YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 5 August 2012

తాగునీటి కోసం అంగలారుస్తున్న నగరవాసి

అరకొరగా.. అపరిశుభ్రంగా..
తాగునీటి కోసం అంగలారుస్తున్న నగరవాసి
శుద్ధ జలాలివ్వలేక చేతులెత్తేస్తున్న జలమండలి
సగం నగరానికైనా సరఫరా చేయలేని నిస్సహాయత
దాంతో భారీగా పెరిగిన మినరల్, ప్యాకేజ్డ్ నీటి వాడకం
రూ.1,800 కోట్లకు చేరిన ప్రైవేట్ వ్యాపారం
ప్రమాణాలకు పూర్తిగా తిలోదకాలిస్తున్న వైనం
విచ్చలవిడిగా దండుకుంటున్న వ్యాపారులు
అరక్షిత నీటితో ప్రజారోగ్యంతో చెలగాటం
అరికట్టాల్సింది పోయి చోద్యం చూస్తున్న సర్కారు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: జలమండలి వైఫల్యం ప్రైవేట్ వ్యాపారులకు కాసుల పంట పండిస్తోంది. ఒక్కొక్కటీ 20 లీటర్లుండే క్యాన్లు నగరంలో రోజూ కనీసం 20 లక్షల దాకా అమ్ముడవుతున్నాయని, అలా సగటున రూ.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని ఓ బహుళ జాతి మంచినీటి వ్యాపార సంస్థ తాజా సర్వే తేల్చింది. ఈ లెక్కన నెలకు రూ.150 కోట్ల చొప్పున ఎంతలేదన్నా ఏడాదికి కనీసం రూ.1,800 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఇది ఏటా కనీసం 20 శాతం చొప్పున విస్తరించే అవకాశం పుష్కలంగా ఉందని తేలింది. నగరంలో మంచినీటి వ్యాపారం లాభసాటిగా ఉండటంతో బహుళజాతి సంస్థలతో పాటు చిరువ్యాపారులు కూడా రంగంలోకి దిగారు. చాలామంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలను గాలికొదిలి విచ్చలవిడిగా ప్యాకేజ్డ్ నీటిని తయారు చేసి విక్రయిస్తున్నారు. నగరంలో ఐఎస్‌ఐ ప్రమాణాలున్న ప్లాంట్లు 250 అయితే, అనధికారికంగా వెలసినవి వేలల్లో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజూ అమ్ముడయ్యే 20 లక్షల నీటి క్యాన్లలో ప్రముఖ బ్రాండ్లవి కేవలం ఐదు లక్షలు. మరో ఐదు లక్షల క్యాన్లు ఐఎస్‌ఐ గుర్తింపు పొందిన ప్లాంట్లలో తయారవుతున్నాయి. అంటే సగానికి సగం నాసిరకపువేనన్నమాట!

శుద్ధి అంతంతే..!

