మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాంఛి స్పోర్ట్స్‌మన్! ఆయన్ను ఒలింపిక్స్‌కు పంపివుంటే పతకాలు కుప్పతెప్పలుగా కొట్టుకొచ్చేవాడని సీపీఐ నారాయణ అంతటివాడు చెప్పారు గదా! ఇక కేంద్రంలో పెటోల్రియమ్ శాఖ మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డిగారు గొప్ప గేమ్‌స్టర్. రాజకీయ క్రీడలో మాఖియవెలీని మించినవారాయన. అలాంటి హేమాహేమీలు ఇద్దరూ రంగంలోకి దిగితే, చెప్పాలా? ఆట మహ రంజుగా సాగదూ?!
ప్రస్తుతం వీళ్లిద్దరూ కుమ్మక్కై జనానికి గ్యాస్ కొడుతున్నారు. మన రాష్ట్రంలో దొరికే సహజవాయువును సుశీల్ కుమార్ షిండే -కేంద్ర ఇంధన శాఖ మంత్రిగా దిగిపోతూపోతూ- మింగేశారని కిరణ్ కుమార్ గొడవ చేస్తున్నారు. అంతేకానీ, తాను కునికిపాట్లు పడుతూ ఉండడం వల్లనే అది సాధ్యమయిందని ఆయన చెప్పరు! తాను కేంద్రంలో పాగా వేసి ఉన్నందువల్లనే ఇంతకాలం రాష్ట్రం జెండా ఎగురుతూ వచ్చిందని జైపాల్ రెడ్డి జబ్బలు చరుచుకుంటున్నారు. మరి షిండే మన వాయు నిక్షేపానికి ఎలా కన్నమేసి ఎత్తుకెళ్లారో ఈయనా చెప్పడు!
మొత్తానికి ఇద్దరూ ఆటగాళ్లూ పోటుగాళ్లూ కావడం వల్లనే ఇది సాధ్యమయిందనే విషయాన్ని జనం ఏనాడో గ్రహించారు.
‘ఏమయ్యా పెద్దమనిషీ, నువ్వు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడివి కదా! నీ హయాంలో ఇది జరగవచ్చునా అని నన్ను మనవాళ్లడుగుతున్నారు. అది అడగవలసిన ప్రశ్నే’ అంటూనే జైపాల్ ఓ విడ్డూరమయిన ప్రతివాదం చేస్తున్నారు. ‘మరి నేను పదకొండు నెలలపాటు మనవాళ్లకు సహజవాయువును వినియోగించుకునే అవకాశం ఇచ్చాను గదా! నేను కేంద్రంలో పదవిలో ఉండడం వల్లనే అది సాధ్యమయింది!’ అన్నది జైపాల్ వాదన. తానుగాక మరెవరు ఆ పదవిలో ఉన్నా ఈ పదకొండు నెలలు కూడా మన రాష్రానికి ఇంత సహజవాయువు లభ్యమయివుండేది కాదని కూడా జైపాల్ తేల్చిచెప్తున్నారు. అంతేకాదు- కేంద్రంలో అధికారంలో ఉన్నందువల్ల మన రాష్ట్రానికి అదనంగా మేలు సమకూర్చినట్లు చెప్పుకోగలిగే అవకాశం కూడా తనకు కరువయిందని ఆయన వాపోయారు. ఇతర రాష్ట్రాలవారెవరయినా, తాను సొంత రాష్ట్రం పై పక్షపాతం చూపించానని ఆరోపణ చేస్తే, ఏ పార్లమెంటులోనో నిలదీస్తే తానేం చెప్పుకోవాలని జైపాల్ రెడ్డి మనల్నే ప్రశ్నిస్తున్నారు.
