YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 8 August 2012

ముడుపులకు ఎక్కడైనా లాభాలొస్తాయా?


ప్రభుత్వం నుంచి వాన్‌పిక్ ప్రాజెక్టును పొందినందుకు ప్రతిఫలంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ రూ.854.5 కోట్లు పెట్టుబడి పెట్టారనేది సీబీఐ చేస్తున్న ప్రధాన అభియోగం. తెలుగుదేశం, ఇతర పక్షాలు నానా యాగీ చేస్తున్నది కూడా ఈ పెట్టుబడి పెట్టినందుకే. అందులో కొంత వాటాను ఆయన ఇప్పటికే విక్రయించారని, ఇంకా ఆయన ఇన్వెస్ట్‌మెంట్లు రూ.505 కోట్ల వరకూ మిగిలాయని సీబీఐ వాదిస్తోంది. ప్రసాద్‌ను అరెస్టు చేసినపుడు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులోనూ ఇదే అంశాలు వెల్లడించింది.

అసలు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు ఎప్పుడు మొదలయ్యాయి? ఆయన జగతి పబ్లికేషన్స్‌లో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టింది 2007 ఆగస్టులో. భారతి సిమెంట్స్‌లో రూ.280 కోట్లు పెట్టుబడి పెట్టింది కూడా అదే ఏడాదిలో. అప్పటికి వాన్‌పిక్ సంస్థ కాదు కదా... దాని ఊసేలేదు. అప్పటికింకా స్కోడా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే అమల్లో ఉంది. మరి వాన్‌పిక్‌ను పొందినందుకే ప్రసాద్ పెట్టుబడులు పెట్టారనటం కరెక్టా?

జగతిలో ముందు రూ.50 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ప్రసాద్... దానికి కొనసాగింపుగా 2008లో మరో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాక... 2010 ఏప్రిల్లో భారతి సిమెంట్స్‌లో మెజారిటీ వాటాను ఫ్రాన్స్ కంపెనీ వికా కొనుగోలు చేసింది. ఈ సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించగా, ప్రసాద్‌తో పాటు మిగిలిన ఇన్వెస్టర్లూ తమ వాటాను పూర్తిగా వికాకు విక్రయించేశారు. ఇలా విక్రయించినపుడు ప్రసాద్‌కు తన పెట్టుబడి పోను రూ.308 కోట్ల లాభం వచ్చింది. అంటే మూడేళ్లలోనే ఆయనకు రెట్టింపు లాభం వచ్చిందన్న మాట. ఈ లాభానికి మరో రూ.42 కోట్లు కలిపి రూ.350 కోట్లను 2010 ఏప్రిల్-మే మధ్య జగతి పబ్లికేషన్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. మరి వాన్‌పిక్‌ను పొందినందుకే ఇదంతా చేశారనటం ఎంతవరకూ సమంజసం?

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కాదు కదా అసలు బతికే లేనపుడు చేసిన పెట్టుబడిని ఏ లాభానికి ప్రతిఫలంగా చేశారంటారు? ఈ లెక్కన చూసినపుడు ఇప్పటికీ జగతిలో ప్రసాద్ పెట్టుబడులు రూ.450 కోట్లు ఉన్నట్టే. కాకపోతే దాన్లో రూ.308 కోట్లు భారతీ సిమెంట్స్‌లో వాటా విక్రయించగా వచ్చిన లాభం పోను ఆయన నికర పెట్టుబడి రూ.142 కోట్లే. మరి మున్ముందు జగతి పబ్లికేషన్స్ సంస్థ పబ్లిక్ ఇష్యూకు వెళ్లినా, లేక ప్రైవేటు ఇన్వెస్టర్లు దీన్లో వాటాలు కొనుగోలు చేసినా ప్రసాద్‌కు తన పెట్టుబడికి తగ్గ లాభాలు రావా?

ముడుపులకు ఇలా లాభాలొచ్చే అవకాశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? టీడీపీ తదితర పక్షాలు, సీబీఐ వాదిస్తున్నట్లుగా ఇది క్విడ్ ప్రో కో అయితే లాభాలెందుకొస్తాయి? ముడుపులకు ఎక్కడైనా లాభాలొస్తాయా? అసలు ప్రసాద్ ఇన్వెస్ట్ చేసింది ఒక్క ‘సాక్షి’లోనే కాదు కదా? అప్పటికే మీడియా రంగంలోని మా టీవీలోను, కేర్ ఆసుపత్రి, ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వంటి హెల్త్‌కేర్ పరిశ్రమల్లోనూ పెట్టుబడులు పెట్టిన ప్రసాద్‌ను... తన ఇన్వెస్ట్‌మెంట్లలో భాగంగానే జగన్ సంస్థల్లోనూ పెట్టినట్లుగా భావించలేరా? అసలు వాన్‌పిక్‌ను అన్ని నిబంధనలూ పాటించి ఒక భారీ అభివృద్ధి ప్రాజెక్టు వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం కేటాయించినపుడు... దానికోసం ఆ సంస్థ వందల కోట్ల ముడుపులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!