తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మనసులో ఒకటి ఉంటుంది. బయటకు ఒకటి మాట్లాడుతారు. ఆయన రాసుకున్న మనసులో మాట పుస్తకమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్రంలో పెట్టుబడులకు తగిన వాతావరణం కల్పించాలని అంటూనే, వేరే ప్రభుత్వాల హయాంలో పెట్టుబడులు, భూ కేటాయింపులపై విషం చిమ్ముతున్నారు. వ్యాపార సంస్థలకు ఆయన భూములు కేటాయిస్తే తప్పు కాదు. వేరే వాళ్లు కేటాయిస్తే మాత్రం పెద్ద నేరం. అందుకే చంద్రబాబు భూపందేరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అనేకసార్లు నిలదీశారు. చంద్రబాబు హయాంలో జరిగిన భూ పంపిణీపై సీబిఐ ఎందుకు విచారణ జరపదని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు "మనసులో మాట". ఆ పుస్తకం కవర్ పేజీ మీద " తగిన వాతావరణాన్ని కల్పించినట్లయితే భారతదేశం సుసంపన్నం అవుతుందని ధృడంగా విశ్వసించే వ్యక్తి కలం నుంచి వెలువడ్డ గ్రంథం " అని ఉంది. ఇక్కడ తగిన వాతావరణం అంటే పెట్టుబడులు రావడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడం అని చంద్రబాబు అభిప్రాయం. ఇదే సూత్రం ఆధారంగా పారిశ్రామికవేత్తలకు ఆయన వేల ఎకరాల భూమి పంపిణీ చేశారు. ఆ భూముల విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది.
పెట్టుబడులకు అనువైన వాతావరణం పేరుతో చంద్రబాబు కేటాయించిన భూముల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
శంషాద్‌బాద్ ఎయిర్‌పోర్టుకు 5,500 ఎకరాలు
వైజాగ్ ఫార్మా సిటీకి 2,143 ఎకరాలు
గంగవరం పోర్ట్ కు 1800ఎకరాలు
కాకినాడ పోర్టుకు 354 ఎకరాలు
కృష్ణపట్నం పోర్టుకు 2000 ఎకరాలు
ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు 535 ఎకరాలు
డాబర్‌కు 1000 ఎకరాలు
ఓరియంటల్ సిమెంట్స్ కు 820ఎకరాలు
బీచ్ శాండ్ కు 1700 ఎకరాలు
పోలెపల్లి సెజ్ 1200 ఎకరాలు
కాకినాడ సెజ్ కు 8000 ఎకరాలు
రహేజాకు 109 ఎకరాలు
ఆగాఖాన్ ఫౌండేషన్ కు 100 ఎకరాలు
కేటలిస్ట్ సాప్టువేర్ కు 50 ఎకరాలు
ఇన్ఫోసిస్ కు 50 ఎకరాలు
మైక్రోసాప్ట్ కు 42 ఎకరాలు
విప్రోకు 30 ఎకరాలు
కంప్యూటర్ అసోషియేట్స్ కు 30 ఎకరాలు
హైటెక్ సిటీకి 80 ఎకరాలు
ఐవిఆర్ సిఎల్ కు 50ఎకరాలు
మణికొండలో ఐటీ పార్క్ కు 49ఎకరాలు
మహేశ్వరం హార్డ్‌వేర్ పార్క్‌కు 9 ఎకరాలు
ఐఎంజీ భారత్ కు 850ఎకరాలు
మలేషియా టౌన్‌షిప్ కు 35 ఎకరాలు
సింగపూర్ టౌన్‌షిప్ కు 80 ఎకరాలు
ఒక్క మాటలో చెప్పాలంటే బాబు హయాంలో కేటాయించిన మొత్తం భూమి 26వేల 634 ఎకరాలు. అప్పట్లోనే దీని మార్కెట్ విలువ లక్షా 64 వేల 420 కోట్ల రూపాయలు.
1995 నుంచి 2004 వరకు బాబు 97వేల 919 ఎకరాలు మైనింగ్ లీజుకు ఇచ్చారు. గ్రానైట్ క్వారీల లీజులు 259 ఇచ్చారు. సగటున 25 ఎకరాలు చొప్పున వేసుకున్నా 6 వేల 475 ఎకరాలు లీజుకు ఇచ్చారు. గ్రానైట్ కాకుండా ఇతరత్రా లీజులు కింద 32వేల 585 ఎకరాలు ఇచ్చారు. 2000-2004 మధ్య అత్యంత విలువైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ లీజుల సంఖ్య 155 ఉంది. వీటి విస్తీర్ణం 363.9 హెక్టార్లు. వజ్రాల అన్వేషణ పేరుతో డీ బీర్ అనే సంస్థకు 25 లక్షల ఎకరాలు ఇచ్చారు. ఇలా పెట్టుబడులకు అనువైన వాతావరణం పేరుతో ఎన్ని భూములు పందేరం చేశారో ఆయనకే తెలియాలి.
లక్షల ఎకరాల భూమిని అప్పణంగా కట్టబెట్టిన చంద్రబాబు వాన్‌పిక్ భూముల్లో పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉంది. ఆయన పాదయాత్రకు స్థానికుల నుంచి స్పందనలేదు. ఎవరూ ఆందోళనకు దిగకపోయినా ఆయనే వెళ్లి అక్కడ రచ్చ చేశారు. ఆయన వస్తున్నారని తెలిసి స్థానికులు బంద్ చేశారంటే వారు చంద్రబాబుకు ఇచ్చిన గౌరవం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఏ ఉద్దేశంతో ఆయన అక్కడ పాదయాత్ర చేశారు? ఆయన ఇన్ని లక్షల ఎకరాలు ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఆయన ఇస్తే పారిశ్రామిక ప్రగతి. మరొకరు ఇస్తే మాత్రం రాద్దాంతం చేస్తారు. ఈ విషయాలను ప్రజలు గమనించరనుకోవడం అవివేకం. వాన్‌పిక్ భూముల్లో పాదయాత్ర చేసిన చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? వారు బాబు వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇటువంటి పాదయాత్రలు పారిశ్రామిక ప్రగతికి ఎంత విఘాతం కలిగిస్తాయో ఆయనకు తెలియదా? తగిన వాతావరణం కల్పించడమంటే ఇదేనా? వీటన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పవలసి ఉంటుంది.
లక్షల ఎకరాలు పంపిణీ చేసిన చంద్రబాబు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూములపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. ఆయన కేటాయిస్తే సక్రమమైనప్పుడు, వైఎస్ కేటాయిస్తే అక్రమం ఎలా అవుతుంది. ఆయన చెప్పే మాటలు వినడానికి జనం ఆమాయకులు ఏమీకాదు. వారికి అన్నీ తెలుసు. అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు. వారికి ఉన్న ఒకే ఒక ఆయుధంతో తగిన విధంగా తీర్పు ఇచ్చారు. ఇకముందు కూడా ఇస్తారు.
No comments:
Post a Comment