YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 6 August 2012

మంత్రిగారి మహా మాయ. రూ.100 కోట్ల సర్కారు భూమి స్వాహాకు స్కెచ్

శంషాబాద్ విమానాశ్రయం సమీపాన వందెకరాల కబ్జాకు కుట్ర
‘అసైన్‌మెంట్’ ముసుగులో స్వాహా యత్నం
ఇప్పటికే అనుకూలంగా కసరత్తు షురూ
మంత్రికి జత కలిసిన మరో ఎమ్మెల్యే
అడ్డుతగులుతున్న కలెక్టర్ బదిలీకి సర్కారుపై ఒత్తిడి


రంగారెడ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఆయన రాష్ట్ర మంత్రి.. అధికార పార్టీలో ‘హడావుడి నేత’గా పేరు పొందారు. ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు ఎవరు హైదరాబాద్ వచ్చినా వారిని అంటిపెట్టుకుని ఉంటూ హవా ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తుంటారు. పార్టీ కార్యక్రమాలన్నీ తన కనుసైగలో సాగేలా అనుచరగణంతో హడావుడి చేయటం ఈయన ప్రత్యేకత. వీలు చిక్కితే చాలు వివాదాస్పద భూములను మాయం చేస్తుంటారు. కానీ ఎక్కడా పైకి ఆయన ప్రమేయం కనిపించదు.. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న అనుచరగణం కథ నడిసిస్తుం టుంది. ఇప్పుడు వీరి దృష్టి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో ఉన్న సర్కారు భూమిపై పడింది. ఒక టి కాదు రెండు కాదు... దాదాపు రూ.100 కోట్లకు పైగా విలువచేసే దాదాపు 100 ఎకరాలను స్వాహా చేసేందుకు సదరు మంత్రి సిద్ధమయ్యారు.

ఆ భూములకు ఫుల్ డిమాండ్: ఔటర్ రింగురోడ్డుకు అతి చేరువలో ఉండటంతో ఆ భూములక డిమాండ్ అంతాఇంతా కాదు. శంషాబాద్ విమానాశ్రయం వెనకవైపు ఉన్న చిన్న అనుబంధ గ్రామం బహదూర్‌గూడ. ఇది పెద్ద గోల్కొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ఈ గ్రామ శివారులో పక్కపక్కనే ఉన్న రెండు సర్వే నంబర్లలో 650 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. సర్వే నంబరు 62 పరిధిలో 500 ఎకరాలు, సర్వే నంబరు 28 పరిధిలో 150 ఎకరాలు ఉన్నాయి. స్థానిక రైతులు కొందరు వీటిని దశాబ్దాలుగా అనధికారికంగా సాగు చేసుకుంటున్నారు. ఖాస్రా, పహాణీ, 1955-58 రెవెన్యూ రికార్డుల్లో ఈ రెండు సర్వే నంబర్లలోని భూమి సర్కారుదే అని స్పష్టంగా ఉంది. వీటిని ‘కంచ సర్కారీ’ అని నాటి రికార్డుల్లో పేర్కొన్నారు. కొత్త పహాణీలో.. సర్వే నంబరు 62 భూమిని ‘కంచ సర్కారీ’ అని, సర్వే నంబరు 28 స్థలాన్ని ‘పోరంబోకు’ అని పేర్కొన్నారు. ఆక్రమణలో ఉన్న వ్యవసాయ భూములుగా అధికారులు రికార్డుల్లో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సదరు మంత్రిగారి కన్ను వీటిల్లోని రోడ్డుకు చేరువగా ఉన్న 100 ఎకరాలపై పడింది.

ఏడాది క్రితం నుంచే పావులు..: ఏడాది క్రితం నుంచే ఈ భూములు కొట్టేయడానికి ఆ మంత్రి ప్రణాళిక అమలు ప్రారంభమయ్యింది. తొలుత 50 ఎకరాలకు సంబంధించిన రైతుల వివరాలను సేకరించారు. అవి సర్కారు భూములని, ఎప్పటికైనా ఖాళీ చేయక తప్పదనే విధంగా వారికి సంకేతాలు పంపారు. అధికారులపై ఒత్తిడి చేస్తే వెంటనే తరిమేస్తారని, తన మాట వింటే ఎకరాకు ‘ఇంత’ అని ముట్టచెప్తానని నయానా భయానా వారిని దారికి తెచ్చుకున్నారు. తానిచ్చే డబ్బుతో మరోచోట పట్టా భూమి కొనుక్కుని సాగు చేసుకోవాలని సూచించారు. అనుకున్నదే తడవుగా కొందరు రైతులకు ఎకరాకు రూ.30 వేలు చొప్పున అడ్వాన్సు చెల్లింపులూ చేసేశారు. ఈ విధంగా సుమారు 50-70 మందికి డబ్బులు ఇచ్చి కాగితాలపై సంతకాలు కూడా తీసుకున్నారు.

