YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 6 August 2012

ఫీజులు తేలకుండానే షెడ్యూలా? ప్రభుత్వ వింత పోకడ

మరింత గందరగోళం సృష్టించే చర్యలు
తనిఖీలంటూ కాలేజీలపై బ్లాక్ మెయిలింగ్
ఆలస్యమవుతుందనుకుంటే రాజీకి రావాలని హెచ్చరికలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఫీజుల గందరగోళానికి ప్రభుత్వం తెర దించుతుందనుకుంటే.. అందుకు విరుద్ధంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరింత అయోమయంలోకి నెట్టేసింది. ఫీజెంతో తేల్చకుండానే, 8వ తేదీన వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను వెల్లడిస్తామని ప్రకటించింది. పాత ఫీజుల వరకు మాత్రమే చెల్లిస్తామంటూ తప్పించుకుందే తప్ప, కనీసం మొత్తం ఫీజు ఎంతుంటుందో స్పష్టం చేయడంలో కూడా విఫలమైంది. చివరికి కాలేజీలే దిగిరావాలనే తరహా వ్యాఖ్యలతో బ్లాక్‌మెయిలింగ్‌కూ దిగుతోంది. రాజీకి రాకుంటే తనిఖీలు తప్పవంటూ పరోక్ష హెచ్చరికలూ జారీ చేసింది!

ఆద్యంతం ప్రభుత్వ వైఫల్యమే..

కామన్ ఫీజుండాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైంది. తద్వారా విద్యార్థులపై 64 శాతం అదనపు భారం పడేందుకు కారణమైంది. తనపై భారాన్ని తగ్గించుకోవడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. ఇప్పటిదాకా ఫీజులను ప్రతి మూడేళ్లకోసారి నిర్ధారిస్తున్నారు. అంటే ప్రస్తుత ఫీజుల అమలు వ్యవధి 2010-11, 2011-12, 2012-13లకు వర్తించాలి. కానీ 2010-11, 11-12లకు కామన్ ఫీజుండాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఇప్పుడు 2012-13కు మాత్రం ఫీజును నిర్ధారించాల్సి వస్తోంది. కానీ అందుకు ఏ ప్రాతిపదికను ఎంచుకోవాలన్న సమస్య తలెత్తింది. 2010లో ఇంజనీరింగ్‌కు 70 శాతం కన్వీనర్ కోటా సీట్లకు రూ.31 వేలు, మేనేజ్‌మెంట్ కోటాలోని సీట్లకు రూ.95 వేలు ఫీజు నిర్ధారించారు. దీన్ని కామన్ ఫీజుగా మారిస్తే రూ.50,200 అవుతుంది. వేతన వ్యయ నివేదికలు సమర్పించిన 133 కాలేజీలకు ఫీజుల ప్రతిపాదనలు రూపొందించడంలో ఈ సంఖ్యనే అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) మదర్ ఫిగర్‌గా తీసుకుంది. అలా చూస్తే ఇంజనీరింగ్ ఫీజులు 64 నుంచి 385 శాతం దాకా పెరుగుతున్నాయి. అంటే పెంపు కనీసంగా రూ.20 వేల నుంచి గరిష్టంగా రూ.1,05,000 దాకా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఉన్నట్టుండి మళ్లీ కొత్త పల్లవి అందుకుంది. ఐదేళ్లుగా ఏఎఫ్‌ఆర్సీ పనితీరు బాగా లేదని ప్రకటించింది. అందుకు కూడా తానే కారణమన్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించి.. ఇప్పుడు భారం పడేసరికి.. మదర్ ఫిగర్ ప్రాతిపదికను మరోసారి అధ్యయనం చేయాలని.. ఫీజు తగ్గించే మార్గాలు చూడాలని అధికారులకు తాజాగా సూచించింది. కానీ అది సాధ్యం కాదని వారంటున్నారు.

బెదిరింపు ధోరణి..

ఫీజుల ప్రతిపాదనలు రూపొందించాలంటే కాలేజీలిచ్చిన వ్యయ నివేదికలపై ఏఎఫ్‌ఆర్సీ క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని, ఇందుకు 3 నెలలన్నా పడుతుందని ప్రభుత్వం తాజాగా చేస్తున్న వ్యాఖ్యల మతలబు వేరే ఉందంటున్నారు. కాలేజీలు వాటంతటవే దిగొచ్చేలా చేసేందుకే ఈ ఎత్తు వేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలు ఆలస్యమవుతాయని కాలేజీలు భావిస్తే ఏకాభిప్రాయంతో చర్చలకు రావాలన్న ప్రభుత్వ సూచనలు వాటికి బలం చేకూరుస్తున్నాయి. 133 కాలేజీకు ఏఎఫ్‌ఆర్సీ చేసిన ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా బయటపెట్టడం లేదు. తద్వారా.. కాలేజీలు ఎంత త్వరగా దిగొస్తే అంత త్వరగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడుతుందని సర్కారు చెప్పకనే చెబుతోందంటున్నారు. ఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదనలు రూపొందించని ఇంజనీరింగ్ కాలేజీలన్నీ రాజీకొస్తే వాటిలో ఫీజు కాస్త పెరిగి రూ.35 వేలవుతుంది. మిగతా 133 కాలేజీల్లో మాత్రం రూ.50,200 నుంచి రూ.1.24 లక్షల దాకా ఉంటుందని ప్రభుత్వం సంకేతాలిస్తోంది!

