వృత్తి విద్యా కళాశాలల ఫీజుల వ్యవహారం మరొక సారి దుమారం లేపింది. ప్రభుత్వం తన విధానాలను తానే పరిమార్చే దుస్థితికి దిగజారింది. ఇంతటి కీలక అంశంపైన ఊగిసలాడటం రాష్ట్ర ప్రభుత్వానికి మంచి చేయదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ఇప్పుడు కేవలం ఒక సంక్షేమ కార్యక్రమం కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రజలను దేశ పునర్ని ర్మాణంలో భాగస్వాములను చేయటానికి చేపట్టిన బృహత్ కార్యక్రమం. ప్రపంచంలోని అన్ని దేశాలు సంపద ఉత్పత్తికి యువతీ యువకులను సన్నద్ధం చేయటానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఫీజు రీయిం బర్స్‌మెంటు వసతిని ఒక వర్గానికి కల్పించి, మరొక వర్గానికి నిలిపివేయటం, తద్వారా పేదలను విభజించాలని చూడటం... విద్యార్థుల జీవితాలతో ఆట లాడుకోవటం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ తిరోగమన ధోరణే ఆందోళనలకు విద్యార్థులను పురికొల్పుతుంది. దీంతో అశాంతి, అలజడి నిత్యకృత్యం అవుతాయి. చదువులు కుంటుపడతాయి. కాబట్టి సమ స్యకు పరిష్కారం వెతకటమే తక్షణ కర్తవ్యం.
ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తమాన భారత విద్యార్థి లోకానికి జవజీవాల నిచ్చే దివ్యౌషధం. సంపద సృష్టికి ఫీజు రీయింబర్స్‌మెంటు గట్టి పునాది. మానవ వనరులను ఉత్పత్తి చేసేందుకు ఇది ప్రధాన సాధనంగా రూపుదిద్దు కుంది. విద్యాలయాలు కేవలం డిగ్రీలిచ్చి నిరుద్యోగ బెటాలియన్లను తయారు చేయటం కాకుండా వారిని దేశ ఆర్థికవ్యవస్థలో భాగస్వాములను చేయాలి. ప్రాధాన్యతాక్రమంలో ఎవరిని ముందు ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి? ఈ ‘మానవ సంపద’ మునుముందు ఎవరి ఇంట కాలుమోపాలి? మన సమాజాన్ని చుట్టుముడుతున్న అన్ని సమస్యలకు ఉన్నత చదువుల ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుంది. ప్రజా సమస్యలపై ఉన్న వైఖరే ఆయా ప్రభు త్వాల స్వభావాన్ని బయటపెడుతుంది.
ఇది సాంకేతిక యుగం. మనకు వనరులున్నాయి. ఉన్న ముడి వనరులను ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసం విద్యాలయాలు సాధనం కావాలి. ఆ సాధనలో బడుగువర్గాలను పాత్రధారులుగా చేస్తే ఉత్పత్తి, పంపిణీలపైనే గాక సంపదపై కూడా వారికి హక్కు ఏర్పడుతుంది. ఫలితంగా దేశ సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగి అందరి జీవన ప్రమాణం కూడా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. పెట్టుబడిదారీ దేశాల్లో ఉత్పత్తి పెరుగుతున్నది కానీ, ఆ ఉత్పత్తి ఫలాలు సామాన్యునికి అందటం లేదు. కాబట్టే అక్కడి సమాజంలో అగాథాలు దినదినం పెచ్చుమీరి, సామాజిక సంక్షోభాలకు కారణం అవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు సంపదను పెంచడంతో ఆగక సమాజంలో పాతుకుపోయిన అసమానతలను తగ్గించేందుకు పాటుపడాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో పేదలను భాగస్వాములను చేయటం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచటం, సంపదపై హక్కు కల్పించడం ప్రతిపల్లెను ‘మాదాపూర్’గా మార్చటం ఫీజు రీయింబర్స్‌మెంటు తత్వం, లక్ష్యం.
