YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 7 August 2012

బడుగుల చదువుకు పొగ

బడుగులకు ఉన్నత చదువులను దూరంచేయడానికి గత కొన్నేళ్లుగా పథకం ప్రకారం చేస్తున్న చర్యలు ఓ కొలిక్కి వచ్చాయి. వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థులకు పెరిగిన ఫీజులను చెల్లించరాదని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పేదరికం కారణంగా ప్రతిభగల ఏ విద్యార్థీ ఉన్నత విద్యకు దూరం కారాదన్న సదాశయంతో, సత్సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని సంపూర్ణంగా అటకెక్కించడం ఇక లాంఛనమే. ఇప్పుడిక రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ వర్గాల విద్యార్థుల ముందు ‘చదువుకోసం అప్పులపాలవడమా... చదువుకే పూర్తిగా దూరం కావడమా...’ అనే రెండే ప్రత్యామ్నాయాలున్నాయి. పేద వర్గాలకు సమాజంలో ఒక హోదానిచ్చి, ఆర్ధికంగా వారు ఎదగడానికి దోహదపడ్డ ఈ పథకాన్ని వైఎస్ మరణానంతరం వచ్చిన రోశయ్య ప్రభుత్వమైనా, ఇప్పటి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వమైనా క్రమేపీ నీరుగారుస్తూ వచ్చాయి. ‘గుడిసెలో పుట్టినవారు కూడా ఇంజనీరింగ్, మెడిసిన్‌వంటి ఉన్నత చదువులు చదవాలి. అప్పుడే ఆ కుటుంబాలు శాశ్వతంగా, సమగ్రంగా అభివృద్ధి చెందుతాయి’ అని 2008 జనవరిలో ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ప్రారంభిస్తూ వైఎస్ చెప్పారు. 

అంతేకాదు...విద్య కోసం పెట్టే ఖర్చును పెట్టుబడిగా చూడాలి తప్ప సంక్షేమ పథకాల మాదిరి చూడరాదని ఆ సందర్భంలోనే ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, సంతృప్త స్థాయికి ఉపకార వేతనాల విధానం ఆయన అమలు చేసిన తీరు రాష్ట్రంలోనే కాదు... దేశవ్యాప్తంగా ఎందరి మన్ననలనో పొందింది. ఈ రెండింటివల్లా లక్షలాదిమంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నతోద్యోగాలు సాధించారు. తరతరాలుగా తమను పట్టి పీడిస్తున్న పేదరికం నుంచి విముక్తులయ్యారు. ఈ పథకమూ, ఇతర పథకాల కారణంగా 2009లో ప్రజలు రెండోసారి సైతం కాంగ్రెస్‌కే అధికారం అప్పగించారు. 

ఒకపక్క ఆ పథకాలన్నీ పార్టీవీ, సోనియాగాంధీవీ మాత్రమేనని దబాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు వరసగా వాటిని అటకెక్కిస్తున్న వైనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉంది. వివిధ పోరాటాల ద్వారా ప్రజలను సమీకరిస్తూనే ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో వారంరోజులపాటు ‘ఫీజు పోరు’ దీక్ష కూడా చేశారు. 

ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ఎత్తేయడానికి పాలకులు ఏవిధంగా మాయోపాయాలు పన్నుతున్నారో గత రెండేళ్లనుంచి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చెప్పకచెబుతోంది. అంచెలంచెలుగా, వ్యూహాత్మకంగా ఈ పథకంపై బండలు వేస్తూ వస్తోంది. భారీ బడ్జెట్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని చెప్పకనే చెబుతున్న ప్రభుత్వమే... పేద పిల్లల చదువుల దగ్గరకొచ్చేసరికి బీద అరుపులు అరుస్తోంది. ఆదాయం ఎంతగా పెరిగినా ఖజానాను కాపాడుకోవడమే ఏకైక లక్ష్యమన్నట్టు మంత్రివర్గ ఉపసంఘం వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. లోగడ కూడా ఇలాగే ఉప సంఘం ముసుగులో పథకానికి అర్హులైనవారి సంఖ్యను కుదించేశారు. ఒక దశలో డిగ్రీని ‘కనీస విద్య’గా పరిగణించి, ఆ స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేయాలని చూశారు. పీజీ కోర్సులకు పథకం వర్తించకుండా చేద్దామనుకున్నారు. తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో దాన్ని విరమించుకున్నారు. 