ఆ కాలేజీల్లోనూ భారీ ఫీజులే

ఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదనలు రూపొందించిన 133 ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 80 వేల సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా సీట్లు 55 వేలు. వాటిలో 46 వేల సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని అంచనా. కానీ బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు ఇకపై కూడా ప్రభుత్వం రూ. 31 వేలే చెల్లిస్తుంది. కామన్ ఫీజు రూ.1.24 లక్షలుండే కాలేజీలో చేరాలంటే విద్యార్థులు సొంతంగా రూ.93 వేలు చెల్లించాలి! వార్షికాదాయమే లక్ష కూడా ఉండని కుటుంబం నుంచి వచ్చేవారికి అది సాధ్యమేనా? అంటే నిరుపేద విద్యార్థులు ప్రతిభ ఉన్నా ప్రమాణాల్లేని కాలేజీల్లో చేరాల్సిందేనా? వాటిలో కూడా కనీస ఫీజు రూ.50,200 కానుంది. అంటే ప్రభుత్వమిచ్చేది పోను విద్యార్థి రూ.20 వేలు కట్టాల్సిందే!

ఏఎఫ్‌ఆర్సీకి వ్యయ నివేదికలు సమర్పించని 550 కాలేజీల్లో కన్వీనర్ కోటాకు అర్హులైన దాదాపు 90 వేల మంది విద్యార్థులకు ఇకపై కామన్ ఫీజు, అంటే రూ.50,200 ఉండనుంది. అందులో ప్రభుత్వం రూ.31 వేలిస్తే మిగతా 20 వేలు విద్యార్థులు భరించాల్సి ఉంటుంది.

కమిటీ చెప్పిందిదీ..

ప్రభుత్వంపై ఫీజు రీయింబర్స్‌మెంట్ భారాన్ని తగ్గించుకునే మార్గాంతరాల సూచనకు ఏర్పా టైన నిపుణుల కమిటీ సోమవారం ఇచ్చిన నివేదికను మీడియాకు వెల్లడించలేదు. సిఫార్సులు ఇంకా ఖరారే కాలేదని ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు కమిటీ సిఫార్సులు ఇలా ఉన్నాయి..

కమిటీ సూచించిన ప్రత్యామ్నాయాలు
1వ మార్గం: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించడం
2వ మార్గం: ఎస్సీ, ఎస్టీలకు మినహా ఇతరులకు శ్లాబ్ పద్ధతిలో నిర్ధారిత మొత్తం మాత్రమే చెల్లించి సరిపెట్టడం (ఇంటర్‌కు ప్రభుత్వం రూ.1,415 మాత్రమే రీయింబర్స్‌మెంట్ ఇస్తుండగా, విద్యార్థులు మాత్రం కార్పొరేట్ కాలేజీల్లో చేరేందుకు రూ.40 వేల దాకా చెల్లిస్తున్నారంటూ కమిటీ విశ్లేషణ కూడా పొందుపరిచింది)

3వ మార్గం: మెరిట్ ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌ల సాయంతో లబ్ధిదారులను తగ్గించడం
4వ మార్గం: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇంటర్, డిగ్రీ, పీజీ సాధారణ విద్యకే పరిమితం చేసి.. వృత్తి విద్యా కాలేజీలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లతో సరిపెట్టడం
5వ మార్గం: మొత్తం బడ్జెట్‌ను రూ.3,000 కోట్లకే పరిమితం చేసి, దాన్ని కోర్సువారీగా విభజిం చడం. మిగతా భారాన్ని విద్యార్థులపై మోపడం

6వ మార్గం: రీయింబర్స్‌మెంట్‌ను డిగ్రీ వరకే వర్తింపజేయడం. మిగతా వారికి బ్యాంకు తదితర రుణాలు తీసుకుని ఫీజు కట్టుకోవాలని సూచిం చడం. వాటిపై వడ్డీ రాయితీ వంటివి ఇవ్వడం
ప్రత్యామ్నాయాల నుంచి కమిటీ చేసిన తుది సిఫార్సులు
రీయింబర్స్‌మెంట్‌ను అందరికీ ఇవ్వాలి. కానీ దాన్ని ప్రస్తుతమిస్తున్న మొత్తానికే పరిమితం చేయాలి.
మిగతా భారం ఎంతైనా సరే.. దాన్ని విద్యార్థులే భరించాలి
కావలిస్తే అందుకోసం వారికి వడ్డీరహిత రుణం అందించాలి. లేదంటే వడ్డీపై పాక్షిక రాయితీ ఇవ్వాలి
ఎస్సీ, ఎస్టీలకు దాదాపుగా కేంద్రమే నిధులిస్తున్నందున మొత్తం ఫీజును రీయింబర్స్ చేయాలి
కాలేజీల్లో ఏఎఫ్‌ఆర్సీ, యూనివర్సిటీలు విసృ్తత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలి
బాగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలివ్వాలి

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!