రైల్వే ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణకు, రైళ్లలో భద్రతా ఏర్పాట్లను పటిష్టపర్చడానికి, అలాగే రైలు బోగీల్లో ఉపయోగించే సామగ్రిలో మండే స్వభావం ఉన్నవాటిని క్రమేపీ తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు అందించాలని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన గత నెల 30వ తేదీన చోటుచేసుకున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాద ఘటనను ప్రస్తావించారు. చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు సమీపాన చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మహిళలు, పిల్లలతో సహా 30మందికిపైగా అమాయక ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారని చెప్పారు.
ఒక ప్రమాదం జరిగిన ప్రతిసారీ విచారణకు ఆదేశించడం, సిఫార్సులు చేయడం, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టడం చేయడానికి నిధులు లేవంటూ రైల్వేలు చెప్పడం పరిపాటిగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి ప్రమాదాలకు సంబంధించి ప్రతి ఒక్క కోణాన్ని స్పశిస్తూ లోగడ విచారణ కమిటీలు సమర్పించిన నివేదికల్లో పలు సిఫార్సులు అమలుకోసం ప్రభుత్వం వద్ద నిరీక్షిస్తున్న వైనాన్ని గుర్తుచేశారు. ఆయా కమిటీలు ఇచ్చిన సిఫార్సుల ప్రకారం రైల్వేలు సంస్కరణలను అమలుచేయలేకపోతున్నాయని, చాలినన్ని నిధులు లేకపోవడం, ప్రణాళికా సంఘం నుంచి బడ్జెట్‌పరంగా తోడ్పాటు అందాల్సివుండటం దీనికి ప్రధాన కారణాలని తెలిపారు. ఇది ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశమైనందున ఇప్పటికైనా రైల్వేలకు ఉదారంగా నిధులు ఇవ్వాలని కోరారు.
No comments:
Post a Comment