YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 7 August 2012

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పాలసీ

దళిత, గిరిజనుల అభ్యున్నతికి నూతన విధానం
రూపకల్పనపై పార్టీ నేతల అధ్యయనం
సబ్‌ప్లాన్, ఇతర పథకాలు పక్కదారి పట్టకుండా చూడాలని నిర్ణయం
ఎస్సీ, ఎస్టీల సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం చూపేలా ముసాయిదా
వైఎస్సార్ ఉండుంటే సబ్ ప్లాన్‌కు ఎప్పుడో చట్టబద్ధత వచ్చి ఉండేది: జూపూడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: దళిత, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక విధానాన్ని (పాలసీని) తీసుకురావాలని యోచిస్తోంది. అంతేకాదు.. ఎస్సీ, ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన సబ్‌ప్లాన్‌తో పాటు పలు పథకాలు పక్కదారి పట్టకుండా అరికట్టాలని నిర్ణయించింది. 

ఈమేరకు నూతన ముసాయిదా రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, పలువురు నేతలు మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమై నూతన విధానం రూపకల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సమావేశం వివరాలను పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు బృందం మీడియాకు వెల్లడించింది. మహానేత వైఎస్ ఆశయ సాధన కోసం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళితుల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లనుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం చూపేలా ఒక ముసాయిదా రూపొందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనిని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామని, ఆయన ఆమోదం లభించాక వైఎస్సార్ కాంగ్రెస్ పాలసీగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పేదల కోసం వైఎస్ చేసినన్ని మంచి పనులు దేశంలో మరే ఇతర సీఎం చేయలేకపోయారని వివరించారు. ఎస్సీ, ఎస్టీల కోసం వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు, ఆయన రెక్కల కష్టంమీద ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. వైఎస్ ఉండుంటే సబ్‌ప్లాన్‌కు ఎప్పుడో చట్టబద్ధత వచ్చుండేదని చెప్పారు. మహానేత లేని లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందని, దళితులకు ఇది తీరని లోటన్నారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఎస్సీ, ఎస్టీ మాజీ కమిషనర్ మేరుగ నాగార్జున, సీజీసీ సభ్యుడు చందా లింగయ్య దొర, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు, మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలా కుమారి, మాజీ ఎమ్మెల్యే కె.రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!