ప్రపంచ దేశాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని వివిధ రూపాల్లో అమలుపరుస్తున్నాయి. కొన్ని దేశాలు ప్రభుత్వ ఆధీనంలోనే విద్యాలయాలను తెరిచి సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలను ‘హ్యూమన్ క్యాపిటల్’ (మానవ పెట్టుబడి)గా మారుస్తున్నాయి. లాటిన్ అమెరికన్ దేశాల్లో ప్రస్తుతం అమలవుతున్నది ఈ విధానమే. ఈ దేశాల ప్రజలు తద్వారా ప్రపంచ అభివృద్ధికి రాయబారులవుతున్నారు.
ఆఫ్రికా అడవుల్లోని పేద ఆదివాసులకు డాక్టర్లుగా సేవచేస్తున్నారు. కొన్ని దేశాలు చాలినన్ని వనరులు లేక ప్రైవేట్ రంగానికి సాంకేతిక విద్యాలయాలను అప్పగించారు. దేశ అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం దక్కినందుకు ప్రైవేట్ వ్యక్తులు ఎందరో సంతోషంగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే, ప్రైవేట్ యాజమాన్యాలు కొన్ని ఇదే అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నాయి. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఒక వైపున కఠినమైన శాసనాలు చేస్తూ, మరో వైపున నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ఆర్థికపరమైన సహాయం అందిస్తున్నాయి. ఆర్థిక సహాయం చేసేటప్పుడు రెండు సమస్యలు ఉత్పన్నమవుతాయి. మన లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంతరాలతో కూడిన అసమానతలు ఉన్నాయి. ఇక్కడ నూటికి 85 శాతం దళితులు, గిరిజనులు, బీసీలు ఉన్నారు. సామాజిక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థ నుంచి వేరుచేసి చూడటం ఇక్కడ సాధ్యం కాదు. ఇక్కడ వర్గం, కులం ఒక్కటైపోతాయి. దళిత విద్యార్థులకు కేవలం విద్యాపరమైన సహాయమే కాకుండా సామాజికంగా ‘కల్చరల్ క్యాపిటల్’ కూడా అందించాలి. అంటే బడికి వచ్చే స్థోమతను కూడా కల్పించాలి. అందుకు గాను ప్రభుత్వం విద్యాలయాల పరిధిని దాటి వారి యోగక్షేమాలపై శ్రద్ధ వహిస్తూ, వారి పనితనాన్ని పెంచడానికి ఆర్థిక సాహాయం అందించాలి. దాన్ని తమ విధిగా భావించాలి. దశలవారీగా ఈ సహాయం అందిస్తూ ఉండాలి. విద్యాపరమైన అంశానికి వస్తే దళితులు, బీసీల పరిస్థితి దాదాపుగా ఒకటే. బీసీలకు తమ పిల్లలను బడికి పంపించాలనే చైతన్యం ఉంది కానీ ఆర్థికస్థోమత లేదు. దళితలకు పిల్లలను బడికి పంపించే చైతన్యంతో పాటు స్థోమత కూడా కలిగించాలి. ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి పొందే హక్కు వీరిద్దరికీ సమంగా ఉందని చెప్పవచ్చు. కాబట్టి వీరిద్దరి మధ్యన తేడా చూడటం సమంజసం కాదు.
బీసీల్లో ఆర్థికంగా చితికిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. వారంతా శ్రమజీవులు. సాంకేతిక విజ్ఞానం శ్రమజీవుల హస్తగతమైతే నూతన సృష్టికి ఆస్కారం ఏర్పడుతుంది. శోధన-పరిశోధన మిక్కుటమవుతాయి. మన కళలన్నీ శ్రమజీవుల చేతుల్లోంచి వచ్చినవే. విద్యుదయస్కాంత శక్తిని కనుగొన్న మైకెల్ ఫారడే ఏం చదువుకోలేదు. ఆయన ఓ మత్స్యకారుడు. శ్రమజీవి చేతికి సాంకేతిక పరిజ్ఞానం అందితే కొత్త ఆవిష్కరణలు చేస్తాడని చెప్పడానికి ఫారడే జీవితం ఓ నిదర్శనం. మన దేశంలో ఉన్నత విద్య సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమై ఉండటం వలన పరిశోధన కుంటుపడింది. మెదడు, చేయి... రెండూ పనిచేస్తేనే సంపద ఉత్పన్నమవుతుంది. అందుకే అన్ని దేశాలు దాదాపు అటుఇటుగా శ్రమజీవులకు ఫీజు రీయింబర్స్‌మెంటు ద్వారా చదువులను అందజేశాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఇతరేతర దృష్టితో చూడటం జ్ఞానానికి తలుపులు మూసేయటమే. బొగ్గుగనిలో ఉన్న కూలీకి పరిజ్ఞానం అందజేస్తే వాళ్లు ఎలాంటి పరిశోధనలు చేస్తారో ఒక్కసారి ఊహించండి!