గొంతులో ‘శేషాద్రి’: మిగతా డబ్బును కూడా రైతులకు ఇచ్చి భూమి స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు మంత్రిగారు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి రూపంలో ఇబ్బంది వచ్చి పడింది. గతంలో ఇదే జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా చేసిన అనుభవం ఉన్న శేషాద్రి ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో మంత్రిగారి కన్నుపడ్డ భూములపైనా దృష్టి సారించారు. వాటి వివరాలు తెప్పించుకుని, ఎప్పటికప్పుడు ఆ భూముల పరిస్థితిని తన ముందుంచాలని స్థానిక తహసీల్దారును అప్రమత్తం చేశారు. దీంతో మంత్రి గారి స్కెచ్‌కు మధ్యలో బ్రేక్ పడింది.

‘అసైన్‌మెంట్’ ఎత్తుగడతో స్వాహా మంత్రం..

శేషాద్రి ఉండగా కబ్జాపర్వం సాఫీగా సాగదని భావించిన సదరు మంత్రి కొద్ది రోజుల క్రితం అసైన్‌మెంట్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. తాము ఇక్కడ దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నందున ఆ భూములను తమకు అసైన్ చేయాలని రైతుల పేరిట సర్కారుకు వినతులు పెట్టించారు. ఆ అభ్యర్థన ఆధారంగా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యేలా ప్రభుత్వంలో చక్రం తిప్పారు. ఆ భూములను రైతుల పేర అసైన్ చేసేందుకు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కలెక్టర్ సమాధానం కోరింది. భూముల స్వాహా సన్నాహాలు పసిగట్టిన కలెక్టర్ .. ‘అసైన్ చేయటం సాధ్యం కాదు’ అని కుండబద్ధలు కొట్టేశారు. దీంతో మళ్లీ మంత్రిగారి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. ఇంతలో మంత్రిగారికి మరో ఎమ్మెల్యే జత కలిశారు. వీరిద్దరూ మరికొందరు బడా నేతలతో కలిసి ప్రభుత్వంలోని కొందరు ‘పెద్దల’కు వీటి విషయాలను చేరవేసి మార్గం సుగమం చేయాల్సిందిగా కోరారు. కలెక్టర్ శేషాద్రిని పక్కకు తప్పిస్తేనే ఇది సాధ్యమవుతుందని తేల్చేశారు. దీంతో కలెక్టర్ మార్పు అంశం ముఖ్యమంత్రి వరకు చేరింది. ఈ ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో శేషాద్రిని తప్పించేందుకు దాదాపు మార్గం సుగమమైందని సమాచారం.

రైతులతో భూములవద్దే మంతనాలు..: కలెక్టర్ బదిలీ అయ్యాక రైతులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసే అవకాశం ఉన్నందున ఈలోపే పదోపరకో విదిలించి వదిలించుకోవాలనే ఆలోచనతో మంత్రిగారు ఇటీవల ఆ రైతులను కలిశారు. కానీ రైతులు తమకు హీనపక్షంగా ఎకరాకు రూ.4 లక్షలన్నా ఇవ్వాలని అడిగారు. అంత డబ్బు ఇచ్చేందుకు ససేమిరా అన్న మంత్రి చర్చల కోసం నలుగురు ప్రతినిధులను తన ఇంటికి వచ్చి మాట్లాడాలని చెప్పి వెళ్లిపోయారు. ఇది జరిగి దాదాపు నెల దాటింది. తాజాగా సోమవారం 20 మంది వరకు రైతులు ఆ మంత్రిగారిని హైదరాబాద్‌లో కలిసినట్టు తెలిసింది. వారికి భూ విస్తీర్ణం ఆధారంగా రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అదనంగా చెల్లించి, గతంలో రాయించుకున్న పత్రాలపై అదనపు సంతకాలు తీసుకున్నట్టు తెలిసింది. ఈ రెండు మూడు రోజుల్లో మరికొందరు రైతులకు ‘రెండో వాయిదా’లు చెల్లించాలని నిర్ణయించినట్టు సమాచారం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!