YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 9 August 2012

ఇతరుల సొత్తు నాదేనని బుకాయించడం

‘ఇతరుల సొత్తు నాదేనని బుకాయించడం కన్నా సిగ్గు చేటయిన విషయం లే’దన్నాడో పెద్దమనిషి. లేకేం? ఉందని తొడ చరిచి చెప్తున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అవును మరి- మహానేత వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను బాబు -సిగ్గులేకుండా- సొంతం చేసుకోవడం అంతకన్నా సిగ్గు చేటయిన విషయమే కదా! మీకేమన్నా అనుమానాలుంటే, చంద్రబాబు తాజా వేషం చూడండి.

ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు మొత్తాలను వాపసు చెయ్యాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు చంద్రబాబు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు కొన్ని బీసీ విద్యార్థి సంఘాలు మద్దతు కూడా ప్రకటించాయి. బాబు స్కెచ్ ప్రకారమే, పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని వదిలేశారు. ఈ మొక్కుబడి వ్యవహారమంతా, బంజారా హిల్స్ ప్రాంతంలో జరగడం కొసమెరుపు. ఈ ప్రాంతంలో ఎందరు బీసీలు ఉన్నారో బాబుకే తెలియాలి.

ఇంతకీ, చంద్రబాబు నాయుడికి బీసీ విద్యార్థుల సంక్షేమం గురించి పట్టింపు మొదలై ఎన్ని గంటలయిందో? ఎనిమిదిన్నరేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ మహానుభావుడు తన హయాంలో బీసీ విద్యార్థుల కోసం ఎన్నెన్ని సంక్షేమ చర్యలు -సొంత చొరవ మీద- తీసుకున్నారో ఆయనెలాగూ చెప్పడు. కనీసం, బాబు ఆందోళనకు మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాలయినా ఈ లెక్కలు బయటపెడితే బాగుంటుంది. అయినా, బాబు గారి సంక్షేమావతారం ఎవరికి తెలియంది? ఇప్పటికీ ఆయన కబుర్లకు మోసపోతున్న వాళ్లెవరన్నా మిగిలితే, ఒక్కసారి బాబు జమానా విశేషాలు పరిశీలిస్తే సరిపోతుంది.

సరేనండీ- చంద్రబాబుకు బీసీలూ ఎస్సీలూ నిరుపేదలూ అభివృద్ధి చెందడం ఇష్టంలేదు! అందుకే, వాళ్ల అభ్యున్నతికోసం ఆయనే చర్యలూ చేపట్టలేదు. అందుకు ఇప్పుడెవరూ బాబును తప్పుపట్టడంలేదు. అయితే, మహానేత వైఎస్‌ఆర్ నాలుగేళ్ల కిందటే ప్రవేశపెట్టిన పథకాన్ని -దానికి బీసీ విద్యార్థులూ వాళ్ల కుటుంబ సభ్యుల నుంచి విశేషమయిన స్పందన రావడం గమనించి- లటుక్కున తన్నుకుపోవాలన్న గద్ద బుద్ధి ఉందే, దానికే అభ్యంతరం చెప్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చంకలో దూరి సొంత పనులన్నీ జరిపించుకుంటున్న టీడీపీకి అప్పుడప్పుడు తాను ప్రతిపక్షాన్నని గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒక్కసారి జూలు విదిలించి ‘ఆందోళన’కు దిగుతుంటుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదయినా కార్యక్రమం తలపెట్టిన సందర్భాల్లో టీడీపీ జూలువిదిలింపులు కొంచెం ‘ఎగస్ట్రా’గా ఉండడం కద్దు. 

ఇప్పుడూ అదే జరిగింది. ఈనెల 12, 13 తేదీల్లో -పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో- ఫీజు వాపసు పథకం అమలు సక్రమంగా జరిపించాలన్న డిమాండ్‌తో సహా విద్యార్థుల సంక్షేమం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షకు కూర్చోవాలని తలపెట్టారు. ఇటీవల ఫీజు వాపసు పథకం విషయంలో అటు ప్రభుత్వం- ఇటు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలూ పీటముడి బిగించి, బీదా సాదా విద్యార్థుల పీకలు పిసికేందుకు కుట్ర పన్నిన సంగతి అందరికీ తెలిసిందే. పదవుల మాంసంముక్కలు దక్కించుకున్న ప్రభుత్వ నేతలు మాత్రం చాలా రోజులు పడక సీనులో నిద్ర నటించారు.

చెవులు పగిలే ప్రమాణానికి చేరిన విద్యార్థుల ఉద్యమం వాళ్లు కళ్లు తెరవకతప్పని పరిస్థితిని సృష్టించింది. దానికి తోడు విజయమ్మ దీక్షకు లభిస్తున్న స్పందన ఒకటి! దాంతో ఏలూరు దీక్ష సమయం దగ్గిరయ్యే కొద్దీ చంద్రబాబు బీపీ ఎగదన్నడం మొదలుపెట్టింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి కన్నా ముందే ఏదో ఒకటి చేసేసి, సొడ్డు అనెయ్యాలని బాబు ఆత్రపడ్డారు. దాని ఫలితమే ఆయన చేపట్టిన ‘ఆందోళన’!

బీసీ ఉద్యమకారుల వత్తిడితో నోరు విప్పిన మంత్రి దానం నాగేందర్ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ధర్నా నాటకం- అరెస్ట్ అంతర్నాటకం విడ్డూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ వీథి నాటక ప్రదర్శన రక్తి కట్టడానికి తమ సర్కారు సంపూర్ణంగా సహకరించిన విషయం ఆయన చెప్పనూ లేదు- ఎవరూ అడగనూ లేదనుకోండి! అయినా, తాను ప్రభుత్వంలో భాగంగా ఉన్న సంగతి మర్చిపోయినట్లు ప్రవర్తించడం నాగేందర్‌కు పరిపాటే- పాతపాటే!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!