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం భవిష్యత్తు నిర్మాణానికి సోపానం అని నేనంటున్నది ఇందుకే! ఇది ఖర్చుతో కూడుకున్న పనే, కానీ ఇది పెట్టుబడి అని మరచిపోవద్దు. ఒక తరం త్యాగం చేస్తేనే సమాజంలో చిరకాలంగా ఏర్పడిన పొరలు తొలగుతాయి. అయితే ప్రభుత్వాలు అందజేసే ఆర్థిక సహాయాన్ని ప్రైవేట్ యాజమాన్యాలు కైంకర్యం చేయడం వల్ల లక్ష్యసాధన వాయిదా పడటమేకాక నిలిచిపోతున్నది. ప్రైవేట్ యాజమాన్యాలను నియంత్రించలేక పాలకులు బీసీలకు, ఓసీ పేదలకు పంగనామాలు పెట్టాలని చూడటం దారుణం. రీయింబర్స్‌మెంటుపై పెట్టే ఖర్చు శుద్ధ దండుగ అని భావించడం తప్పు. మన పాలకులకు పుండు ఒకచోట ఉంటే మందు ఇంకోచోట పెట్టే అలవాటు ఉంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చే ప్రయత్నం చేయకండి. కాలేజీలు పటిష్టంగా నడిచే విధంగా ప్రయత్నం చేయండి. కొన్ని ప్రపంచ దేశాలు ఈరోజున నిర్లక్ష్యానికి గురైన వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయటానికి, ఆ వర్గాలకు సాంకేతిక పరిజ్ఞానం అందించటానికి బ్యాంకుల ద్వారా రుణ వసతి కల్పించాయి. బ్యాంకింగ్ సౌకర్యాలు ఎక్కడ ఉపకరిస్తాయో అధ్యయనం చేయాలి. బ్యాంకింగ్ రంగంపై నియ్రంతణ లేమి వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. అమెరికాలో ఆహార దినుసుల ధరవరలను అదుపులో పెట్టారే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నియంత్రించలేక పోయారు. ధరలు నియంత్రించలేప్పుడు బ్యాంకింగ్ సౌకర్యాలు ఆర్థిక సంక్షోభానికి కారణమవుతాయి. మన దేశంలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించే దశలో లేము కనుక, పేదలకు బ్యాంకుల రుణాలతో సమస్యను పరిష్కరించగలమని భావించడం అత్యాశే అవుతుంది. అందుకే ఇలాంటి నిరర్థక ప్రత్యామ్నాయాల జోలికి పోకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను యథావిథిగా, తు.చ. తప్పకుండా కొనసాగించాలి. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి ఫలితంగా, ప్రభుత్వం పునరాలోచనకు సిద్ధపడటం శుభ పరిణామం! ఫీజు రీయింబర్స్‌మెంటు విధానంలో ఎట్టి మార్పులుండవని ప్రకటించి ప్రభుత్వం పొంచి ఉన్న పెను సామాజిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు, లోటుపాట్లు ఎన్ని ఉన్నా, ఉన్నత విద్యను పేద విద్యార్థులందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా సమాజ మౌలిక పరివర్తనకు మార్గం వేయడం పాలకుల విద్యుక్త ధర్మం!
No comments:
Post a Comment