తొలి రోజు మాదిరిగానే శుక్రవారం కూడా చంద్రబాబు ఆందోళనకు ప్రజల మద్దతు కరువైంది. యాత్ర పొడవునా ఎక్కడా ఆయన వెంట కనీసం వంద మంది రైతులు కూడా కన్పించలేదు. గుండాయపాలెం వద్ద మాట్లాడేందుకు బాబు కారు దిగినా, 50 మంది కంటే ఎక్కువ కనిపించకపోవడంతో మళ్లీ కారెక్కి వెళ్లిపోయారు. పాతపాడులో పలువురితో కలిసి ట్రాక్టర్లతో పొలాలు దున్నారు. అయితే ఆ ట్రాక్టర్లతో పాటు జనాలను కూడా వాన్‌పిక్ పరిధిలో లేని ఊళ్ల నుంచే తరలించారు! పాతపాడులో వాన్‌పిక్ భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో టీడీపీ నేతలు ఫెన్సింగ్ తొలగించడాన్ని గుండాయపాలెం యువకులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రాళ్లను పడగొట్టడానికి మీరెవరంటూ వారు ఆగ్రహించారు.
హెలికాప్టర్‌లోంచి నిఘా పెట్టారేమో: బాబు
పాతపాడుతో చంద్రబాబు పాదయాత్ర జరుగుతుండగా ఒక హెలికాప్టర్ తక్కువ ఎత్తులో వెళ్లింది. దాన్ని చూపిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికీ విస్మయం కలిగించాయి. ‘ఈ హెలికాప్టర్‌ను ప్రభుత్వమో, వాన్‌పిక్ కంపెనీయో పంపి ఉంటాయి. నా ఆందోళనకు లభిస్తున్న జన స్పందన చూసేందుకు ఇలా పై నుంచి వచ్చి ఉంటారు. మా పోరాటాన్ని చూడటం తప్ప పైనుంచి వాళ్లేమైనా బాంబులు వేస్తారా?’’ అని బాబు అనడంతో అంతా నోరెళ్లబెట్టారు.
మీడియాపై చిందులు
వాన్‌పిక్ తమ పొలాలను కారుచౌకగా లాక్కుందంటూ సంకే ఏడుకొండలు అనే టీడీపీ కార్యకర్తతో పాటు మరో ఇద్దరు మొర పెట్టుకోవడంతో ముందూ వెనకా చూసుకోకుండా బాబు రెచ్చిపోయారు. ‘రాజకీయ మాఫియా, బడా పారిశ్రామికవేత్తలు కలిసి పేదలను బెదిరించి వారి భూములు లాక్కున్నారు’ అంటూ ఆగ్రహించారు. జైలుకు వెళ్లయినా వారికి భూములిప్పిస్తామన్నారు.
కానీ ఆ ముగ్గురూ నిజానికి తమ భూములను ఆక్వా చెరువులకు అమ్ముకున్నారు! అది కూడా 2003 కంటే కూడా ముందు. బాబు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. పైగా, నచ్చనప్పుడు భూములను ఎందుకు అమ్ముకున్నారని వారిని ప్రశ్నించిన మీడియాపైనా చంద్రబాబు ఫైర్ అయ్యారు. ‘వాన్‌పిక్‌పై మీడియా ఇష్టమొచ్చినట్టు స్టోరీలు రాస్తోంది. మా పోరాటానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే మీడియా వ్యవహారం కూడా బయటకు తీస్తా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
No comments:
Post a Comment