కేంద్రమంత్రి చెప్తున్న కబుర్లన్నీ కల్లలేనని ముఖ్యమంత్రి -పరోక్షంగా- ఎత్తిపొడుస్తున్నారు. గత పాతిక ముప్పయ్ సంవత్సరాలుగా ఎన్నడూ ఇంత ఇంధన కొరత లేదని లెక్కలతో సహా తేల్చిచెప్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. అనగా- గత పదకొండు మాసాలుగా తానేదో ధారపోశానని జైపాల్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలేనన్నమాట! ఇప్పటికే మూడు కోట్ల యూనిట్ల కొరత ఉందనీ, త్వరలోనే మరో కోటి యూనిట్ల కొరత వచ్చే సూచనలున్నాయనీ ముఖ్యమంత్రి వెల్లడించారు. తద్వారా, మన రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ ఎంత సుందరముదనష్టంగా ఉందో ఆయనే బయటపెట్టుకున్నారు. దాంతోపాటుగా జైపాల్ రెడ్డి హయాంలో కొత్తగా ఒరగదోసిందేమీ లేకపోగా, ఉన్నది ఊడగొట్టడమే జరుగుతోందని గణాంకాలతో సహా రుజువు చేస్తున్నారాయన.
కాగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సహజవాయువు మన రాష్ట్రానికి ఇప్పిస్తానని ఉదారంగా చెప్పానని జైపాల్ మీడియాతో చెప్తున్నారు. దానికి కూడా పెద్దగా సావకాశం లేకపోయినా, సొంత చొరవమీద సాధిస్తానని ఆయన చెప్తున్నారు. కాకపోతే, అలా చెయ్యడం వల్ల కొంత ఎక్కువ ఖర్చవుతుందనీ, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించక తప్పదనీ జైపాల్ అంటున్నారు. ‘మన రాష్ట్రంలో ఉత్పత్తయినది కావడం వల్ల రిలయెన్స్ గ్యాస్ ఖరీదు తక్కువగా ఉండేది. అదెవరికో ధారబోసి, ఎక్కువ ధరకు విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న సమజవాయువును కొనుక్కోవలసిన ఖర్మ మనకేం పట్టింది?’ అని నిలదీశారు కిరణ్ కుమార్ రెడ్డి. ‘ఇక్కడ దొరికే సహజవాయువు మహారాష్ట్రకు ఇచ్చేదీలేనిదీ మీ ఇష్టం. మన రాష్ట్రంలో దొరికే రిలయెన్స్ గ్యాస్‌ను ఇక్కడి విద్యుత్కేంద్రాల వినియోగానికి ఇచ్చిన తర్వాతే ఏమయినా చేసుకోండి!’ అని -చాలా చాలా ఆలస్యంగానే అయినా- ముఖ్యమంత్రి కుండ బద్దలుకొట్టినట్లు చెప్పేశారు ముఖ్యమంత్రి.
ఇదిలావుండగా మన రాష్టానికి చెందిన గ్యాస్ ను మహారాష్ట్రకు తరలిస్తుంటే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఏం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఆపలేకపోయిన ఆయన తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. మంత్రుల సాధికార కమిటీలో సభ్యులుగా ఉన్న కేంద్ర మంత్రులు మురళీదేవరా, షిండేలు గ్యాస్‌ను అక్రమంగా తమ రాష్ట్రానికి తరలించుకుపోతుంటే అదే కమిటీలో సభ్యుడిగా ఉన్న జైపాల్ రెడ్డి కళ్లు ఎందుకు మూసుకున్నారని రాంబాబు ప్రశ్నించారు. జైపాల్‌రెడ్డి తెలుగు ప్రజలకే కాదు, దేశప్రజలకు కూడా జవాబు చెప్పాలన్నారు. తక్షణమే రత్నగిరి కేటాయింపులు రద్దు చేయాలన్నారు. జైపాల్‌రెడ్డి సహా మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న నలుగురు కూడా రాజీనామా చేయాలన్నారు. గ్యాస్ తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని రాంబాబు అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహోద్యమం చేస్తుందని హెచ్చరించారు.
ఈ విధంగా కేంద్రమంత్రి- ముఖ్యమంత్రి పింగ్‌పాంగ్ ఆడుతూ రాష్ట్రాన్ని -ముఖ్యంగా రైతాంగాన్ని- అల్లాడిస్తున్నారు. అయితే, ఇలాంటి ఆటలు ఎంతో కాలం సాగవని ఈ క్రీడాకారులిద్దరూ గ్రహించడం మంచిది.
No comments:
Post a Comment