YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 9 August 2012

బాబు ‘బాట’వెలవెల. పూర్తిగా విఫలమైన వాన్‌పిక్ వ్యతిరేక యాత్ర

ఆద్యంతం సహాయ నిరాకరణ చేసిన నిజాంపట్నం
బాబు రాకను నిరసిస్తూ స్థానికుల స్వచ్ఛంద బంద్ 
మంచినీరూ దొరక్క రేపల్లె నుంచి తెచ్చుకున్న వైనం
అట్టహాసంగా వెళ్లిన చంద్రబాబుకు అవమానాల స్వాగతం 
స్థానికులు ఒక్కరైనా లేకుండా నిజాంపట్నంలో సభ


నిజాంపట్నం (గుంటూరు), న్యూస్‌లైన్: రాజకీయ లబ్ధే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం గుంటూరు జిల్లాలో చేపట్టిన వాన్‌పిక్ పోరుబాట పూర్తిగా విఫలమైంది. ఎక్కడికక్కడ వెల్లువెత్తిన స్థానికుల వ్యతిరేకత మధ్య ఆయన యాత్ర ఆద్యంతమూ వెలవెలపోయింది. వాన్‌పిక్ సిటీకి సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలనే డిమాండ్‌కు వారి నుంచే వ్యతిరేకత ఎదురైంది. 

రైతులకు మేలు జరిగి, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే సహించలేకపోతున్నారంటూ బాబుపై స్థానికులు దుమ్మెత్తిపోశారు. నిజాంపట్నంలోనైతే ఆయన సభను వారు బహిష్కరించారు. పైగా బాబు పర్యటనకు నిరసనగా ఉదయం నుంచే దుకాణాలను, హోటళ్లను స్వచ్ఛందంగా మూసేశారు. దాంతో టీడీపీ నేతలు, కార్యకర్తలకు మంచినీళ్లు కూడా దొరకలేదు! ఇక కాలినడకన, కాన్వాయ్‌లో 10 కిలోమీటర్లు ప్రయాణించినా.. ఒకట్రెండు గ్రామాల్లో తప్ప జనమెవరూ రాకపోవడంతో బాబు కంగుతిన్నారు. ప్రజలు వలస వెళ్లారంటూ సర్దిచెప్పజూశారు. అంతలోనే.. రౌడీయిజంతో వారిని అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. పట్టలేని నిరాశతో.. షెడ్యూల్‌లో ఉన్నా, పలు గ్రామాలకు వెళ్లకుండానే వెనుదిరిగారు. ఇక వాన్‌పిక్ భూములు దున్నండన్న బాబు పిలుపును కూడా రైతులు ఆట్టే పట్టించుకోలేదు. చివరికి స్వయంగా నాగలి పట్టి ఏరువాక సాగించబోయినా, ఎద్దు నుంచి కూడా ఆయనకు సహాయ నిరాకరణే ఎదురైంది!


నిజాంపట్నానికి ఉదయం 10.30కు రావాల్సిన చంద్రబాబు, అక్కడ జనం లేరనే సమాచారంతో నింపాదిగా మధ్యాహ్నం 2.50కి చేరుకున్నారు. అయినా జనం లేక అక్కడ తలపెట్టిన బహిరంగ సభ వేదిక పూర్తిగా వెలవెలపోతూ కన్పించింది. నిజాంపట్నం వాసులంతా దూరంగా వుండి సహాయ నిరాకరణ చేశారు. మెయిన్ బజారు సెంటర్‌ను వేదికగా ఎంచుకున్నా వ్యాపార, దుకాణాలను ముందుగానే మూసేయటంతో బంద్ వాతావరణ మే రాజ్యమేలింది. స్థానికులెవరూ అటుకేసి చూసిన పాపాన పోకపోవడంతో తెనాలి, రేపల్లె తదితర మండలాల నుంచి తరలించిన టీడీపీ కార్యకర్తలతో కవర్ చేసేందుకు విఫలయత్నం జరిగింది. వారికి కూడా కనీసం మంచినీళ్లయినా అందక, రేపల్లె నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది. దాంతో ఆగ్రహాన్ని అణచుకోలేక పోయిన బాబు, ఇది పులివెందుల కాదనీ రౌడీయిజానికి పాల్పడితే అంతు చూస్తామని ఊగిపోయారు. ‘‘మంత్రి తమ్ముడు బంద్ చేయించాడు. మంచినీళ్లు కూడా లేకుండా చేశాడు. షాపులు మూయించటం, మంచినీళ్లు లేకుండా చేయడం, సభకు ఎవరూ రావొద్దనడం అనాగరికం. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి చోటా రౌడీలను చాలామందిని చూశాను. నేనొచ్చినపుడే ఇంత దౌర్జన్యం చేశారంటే , మీ కథ తేలుస్తాను’ అంటూ పోలీసులను హెచ్చరించారు.

