత్వమే అనధికార లీకులు ఇచ్చింది. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం వృత్తివిద్యా కళాశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయా? లేదా? తెలుసుకునేందుకు జిల్లా, ప్రాంతీయ స్థాయి తనిఖీ బృందాలు ఏర్పాటవుతాయని, వీటిని రాష్ట్రస్థాయిలో పర్యవేక్షించటానికి, మార్గదర్శనం చేయటానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటవుతోందని ఆ ప్రకటనలో వెల్లడించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.సిన్హా, సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్ షరాఫ్, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సత్తిరెడ్డి ఈ కమిటీలో ఉంటారని ఆ అనధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. రాత్రికి ఉత్తర్వులు జారీ చేశారు.

ముందుచూపు ఆనాడేదీ?
హైకోర్టు తీర్పు ప్రకారం కళాశాలల నుంచి ఫీజుల ప్రతిపాదనలు స్వీకరించి.. సమాచారం సరిపోనిపక్షంలో మళ్లీ స్వీకరించి ఫీజులు నిర్ధారించాల్సిన ప్రభుత్వం ఆ ప్రక్రియను ఎప్పుడో పక్కనపెట్టింది. ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ అంటూ కాలేజీలపై పసలేని బెదిరింపులకు దిగుతోంది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటే అసలే ప్రతిపాదనలు సమర్పించని కళాశాలలను కౌన్సెలింగ్ నుంచి పక్కనపెట్టే అవకాశం ఉండేది. కానీ ప్రతిపాదనలను పిలుస్తూ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి అక్కడ చుక్కెదురైంది. ఈలోపు పుణ్యకాలం గడిచిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ అంటూ బెదిరింపులకు దిగుతోందే తప్ప.. ప్రభుత్వానికి విద్యార్థులపై ఉన్న ప్రేమతోనో, కాలేజీల ప్రమాణాలపై ఉన్న చిత్తశుద్ధితోనో కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లటంలో ఆలస్యం చేస్తోందని.. కామన్ ఫీజుపై సరైన వాదనలు వినిపించటంలేదని విద్యారంగ నిపుణులు మొత్తుకున్నా ఆ దిశగా ఆలోచించని ప్రభుత్వం.. ఇప్పుడు కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకటించకుండా విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తోంది.

నోరు మెదపని సర్కారు... 
ఫీజుల నిర్ధారణపై కానీ, రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై కానీ, కౌన్సెలింగ్ షెడ్యూలుపై కానీ ప్రభుత్వం నుంచి సమాచారం ఇచ్చేందుకు శనివారం ఏ ఒక్క ప్రతినిధీ ముందుకు రాలేదు. టాస్క్‌ఫోర్స్ కమిటీ అంటూ అనధికారిక ప్రకటన ఇచ్చిన ప్రభుత్వం.. ఫీజులపై మౌనం వీడలేదు. కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు కొందరు శనివారం అటు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను, ఇటు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణను కలిసేందుకు ప్రయత్నించగా.. వారు చర్చలకు సిద్ధపడలేదని సమాచారం. ఆదివారం ఏకాభిప్రాయంతో రావాలని వారు కాలేజీల యాజమాన్యాలకు సూచించినట్టు తెలిసింది. దీంతో కళాశాలలే ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నాయి. 

కన్సార్షియం ఆఫ్ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజెస్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్స్ సెక్రటరీ జనరల్ కె.వి.కె.రావు, మరో ప్రతినిధి గౌతంరావు.. కళాశాలలతో శనివారం రాత్రి మాట్లాడినట్టు సమాచారం. ఆర్డినెన్స్ రద్దు చేయాలని, ఫీజు రూ.36 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉండాలని, బీ కేటగిరీ ఫీజు పాత ఫీజే ఉండాలని ప్రభుత్వం ముందు డిమాండ్లుగా పెట్టాలని చెప్తూనే దాదాపు కళాశాలలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజులు ప్రతిపాదించిన 133 కళాశాలల గ్రూపులో దాదాపు 20 కళాశాలలు మాత్రం ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తున్నాయని సమాచారం. 

నేడు దామోదర వద్ద చర్చలు...
కనీసం కామన్ ఫీజుకు ఏదో ఒక ప్రాతిపదికను కూడా తేల్చలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండటంతో కళాశాలలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని కళాశాలలు సామరస్య పూర్వక నిర్ణయానికి వస్తే తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేని దుస్థితి. అందువల్ల ఏకాభిప్రాయ సాధనను కళాశాలలకే వదిలేసిన ప్రభుత్వం ఆదివారం ఉదయం 11 గంటలకు మినిస్టర్ క్వార్టర్స్‌లోని దామోదర రాజనర్సింహ క్యాంపు కార్యాలయంలో కళాశాలలతో చర్చలు జరపనుంది. ఈ సమావేశానికి మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులైన బొత్స సత్యనారాయణ, కొండ్రు మురళి, పితాని సత్యనారాయణ హాజరుకానున్నట్లు సమాచారం. అంతా సవ్యంగా సాగి కళాశాలలన్నీ ఏకాభిప్రాయానికి వస్తే.. సాయంత్రానికి కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆదివారం షెడ్యూలు వెలువడితే.. సోమవారం నోటిఫికేషన్ వెలువరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీని ప్రకారం ఈ నెల 23వ తేదీనుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుంది.

టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆల్ ఇండియా టెక్నికల్ కౌన్సిల్ (ఏఐసీటీఈ) నిర్దేశించిన నిబంధనలు అమలు చేస్తున్నారా లేదా అనే అంశాలపై అధ్యయనం చేసేందుకు జిల్లా, ప్రాంతీయ, రాష్ట్రస్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ పేరుతో శనివారం రాత్రి దాదాపు 10 గంటలకు జీవో జారీ అయ్యింది. సుప్రీంకోర్టు సూచించిన మేరకు ఇప్పటికే 129 కళాశాలలు సమర్పించిన ఫీజుల ప్రతిపాదనలు, ఏఐసీటీఈ నిబంధనలను కళాశాలల్లో అమలు చేస్తున్నారా లేదా ఏఐసీటీఈ నిబంధనల మేరకు జీతభత్యాలు ఇస్తున్నారా లేదా తదితర అంశాలపై పూర్తిస్థాయిలో ఈ కమిటీలు తనిఖీ చేస్తాయి. జిల్లా కమిటీలు ప్రాంతీయ కమిటీలకు, ప్రాంతీయ కమిటీలు రాష్ట్ర కమిటీకి నివేదిక సమర్పిస్తాయి. 

జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్, టెక్నికల్ కౌన్సిల్ సూచించిన సీనియర్ ప్రొఫెసర్, రోడ్లు భవనాల శాఖ ఈఈ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నుంచి ఒకరు, లోకల్ ఫండ్ ఆడిట్ విభాగం అధికారి ఇందులో సభ్యులుగా ఉంటారు. ప్రాంతీయ కమిటీల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం రీజినల్ డెరైక్టర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు, రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ, లోకల్ ఫండ్ ఆడిట్ విభాగం రీజినల్ డెరైక్టర్‌లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర కమిటీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎస్.కె.సిన్హా, ఉమేష్ షరాఫ్, సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి, సాంకేతిక విద్య కమిషనర్‌లు సభ్యులుగా ఉంటారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!