నగరానికి ఉస్మాన్‌సాగర్ (గండిపేట్), హిమాయత్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా జలమండలి నిత్యం 34 కోట్ల గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తోంది. దీన్ని అరకొరగా మాత్రమే శుద్ధి చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం శుద్ధ జలంలో గాఢత (పీహెచ్) లీటరు నీటికి 6కు మించరాదు. కానీ తాజా లెక్కల ప్రకారం అది గండిపేట నీటిలో 7.78, హిమాయత్‌సాగర్‌లో 7.82, సింగూరులో 7.78, మంజీరాలో 7.82, కృష్ణా నీళ్లలో 7.88గా ఉంది! కరిగిన ఘన పదార్థాలు కూడా లీటరు నీటిలో 200 మిల్లీ గ్రాములకు మించొద్దు. కానీ ఉస్మాన్‌సాగర్‌లో 230, హిమాయత్‌సాగర్‌లో 230, సింగూరులో 248, మంజీరాలో 236, కృష్ణా నీటిలో కొన్నిసార్లు ఏకంగా 300 దాకా ఉంటున్నాయి! నీటి రంగు కూడా 5 హేలోజెన్ యూనిట్లు ఉండాల్సింది ఉస్మాన్‌సాగర్‌లో 13, హిమాయత్‌సాగర్‌లో 7, సింగూరులో 6, కృష్ణా జలాల్లో 6 ఉంటోంది. కుళాయిలో సరఫరా సమయంలో లీటరు నీటిలో క్లోరిన్ మోతాదు విధిగా 0.01 పీపీఎం ఉండాలి. కానీ పాతబస్తీతో సహా నగరంలోని పలు ప్రాంతాలకు క్లోరిన్ ఆనవాళ్లు అసలే లేని నీళ్లను సరఫరా చేస్తున్నారు. ఇలాంటి నీటిలో ఇ.కోలి, సిట్రోబ్యాక్టర్, పాథోజెన్స్ శరవేగంగా వృద్ధి చెంది జీర్ణకోశ వ్యాధులు, అతిసారం ప్రబలుతున్నాయి. కలుషిత జలాలపై వారానికి వందకు పైగా ఫిర్యాదులందుతున్నా పట్టించుకునే దిక్కే లేదు.

ఐఎస్‌ఐ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

ప్యాకేజీ వాటర్‌కు భారతీయ ప్రమాణాల సంస్థ 60 రకాల ప్రమాణాలను రూపొందించింది. వీటిని ఐఎస్14543:2004 నిబంధనలంటారు. వీటికి అనుగుణంగా ఉంటేనే వాటర్ ప్లాంట్లకు ఐఎస్‌ఐ మార్కు దక్కుతుంది. ఐఎస్‌ఐ ధ్రువీకరణకే ఏటా రూ.లక్ష ఖర్చవుతుంది. కానీ చాలా ప్లాంట్లు దీన్ని పట్టించుకోవడమే లేదు. వాటి నీటి ప్యాకెట్లలో కోలిఫాం, పాథోజెన్స్, ఇ.కోలి, సిట్రో బ్యాక్టర్ వంటి ఆనవాళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. ఇలా ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నా, వాటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమవుతోంది. ఐఎస్‌ఐ గుర్తింపు లేని ప్లాంట్లలో అపరిశుభ్ర పరిసరాలు, పారిశ్రామిక, మురికివాడలు, ఇరుకు గదుల్లో వెలిసినవే ఎక్కువ. 

ప్రమాణాలు ఇలా గాలికి..

అనధికారిక ప్లాంట్లలో 20 లీటర్ల నీటి శుద్ధికిమహా అయితే రూ.4 ఖర్చవుతుంది. దానికి రూ.25 నుంచి రూ.30 దాకా దోచుకుంటున్నారు. ఐఎస్‌ఐ ప్రమాణాలున్న నీటి శుద్ధికి రూ.15 దాకా ఖర్చవుతుంది. దానికి మార్కెట్లో రూ.35 నుంచి రూ.80 వరకూ పలుకుతోంది.
నీటిని నింపేందుకు పాలిథిలిన్, పాలివినైల్ క్లోరైడ్, పాలీ ప్రొపిలీన్‌లతో తయారైన సీసాలు, క్యాన్లే వాడాలి. 20 లీటర్ల క్యాన్ల ధర రూ.280 నుంచి రూ.400 దాకా ఉంటుంది. దాంతో రూ.100 నుంచి 120 లోపులో దొరికే నాసిరకం పెట్ బాటిల్స్ వాడుతున్నారు. వాటిలో బ్యాక్టీరియా త్వరలో వృద్ధి చెందుతోంది.

బాటిళ్లను శుద్ధి చేశాక 48 గంటల తర్వాతే వాటిలో మంచినీటిని నింపాల్సి ఉన్నా వెంటనే నింపేస్తున్నారు. దాంతో నీటి గాఢత పడిపోయి, తాగిన వారికి గొంతు సంబంధిత సమస్యలు వస్తున్నాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!