ఖాకీ బట్టలకు న్యాయం చేస్తారో, ప్రజల్లో చులకనవుతారో తేల్చుకోండంటూ హూంకరించారు. చిన్న చిన్న రౌడీల కోరలు తీస్తానన్నారు. అక్కడ్నుంచి పాదయాత్రగా బయల్దేరినా బాబు వెంట బ్లాక్ క్యాట్ కమెండోలు, రోప్ పార్టీ పోలీసులు, టీడీపీ నేతలే తప్ప జనం కన్పించలేదు. చానళ్లకు ఇంటర్వ్యూలిస్తూ ఆయన ముందుకు సాగారు. అదవల, పరిశావారిపాలెంలో అక్కడక్కడా మినహా మరే గ్రామంలోనూ ప్రజలు కన్పించలేదు. దాంతో, భూములు కోల్పోయిన రైతులు పనులు కోసం వలసలు వెళ్లడమే కారణమని బాబు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అదవల నుంచి బయల్దేరాక వర్షం రావడంతో కాన్వాయ్‌లో ముందుకు సాగారు. పరిశావారిపాలెంలో వాన్‌పిక్ భూముల్లో బాబు ఏరువాక చేశారు. కానీ ముందుగా తీసుకొచ్చిన ఎద్దు దున్నకుండా మొరాయించింది. దాంతో మరో ఎద్దుల జతను తెప్పించి దున్నారు. తర్వాత అడవుల దీవిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి సభలో మాట్లాడటంతో పోరుబాటను ముగించారు. షెడ్యూలులో ఉన్నా నర్రావారిపాలెంలో కాన్వాయి ఆగలేదు. మహ్మదీయపాలెం, అడవులదీవి దళితవాడను సందర్శించలేదు.

ప్రచారం కోసమే బాబు యాత్ర వాన్‌పిక్ పోరుబాటపై రైతుల నిరసన

వాన్‌పిక్ పోరుబాట పేరిట నిజాంపట్నం నుంచి యాత్ర ప్రారంభించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు స్థానిక రైతుల నుంచి అనూహ్య నిరసన ఎదురయ్యింది. ఈ సందర్భంగా రైతులువ్యక్తం చేసిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ‘‘ చంద్రబాబు ఎందుకొచ్చారో మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఎవరికీ అన్యాయం జరగలేదు. గతంలో ఇక్కడ ఉన్న భూముల పూర్తిగా చవుడు భూములు. ఎకరా 30 వేల నుంచి 40 వేల రూపాయలు మాత్రమే ఉండేది. వాన్‌పిక్ రావడంతో ఎకరాకు లక్ష నుంచి రెండు లక్షల వరకు చెల్లించడం జరిగింది. రైతులు పిల్లల్ని చదివించుకుని, పెళ్లిళ్లు చేసి, ఇళ్లు కట్టుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ప్రచారం కోసం ఆర్భాటం చేస్తున్నారు. ఆయన హయాంలో రైతులు గ్రామాలొదిలి పోయారు. రైతుల గురించి ఆయనకేం తెలుసు. అసలిక్కడ ఏం అన్యాయం జరిగిందని చంద్రబాబు యాత్ర చేపట్టారు?’’

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!