ఆ తర్వాత మార్కులతోనూ, హాజరుతోనూ ముడిపెట్టి, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే విధానం పెట్టి, అందులో పొరపాట్లు దొర్లాయని చెప్పి, మధ్యలో కోర్సు మారారని సాకులు చెప్పి దాదాపు 2.5 లక్షలమందిని అనర్హుల్ని చేశారు. అన్నీ సరిగా ఉండి ఫీజు రీయింబర్స్‌మెంటుకు అర్హత సాధించినవారికి సైతం సకాలంలో ఫీజులు చెల్లించక ఇబ్బందులకు గురిచేశారు. బకాయిల కోసం కాలేజీల యాజమాన్యాలు పెడుతున్న ఒత్తిళ్లు భరించలేక, అటు ఫీజు కట్టే స్తోమత లేక ఎందరో విద్యార్ధులు మానసికంగా కుంగిపోయారు. చదువుపై దృష్టిపెట్టలేకపోయారు. రంగారెడ్డి జిల్లాలో వరలక్ష్మి అనే విద్యార్థిని ప్రాణం కూడా తీసుకుంది. వైఎస్ మరణించే నాటికి రూ. 500 కోట్లకు మించని బకాయిలు రెండేళ్లలోపే రూ. 3,500 కోట్లకు చేరాయి. ప్రస్తుత బడ్జెట్‌లో పాత బకాయిలను చెల్లించే విధానం ‘కనిపెట్టి’ వర్తమాన సంవత్సరం ఫీజుల చెల్లింపును గాల్లో దీపం చేశారు. 

సుప్రీంకోర్టు ఇచ్చిన ‘ఏకీకృతం’ తీర్పు సాకుగా ప్రభుత్వం పెట్టిన ఆంక్షల ప్రకారం ప్రకారం ఇంజనీరింగ్ కోర్సుకు కళాశాలనుబట్టి రూ. 50,200 నుంచి లక్ష దాకా ఫీజు ఉంటుంది. దాన్లో బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు రూ. 31,000 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన మొత్తం ఎంతైనా వారు అప్పులు చేసుకోవాల్సిందే. బ్యాంకులు అప్పులిస్తాయంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఆపద్ధర్మ కబుర్లే. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగూ కేంద్రమే సింహభాగాన్ని భరిస్తోంది గనుక ఆ వర్గాలకు మాత్రం ఈ పథకాన్ని కొనసాగిస్తారన్న మాట. మార్కులనో, హాజరునో ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు బీసీ సంఘాలేవీ అభ్యంతరపెట్టలేదు. చదువుపై దృష్టిపెట్టేవారికే, ప్రతిభ కనబరిచేవారికే ఇవ్వండని చెప్పాయి. 

ఆ సాకుతో కూడా ఈ వర్గాల విద్యార్థుల్ని వెళ్లగొట్టడం సాధ్యంకావడం లేదని ఇప్పుడు ఈ సరికొత్త నాటకానికి తెరలేపినట్టు కనిపిస్తోంది. కులమూ, డబ్బూ ప్రతిదాన్నీ నిర్ణయిస్తున్న సమాజంలో ఫీజు రీయింబర్స్‌మెంటులాంటి పథకాలు పేద వర్గాలకు ఆసరాగా నిలుస్తాయి. వారు ఉన్నత స్థానాలకు ఎదగడానికి దోహదపడతాయి. దివంగత నేత ఎంతో ముందు చూపుతో, ఉన్నతాశయంతో ప్రారంభించిన ఈ పథకాన్ని చిదిమేయాలని చూస్తే, పేదలకు ద్రోహం చేయాలని తలపోస్తే... ఆ వర్గాల ఆగ్రహాన్ని చవిచూడవలసివస్తుందన్న సత్యాన్ని సర్కారు గ్రహిస్తే మంచిది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!